Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పరాయి పాలనలో పరుగెత్తి పాలు తాగడం కంటే, స్వీయ పాలనలో నిలకడగా గంజి నీళ్ళు తాగడం మేలనే ఉద్యమ కాల ఉపదేశం గుర్తిస్తున్నది. రచయితలు ఎంతో మేథోమధనం చేసి, తెలంగాణ అస్తిత్వ వాదంతో గుండెలోతుల్ని తాకేలా సజించిన సాహిత్యాన్నంతా పుస్తకాలల్లోకి ఎక్కిస్తున్నది. సాహితీ సోపతి ముద్రించిన చాలా గ్రంథాలకు ఐ.ఎస్.బి.ఎన్తో వేయడం విశేషం.
అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం జరిగిన తెలంగాణ మలిదశ పోరాట కాలమది. అపుడు ప్రజలను బాగా ప్రభావితం చేయడానికి ఎన్నో సాంఘిక, సాహిత్య సంస్థలు ఆవిర్భ వించాయి. అలాంటి ప్రత్యేక పరిస్థితులలో తెలంగాణ భాషా, సంస్కతుల వికాసానికి, రచనా వ్యాసంగాలకు దోహదం చేయడానికి సాహితీ సోపతి సంస్థ పురుడోసుకున్నది. ఇది 2010లో కరీంనగర్ కేంద్రంగా సామాజిక బాధ్యత, భావ సారూప్యం గల సోపతుల సమూహంగా రూపుదిద్దుకున్నది. ''నూరుపూలు వికసించనియి వేయి ఆలోచనలు సంఘర్షించనియి'' అన్నట్టు తెలంగాణ తెగతెంపుల సమరానికి ఊతమివ్వడానికి, సాటి సాహితీ సంస్థలతో కలిసి నడిచింది. ఆలోచనా కార్యాచరణ ఏకమై, విలక్షణమైనా, విశిష్ఠమైన విలువలతో కూడిన రచనలతో సాహితీ లోకాన తనదైన ప్రత్యేక ముద్రను వేసింది. అనతి కాలంలోనే తెలుగు సాహిత్య చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నది సాహితీ సోపతి. సోపతి అనేది తెలంగాణ పల్లె పదం. ''సొహబత్'' ఉర్దూ పదం నుంచి 'సోపతి' తెలుగు పద ప్రయోగం ఏర్పడి ఉండొచ్చని భాషావేత్తల భావన. ఈ పదం తెలంగాణ ప్రాతీయ అస్తిత్వ చైత న్యానికి ప్రతీక. సంస్థ అంకురించింది మొదలు ఇప్పటవరకు వర్ధమాన కవులు, రచయితలను ప్రోత్సహిస్తూనే ఉన్నది. వారికి చేదోడువాదోడుగా నిలిచింది. సోపతి అనే పేరుని ప్రతినిత్యం సార్థకం చేసుకుంటూనే ఉంది. ఎలాంటి భేషజాలు లేకుండా అన్నిరకాల ప్రక్రియలను సమాదరిస్తూ, అమూల్యమైన సాహిత్య సంపదను భావితరాలకు పుస్తక రూపంలోనే అందిస్తున్నది. ప్రాచీన సాహిత్యాన్ని పరిశోధిస్తూ, ఆధునికతను అందిపుచ్చుకొని, తెలంగాణలో సంచలనం కలిగించే ఉత్తమ సాహిత్యానికి బాటలు వేసింది. గొంతెత్తిన సాహితీ సోపతుల కవితా నాదాలు నినాదాలై ప్రతి ధ్వనించేలా, ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటేలా, దశాబ్ద కాలంగా దూసుకుపోతున్నది. కులమతాలకు అతీతంగా, ధనిక, పేద తారతమ్యం రూపుమాపే సాహితీ సజనలకు, సాహితీ సేవా కార్యక్రమాలకు ఊతంగా నిలువడం ముదావహం. సంస్థ ప్రచురణలు, సజనకారుల సాహిత్య సంబంధం కలకాలం కొనసాగాలనే ఆకాంక్షతోనే కావచ్చు. చాలాకాలం జీవించే తాబేలును ఈ సంస్థ తన చిహ్నం (ఎంబ్లం)గా ఎంచుకోవడం హర్షదాయకం. పరాయి పాలనలో పరుగెత్తి పాలు తాగడం కంటే, స్వీయ పాలనలో నిలకడగా గంజి నీళ్ళు తాగడం మేలనే ఉద్యమకాల ఉపదేశం గుర్తిస్తున్నది. రచయితలు ఎంతో మేథోమధనం చేసి, తెలంగాణ అస్తిత్వ వాదంతో గుండెలోతుల్ని తాకేలా సజించిన సాహిత్యాన్నంతా పుస్తకాలల్లోకి ఎక్కిస్తున్నది. సాహితీ సోపతి ముద్రించిన చాలా గ్రంథాలకు ఐ.ఎస్.బి.ఎన్తో వేయడం విశేషం. రైతు ధాన్యాన్ని తూర్పారబడుతూ, వట్టి గింజల్ని, గట్టి గింజల్ని వేరు పరచినట్టు సాహితీ సోపతి సైతం సాంద్రత, గాఢత గలిగి, వాసీ వున్న సాహిత్యాన్నే అచ్చువేస్తుంది.
2010 జులైలో కరీంనగర్ జిల్లాకు చెందిన 120 మంది కవుల తెలంగాణ ఉద్యమ కవిత్వంతో వెలువడిన ''వల్లుబండే'' సాహితీ సోపతి తొలి ప్రచురణ. ఇది తెలంగాణ ఉద్యమ సాహిత్య చరిత్రలో కీలక కవితా సంకలనం. పత్రికల్లో అచ్చైన కరీంనగర్ కవుల ఉత్తమ కవిత్వాన్ని ''కరీంనగర్ కవిత-2011'', ''కరీంనగర్ కవిత-2012'' సంకలనాలుగా సాహితీలోకం ముందుకు తీసుకువచ్చింది. ఈ రెండు పొత్తాలు ఉద్యమాలకు ఉరకలు నేర్పాయనడంలో అతిశయోక్తి లేదు. 2013లో వచ్చిన ''కరీంనగర్ ఖాన్ దాన్'' ప్రాచీన చారిత్రక వ్యాసాల సంకలనం విశేష పాటకాదరణ పొందింది. కరీంనగర్ జిల్లా చరిత్రను ప్రాచీనం నుంచి ఆర్వాచీనం వరకు పొల్లు పోకుండా మన కళ్ళ ముందుంచిన గొప్ప పరిశోధనా గ్రంథం. బహుభాషావేత్త డా|| నలిమెల భాస్కర్, సమగ్ర సాహిత్యంపై వివేచన వ్యాసాల సంక లనం ''నవనీతం'', అన్నవరం దేవేందర్ సాహిత్యంపై వచ్చిన విమర్శన వ్యాసాల సంకలనం ''వస్త్రగాలం'' పాత్రికేయ రచయిత నగునూరి శేఖర్ సంపాదకత్వంలో జమిలీగా పుస్తకరూపం దాల్చాయి. వీరిరువురిపైన పరిశోధనకు ఈ రెండు పొత్తాలు సాహిత్య పరిశోధకుల పనిని సులభతరం చేశాయి. ప్రముఖుల 54 పుస్తకాలను సాహితీ సోపతి ముద్రించింది.
2013 నుంచి తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ శాఖ ప్రతినెల పౌర్ణమి రోజున ఎన్నీల ముచ్చట్లు నిర్వహిస్తున్నది. ఈ ఎన్నిల కవితాగాన సంకలనాలను సాహితీ సోపతి ప్రచురిస్తుంది. ఇప్పటికి 95 ఎన్నీల ముచ్చట్లు జరుగగా, 40 ఎన్నీల కవితాగాన సంకలనాలకు సోపతి పుస్తక రూపమిచ్చింది. ఎంతో మంది కొత్త గొంతుకలకు తమ రచనలను అచ్చు రూపంలో చూసుకొని మురిసిపోయే అవకాశమందించింది. ఎన్నిల కవిత్వం తెలుగు సాహితీ రంగంలో ఓ నూతనాధ్యాయం. వచన కవిత్వం, గేయ కవిత్వం, శతకం, వ్యాసం, కథలు, నానీలు, హైకూలు, దీర్ఘ కవిత, పాట, బాలల కవిత్వం లాంటి పలు ప్రక్రియలలో విరివిగా కావ్యాలను ముద్రించి, సాహితీ జగత్తును సోపతి సుసంపన్నం చేసింది.
'మీ చుట్టూ ఉన్న చీకటిని శపించవద్దు. ఒక చిరుదీపం వెలిగించండి' అన్నట్టు 'తెలుగు సాహిత్య రంగం అభివద్ధి ధ్యేయంగా కొత్త సాహిత్య సమాజ ఏర్పాటుకు సాహితీ సోపతి పూనింది. కరపత్రం దగ్గర నుంచి కార్యక్రమం ఆసాంతం తెలంగాణ తత్త్వం ఉట్టి పడేలా చేయడం ఈ సంస్థ ప్రత్యేకత. సాహితీ సోపతి పుట్టి దశాబ్దం నిండిన సందర్భంగా, ఫిబ్రవరి 15, 2015 పొద్దుందాక సాహితీ సోపతి అయిదేండ్ల పండుగను 'తెలంగాణ సాహిత్య సాంస్కతికోత్సవం' పేరుతో కనీవినీ ఎరుగని రీతిలో అత్యంత వైభవోపేతంగా జరిపింది. పొద్దటిపూట 'తెలంగాణ సంస్కతి', మాపటి పూట 'తెలంగాణ భాషా సాహిత్యాలు' అంశంగా సభలు జరిగాయి. ద్రవిడ విశ్వ విద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య రవ్వా శ్రీహరి తెలంగాణ భాషా సాహిత్యాలను స్ఫూర్తిదాయకమైన ప్రసంగాన్ని అందించారు. బి.నరసింగరావు, మామిడి హరికష్ణ, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, అల్లం రాజయ్యలను పెద్ద సుట్టాలుగా సాహితీ సోపతి పిల్చుకున్నది. డా|| నలిమెల భాస్కర్ తెలంగాణ భాష నాదమాధుర్యాన్ని సవివరం చేసి, సభికులను ఆలోచింప చేసారు. ఇంకా ఒగ్గుడోలు గుంపు ఆటలు, ఒగ్గు కథ, సాద నాసురుల మహేంద్రజాలం ప్రదర్శనలు సభికులను మంత్రము గ్ధులను చేశాయి. ఎన్నీల ముచ్చట్ల కవి గొంతుకల కవితా పఠనం ప్రత్యేక ఆకర్షణ. ప్రతి అక్షరం ప్రజల పక్షంగానే ఉండాలనేదే సోపతి భావన. అభ్యుదయ సాహిత్యాన్ని అనునిత్యం ప్రజలకు అందించడమే సోపతి కవుల కర్తవ్యం. నానాటికీ పెరిగిపోతున్న ప్రజా సమస్యలు, వాటికి కారణమైన అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించే రచనలు రావాల్సి ఉంది. కొత్త సజన తరాన్ని తయారు చేయడంలో సోపతి ఎపుడూ అగ్రశ్రేణిలోనే ఉంది. వారికి రచనా మెలకువలను నేర్పించుటకు కవిత్వ కార్యశాలను 2015 మే 15, 16 తేదీలలో ఏర్పాటు చేసింది. నగునూరి శేఖర్ అధ్యక్షతన, మామిడి హరికష్ణ విశిష్ట అతిథిగా పాల్గొనగా, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత డా|| నలిమెల భాస్కర్ కార్యశాలను ప్రారంభించారు. ''కవి, కవిత్వం, కవితా సజన, ఒక అవగాహన'' అంశంపై బూర్ల వేంకటేశ్వర్లు సమన్వయంలో డా|| సీతారాం ప్రసంగించారు. గాజోజు నాగ భూషణం సమన్వయం చేయగా డా|| కాశీం ''కవిత్వం సామాజికత-అభ్యుదయ విప్లవవాదాలు'' అంశంపై ప్రసంగించారు. ''దళిత బహుజన కవిత్వం-అభివ్యక్తి'' అంశంపై డా|| కోయి కోటేశ్వరరావు, కందుకూరి అంజయ్య సమన్వయంలో అభిభాషించారు. మే 6న కూకట్ల తిరుపతి సమన్వయం చేయగా, ''కవిత్వ నిర్మాణ పద్ధతులు'' అంశంపై డా|| పెన్నా శివరామకష్ణ విశ్లేషించారు. ''కవిత్వం కళాత్మకత-భాష'' అంశంపై ఎం.నారాయణశర్మ మాట్లాడగా, సి.వి.కుమార్ సమన్వయం చేశారు. అన్నవరం దేవేందర్ అధ్యక్షతన జరిగిన ముగింపు సమావేశంలో జూకంటి జగన్నాథం, శిలాలోలిత, యాకూబ్, మచ్చ ప్రభాకర్, జూలూరి గౌరీశంకర్ స్ఫూర్తి ప్రసంగాలు చేశారు.
సాహితీ సోపతి సంస్థ పుస్తక ప్రచురణలతో పాటు కవి సమ్మేళనాలు, కథక సమ్మేళనాలు, సాహిత్య సమాలోచనలు, చర్చా గోష్టులు, కవిత్వ కార్యశాలలు, పుస్తక ఆవిష్కరణలు, పుస్తక పరిచయాలు, దివంగత సుప్రసిద్ధ కవుల వర్ధంతులు, జయం తులు, దినోత్సవాలు, ఎన్నీల ముచ్చట్లు, ఆత్మీయ సమ్మేళనాలు, క్షేత్ర పర్యటనలు, సారస్వత సభలు, అమాస అలికిడి లాంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ, తెలంగాణలో సాహిత్యాభిరుచిని, తెలుగు భాషాభిమానాన్ని పెంపొందిస్తున్నది. వినూత్నమైన, విభిన్నమైన కార్యక్రమాల మేళవింపుతో రూపకల్పన చేసిన కార్యాచరణనే సాహితీ సోపతిని అగ్రస్థానంలో నిలిపింది. ఇందులో సాహితీ సోపతికి పట్టుగొమ్మల్లా నిలిచిన డాక్టర్ నలి మెల భాస్కర్, నగునూరి శేఖర్, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, కందుకూరి అంజయ్య, బూర్ల వేంకటేశ్వర్లు, కూకట్ల తిరుపతి, సి.వి.కుమార్ కషి ఎంతో ఉంది. ఈ సంస్థ ఎంతో మంది సాహితీ వేత్తలను, రచయితలను ముందుకు తీసుకువెళ్ళింది. కొత్త తరాన్ని సైతం అందించింది. రేపటి తరం రచయితలను తీర్చిదిద్దడంలో, రచయితల ప్రాథమిక కర్తవ్యాలను తెలియ జేయడంలో సాహితీ సోపతి ఎపుడూ విస్మరించలేదు. ఈ సోపతి రాతపూతల మట్టుకు మాత్రమే పరిమితం కాదు. సమాజ శ్రేయస్సు కోసమే కాకుండా సాటి సోపతుల కష్టసుఖాలలో తోడూనీడలా మెదులుతారు. ''స్నేహానికన్న మిన్న లేదు లోకాన, అది రతనాల కన్న మిన్న తూకాన'' అని ఓ కవి చెప్పినట్టు ఈ సోపతులందరు ఆపతికి సంపతికి ఒకటవుతారు. ఒకరికోసం అందరూ, అందరి కోసం ఒకరు అనే సమభావనతో కలిసి మెలిసి మెలుగుతారు. వీరు ఒకరికొకరు చేదోడువాదోడుగా ఉంటారు. సంఘటితంగా మెదులుతూ సమాజానికి చేయూతనందిస్తుం టారు. ఇలానే సాహితీ సోపతి అంతరాలు లేని సమాజ నిర్మా ణానికి ఇంకా ఇతోధికంగా తోడ్పాడు నందించాలని ఆశిస్తున్నాను. ఈ పదేండ్ల పండుగ సందర్భంగా సోపతులందరికీ శుభాకాంక్షలు.
సెలవిప్పటికీ.. స్నేహమెప్పటికీ...
- కూకట్ల తిరుపతి,
సంపాదకులు
ఫోన్: 9949247591