Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మూలన షెల్ఫ్ లో దాగిన కళ్ళజోడు
మసక అద్దమై అగుపిస్తోంది
తను వెలుగు పంచిన ఆ కళ్ళకోసం
ఎదురుచూపులవుతోంది...
తలనొప్పికి రాసుకునే బాము
మూత దాటి బయటికి రావాలంటోంది
అనుభవాలసారమై కనిపించిన
ఆ నుదుటి గీతల కరిగి పోవాలంటోంది...
గోడన బల్లి షఉ అనే మాట విని చాన్నాళ్లయ్యింది
అలికిడి లేని గదిలో ఒంటరియై తిరుగుతోంది...
రోజూ కాళ్ళకు రాసుకునే నొప్పుల తైలం
చిక్కని దైన్యపు బాటిలై పిలుస్తోంది
ఆప్యాయంగా పలకరించే ఆ చేతివేళ్ళ స్పర్శకై
నిత్యం ఎదురుచూస్తూ వుంటోంది...
కిర్రుమని శబ్దం చేసే మంచం
మూగభాష పలుకుతోంది
విశ్రాంతి జీవితానికి సాంత్వన నిచ్చిన పరుపు
దిగులు రాగం వినిపిస్తోంది...
ఇంట్లో నానమ్మ రూము ఉంది
రూములో జ్ఞాపకం బతికివుంది...
- అశోక్ గుంటుక 9908144099