Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోట బొక్కెనతో తోడిన నీళ్లు
తెల్లారగట్ల నిదుర కలల్ని మింగిన కన్నీళ్లు
కొలకు కొల
నేలను చాళ్లకింద విడదీసిన
నాగలికర్రు గీసిన గీతలు
మొఖం మోసుకొస్తున్న
చెడపడం వీలుకాని ముడతలు
సరికి సరి
పత్తిమందు చిమ్మిన విషపు ధూళి
పగోళ్ళమీదికి వదిలినట్లు
చాచికొట్టే టియర్ గ్యాస్
సేమ్ టు సేమ్
పథకాలేసి
అడ్డం నిలువుగా కైవారాలు చూసి
తొవ్వుతున్న గుంతలెవరి బొందకోసం
తెగని యాపారపు నారపోగుల్ని పురిదాల్చి
పేనుతున్న తాళ్ళు ఎవరి ఉరికి
పురుగుమందుకు అదనపు ఆసరాలెందుకు
పొలాలమీద వెలుగుల నెపం రుద్దే
విద్యుద్ఘాతాలు కోతవేమీ కావు
మా నాగళ్ళు
ట్రాక్టర్లైనాయి కానీ
తైలం కళ్లెం మీ చేతిలోనే
పొలాలు ఉన్నచోటే ఉన్నట్లనిపించినా
గుమ్ములన్నీ గుత్తకెళ్లిపోయినై
అడిగామంటే
అడగడం తప్పైన నేలలో ఉన్నామనుకోలే
పాపం తక్కెడబాట్ల కవలపిల్లలు
వసుంధరను చట్టం ఒడుపున
ఇట్లా చెరపట్టడం ఇదివరకెప్పుడూ చూడనేలేదు
పక్షి ముసుగేసుకొని ఎగిరే లోహావిహంగాలకు
పంటపొలాల్ని ఇంత తెలివైన
మోపుగడతారని ముందెన్నడూ ఊహించలేదు
సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రం
మీ గేరాలో విలవిలలాడినప్పుడు
లొసుగులూ లోపాలూ లేనివాడే మిమ్మల్ని
ఢకొీట్టగలిగినప్పుడు
మాకు ముందూ వెనకా ఏ గుంపూ ఉండదు
ఎడమా కుడీ
ఏ రహదారీ అడుగుపెట్టనివ్వదు
అవును
సమూహాలేవీ లేకపోతే
మేమే ఒక సమూహం
తొవ్వలన్నీ మూసుకుపోతే
కొత్త తొవ్వ ఒకటి వేయాల్సిందే
- ఏనుగు నరసింహారెడ్డి,
8978869183