Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎటు చూసినా నలు దిక్కులా
కుప్పలు కుప్పలుగా పేర్చిన
పచ్చల రాసులు
కళ్ళూరిస్తూ, కనువిందు చేస్తూ
ముల్లెలు ముల్లెలుగా
పల్లెల నుండి తరలి వచ్చిన
చెమట నెత్తురుల శ్రమ ఫలాలు
నిగ నిగల ఆకు పచ్చని అందాల వెనుక
దు:ఖ దుప్పటి కప్పుకుని కూర్చున్న
జీవ జల కోల్పోయి ఎడారైన దేహాలు
ఎండి ఎరిగప్పయ్యే ఎండలైనా
గజ గజ వణికి గడ్డగట్టే చలైనా
ముసురులో తడిసి ముద్దయ్యే వానైనా
ముద్ద నోట్లోకి దిగాలంటే
పండించిన వాటికి పది రూపాయలు దక్కేదాక
పానాన్ని రోజంతా తక్కెడలో
తూకం వేస్తున్న తండ్లాట
అగ్గువ సారూ... ఆటో ఎల్లిపోతది సారూ...
తాజా మాలు బిడ్డ... ఎంతో ఇంత యియ్యి బిడ్డ...
గోస గోస మాటలు... గోవసొంటి సూపులు...
బేమాన్ తనం లేని బేపారంలో
లాభ నష్టాల లెక్కలు దెల్వక
లావకయ్యే బతుకు బండి.
అక్కడ కాలు మోపిన్నంటే చాలు...
నా చూపులన్నీ
కొనే వాటి మీది కంటే
కొడి గట్టే దీపాల మీదనే ఉంటాయి.
పలకరిస్తే చాలు...
పరాయని చూడకుండా
దు:ఖ బావుల్లోంచి ఎతలు ఏతమై పారుతాయి.
కారం గట్క దిని కాపాడుకున్న బూమిని
ఆంబుక్క వెట్టి అదర గొట్టే కొడుకు
సంపాదనేమి లేకుంటే
సల్ల బొట్టు కూడా పోయనని బెదర గొట్టే కోడలు.
ఏంజేత్తు కొడుకా...
కట్టె కాలె దాన్క
కట్టాలే సుట్టాలని నెట్టుకొత్తున్నా నంటూ
కండ్ల నీళ్ళ పటువ పట్టన పగలగొట్టుకొని
పానం అల్కగ జేసుకునే పండుటాకులు
పలకరింత గాయాలను మాన్పే పసరు పూత
ఒక్కొక్కరూ కదిలిస్తే కరిగిపోయే
ఒక్కో కన్నీటి మంచు కొండ
ఏమీ కానీ బంధమైనా
ఎదను మెలిపెట్టే గాథల్ని నెమరేసుకుంట వస్తుంటే
సంచిలో తెస్తున్న కూరగాయల మాటేమో గానీ
గుండె బరువెక్కి మోసుకెళ్తున్న
వాళ్ళ బతుకు గాయాలు
నీడలా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి.
- గాజోజు నాగభూషణం
98854 62052