Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నియోలాగిజమ్ (neologism) అంటే కొత్త పదాలను, లేక పదబంధాలను సృష్టించడం. ఈ ప్రక్రియను కొందరు బాగా చేయగలరు. వారి మెదడు అందుకు అనువుగా ఉంటుంది బహుశా. ఒక రకమైన సద్యఃస్ఫూర్తి కూడా ఉంటుంది వారిలో కొందరి మెదడు లెక్కల విషయంలో చాలా షార్ప్‌గా (చురుకుగా) ఉంటుంది. మరి కొందరిలో verbal intelligence పుష్క లంగా ఉండటం చేత పదాలతో ఆటలాడటం, కొత్త పదాలను సృష్టించడం అనే విద్య వాళ్లకు అల వోకగా అబ్బుతుంది. 'నిజం' అటు వంటివారిలో ఒకరు అని చెప్పవచ్చు. చమత్కారాన్ని (wit ను) వెలయిస్తూ గమ్మత్తైన కొత్తపదాలను కాయిన్ చేస్తారు ఆయన. స్ట్రిక్టుగా చూస్తే అవి వ్యాకరణశాస్త్రం ప్రకారం తప్పులే కావచ్చు. కానీ ఆధునిక కవిత్వంలో నూతనపదసష్టిని ఆ దష్టితో చూడకూడదు. నుడికారంలో సరదాగా చమక్కులను మెరిపించడమే అందులోని ముఖ్యమైన ఉద్దేశం. వ్యాకరణం ప్రకారం అవి సరైనవి కావు అని ఆక్షేపించడం మూర?త్వమే అవుతుంది. ఇక 'నిజం' కవితలలోని నియోలాగిజంకు ఉదాహరణలను పరిశీలిద్దాం.
ఆయన సృష్టించే కొత్తపదాలలో కొన్ని సార్లు పదబంధంలోని పూర్వపదం (మొదటి పదం) లోంచి చివరి అక్షరాన్ని లుప్తం చేసి, ఉత్తర (రెండవ) పదంతో కలపడం కని పిస్తుంది. అంటే contract అయిన, లేదా condense చేయబడిన (కుదింపబడిన) రూపానికి పురుడు పోయడమన్న మాట. వారి 'నాలుగో పాదం' కవితా సంపుటిలో ఒక కవితకు శీర్షిక అనేకాకి. అనేకుల మధ్య ఏకాకి అన్నమాట! కవితలోని ముఖ్యమైన వస్తువు అదే. అశరీరతి అన్నది మరో కవిత పేరు. ఇది అమలిన శంగారం (platonic love) ను వస్తువుగా చేసుకుని రాసిన మంచి కవిత. ఇందులో శరీరాలు లేకుండా కలయిక ఉంటుంది. అంటే మానసిక సంగమం అని అర్థం. అశరీర రతి అనే బదులు మొదటిపదం లోని చివరి అక్షరమైన 'ర' ను తీసేసి కలపగా అశరీరతి ఏర్పడింది. చమత్కారంగా లేదూ? మరొకచోట రాఖీచకం అన్న పదం వస్తుంది. అంటే రాఖీ కీచకం అన్నమాట. భూ లోకం, భూదానం, భూగృహం, భూమార్గం మొదలైన పదా లున్నాయి కదా? అట్లానే చూతూణీరం, చూతూపు అనే కొత్త పదాలను సృష్టిం చారు 'నిజం'. ఇవి చూపు తూణీరం, చూపుతూపు లను సూచిస్తాయి. అదే విధంగా సుత్తిస్తారు (ఇది సుత్తి వేస్తారు, లేదా స్తుతిస్తారును సూచిస్తుంది.)
ఒక పదంలోని, లేదా పదబంధం లోని మొదటి అక్షరాన్ని రూపాంతరం చెదించి, తక్కిన అక్షరాలను అట్లానే ఉంచగా ఏర్పడిన కొత్తపదాలు కొన్ని దర్శన మిస్తాయి నిజం గారి కవిత్వంలో ఉదాహరణలు చూడండి: ప్రతి పొలం చెపుతుంది ధాన్యవాదాలు, అంటారు ఒక కవితలో. ధన్యవాదాలు మనకు తెలిసిన పదం. అయితే, ఇక్కడ కృతజ్ఞత తెలుపు కుంటున్నది పొలం కనుక, ధన్యవాదాలు అనకుండా ధాన్యవాదాలు అన్నారు! అంటే ధాన్యం యొక్క కృతజ్ఞతలు అన్నమాట. ఎంత గమ్మత్తుగా వుంది ఈ నూతనపదసష్టి! మన వేదాంతంలో కర్మసిద్ధాతం అని ఒకటి వుంది కదా? అయితే ఒక కవితలో ఘర్మసిద్ధాతం అంటారు. మరొకచోట పెగ్గరి అన్న పదం కన పడుతుంది. సిగ్గు పడేవాడు సిగ్గరి అయినట్టే, పెగ్గులు వేసుకునేవాడు పెగ్గరి అయ్యా డన్నమాట! అట్లాగే దర్పయాగం (సర్ప యాగం), సెగసరి (సొగసరి), మూకవన్నె పులులు (మేకవన్నె పులులు), స్వేదవాక్కు (వేదవాక్కు), స్వేద పండితులు (వేద పండితులు), స్వేదనా జ్వాల (వేదనాజ్వాల), చుక్కదనం (చక్కదనం), మెతుకమ్మలు (బతు కమ్మలు - మెతుకులను ప్రసాదించే రైతు కుటుంబాలకు చెందిన స్త్రీలు), దుఃఖదనాలు (చక్కదనాలు) మొదలైన కొత్తమాటలు దర్శనమిస్తాయి వారి కవితల్లో. ఇక భగప్రేమ కవితా వస్తువుగా ఉన్న ఒక పొయెమ్కు శీర్షిక భగల్స్. ఇది సిగల్స్‌ను అన్యాపదేసంగా సూచిచే పదం. మరొక కవితలో స'కసిం'చాలి అంటారు. కసితో వికసించాలి అన్నది ఇక్కడ అసలైన ఉద్దేశం.
మొదటి రెండు మూడు అక్షరాలను మార్చగా ఏర్పడిన మాటలు కొన్ని కనిపిస్తాయి అక్కడక్కడ. చెట్టు గురించి రాస్తూ, తరువారా వీచే గాలి అంటారు. మన సారా లాగా తరువారా! కూపస్థ మండూకం అనే మాటను అనుకరిస్తూ గర్భస్థ ప్రేక్షకులు అంటారొక చోట. హాసపూర్ణ (అన్నపూర్ణ), నేత్రజాలికులు (ఇంద్రజాలికులు) మొదటి రెండు అక్షరాలను మార్చగా ఏర్పడినవే.
ఒక పదబంధం లోపలి ఒక అక్షరాన్ని మార్చి పుట్టించిన కొత్త పదాలకు ఉదాహ రణలు జనవద్గీత (భగవద్గీత), జనతంత్రసాని (జన మంత్రసాని), చిలుకములుకులు (చిలుక పలుకులు), ప్రజాశ్కామ్యం (ప్రజాస్వామ్యం), మనుమేహం (మధుమేహం), పాలాభిశోకం (పాలాభిషేకం,) బలిపాఠం (బలిపీఠం), ఏకాకు చెట్టు (ఏకాకి చెట్టు. ఒకే ఆకున్న చెట్టు అని కూడా కావచ్చు), దేశభుక్తి (దేశభక్తి).
మధ్యలో ఒకటి రెండు అక్షరాలను అదనంగా కలిపి కొత్తపదాలను సష్టించడం కనిపిస్తుంది కొన్నిచోట్ల. ఉదాహరణకు ఉత్తరాంధ్రుల వలసలసల పాట అంటారు. సలసల మరిగే వేదనను సూచిస్తుంది ఈ మాట.
భూకంపం మనం తరచుగా వినే మాట. దానికి సమాంతరంగా ఆకాశకంపం అనే మాటను సష్టించారు నిజం. ఇట్లా రకరకాలైన కొత్తపదాలను, పదబంధాలను coin చేసి శ్రీశ్రీ, ఆరుద్ర లాంటి పాత కవుల లాగానే పాఠకులకు కొంత ఉల్లాసాన్నీ. వినోదాన్నీ పంచుతున్నారు ఆయన. ఈ రకమైన చమత్కారాన్ని హాయిగా ఆస్వాదిద్దాం.
- ఎలనాగ,
సెల్ నం. 9866945424