Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడూ ఇంతే
ఎల్లప్పుడూ అంతంతే
బాల్యంలో కాలివేళ్లకు
పోట్రౌతులు తాకిన చోటనే తాకి తాకి
వేళ్ళు రక్తాలు కారి కారి
గోర్లు ముడి గట్టుకు పోయినప్పుడు
కాళ్లకు సి. ఎస్. సి. స్లిప్పర్లుంటే బాగుండుననుకున్నాను
కడుపునిండా తిండి దొరకని దగ్గర
నాకు నేనే కోరికను ఊకోపెట్టాను
కాలం ధరులకు తాకులు తాకి
సొట్టలు పోయి చిల్లులు పడ్డ
బతుకు బొక్కెన
ఉద్యోగం దొరికేసరికి
ఈడు నడినెత్తి మీదికి రానే వచ్చింది
పోయి రానూ
సైకిల్ ఉంటే మంచిది అనుకున్నాను
ఎల్లీ ఎల్లని కుటుంబంలో అసాధ్యమని
నాకు నేనే సముదాయించుకున్నాను
సహజాతాల వికసన ఆకాశంలో
ఆమెతో బతుకు
పరీమళ వ్యాప్తమవుతున్నప్పుడు
పడకగది ప్రత్యేకంగా ఉంటే
ఎంత సవులతుగా ఉండేదని
మురిసి ముచ్చట పడ్డాను
చాలీచాలని సంసారం లో
బెడ్ రూమ్ స్వప్నం
గాజు గ్లాసులా
జారి ముక్కలు ముక్కలు అయిపోయింది
మూడు గదుల కిరాయ కొంపలో
మేము పిల్లలూ
కుదిచ్చిన వడ్ల బస్తాలా గుదిగుచ్చినప్పుడు
సొంత ఇల్లు కల కన్నాను
జమాఖర్చుల లెక్కల బొక్కలు తేలి
సంబరం ఇప్పట్లో తీరదని
నాలో నేనే అణచివేసుకున్నాను
ప్రస్తుత సమయంలో
వైద్యులు చెప్పులు జాగ్రత్త
షుగర్ కదా పుండైతే మానదంటే
స్లిప్పర్ల కోరికకు తప్పు అయిందని
చెంపలు వేసుకున్నాను
పొద్దు వాలుతున్న వయస్సులో
డాక్టర్లు నడక మంచిదన్నారు
జీవనయానంలో
సైకిల్ సరదాకు
పోచమ్మ ముంగట పోసే
సాకలా నీళ్లు ఆరగించాను
గూళ్ళు కదులుతున్న స్థితిలో
అవయవాల స్థితిస్థాపకలు
పడకగది స్వప్నం చెప్పాపెట్టకుండా
పత్తా లేకుండా పరార్ అయిపోయింది
అదేందో కానీ
జీవితం ఎప్పుడయినా
అడుగు దూరంలో
దాగుడు మూతలు ఆడుతూ వ్వె...వ్వె...వ్వే... వెక్కిరిస్తూనేవుంది
- జూకంటి జగన్నాథం
9441078095