Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేల మీద ఒక పంట బొమ్మ గీసుకున్నా..
ఎంత దిద్దినా వెలిసి పోయిన వానలా
తనకి తాను ఖాళీ అయి కన్పిస్తుంది
పచ్చరంగుని ప్రై'వేటు' మిడతల దండు ఎత్తుకు పోయింది
పట్టి తెచ్చే లోపు
పోగులు పోగులు పోసి
వూరు వాడా అమ్మకపు అరుపుల రొద
ఇపుడు పిచ్చుకల్ని, రైతు కలల్ని, గింజల డబ్బాలో దాచాలి
లేదంటే 2.0 డేటా సిమ్ చేసి యాపారం చేస్తారు
ముందు తరాలకి మ్యూజియంలో నమూనా పెడతారు
డేగ రెక్కల కింద వంతుల వారీగా దేశాన్ని పొదగబెడుతున్న చోట,
దోసిళ్ళ నిండా భవిష్యత్తు నింపుకుని
నిప్పు చివుర్లు పూసే చెట్లు నాటాలి ఈ యుగాదికి
నీడ కలలు తిరుగుతున్నాయి కళ్ళల్లో
మట్టి గొంతుకు బ్రాండెడ్ బెల్టు, టాగ్లు తగిలించినట్టు
పొలం వేయడానికి ఎరువు, ఆకాశం చల్లినట్టు
చివురాకులు అద్దాల అంచు మీద పడి కోసుకుపపోయి వాడిపోయినట్టు,
నోట్లో పచ్చడి ముద్దకి అరువు చేతి వేళ్ళు అడ్డుపడితే
ఎంగిలి చేత్తో నెత్తి కొట్టుకున్నంత భయంగా
నడిరోడ్డు మీదో, చెట్టు కొమ్మకో వేలాడే దేహాలకి
పాలసీలు రావు, పెన్షన్లు లేవు,
అప్పుకి వడ్డీ కట్టమనే బ్యాంకులు తప్ప
చావును సర్టిఫై చేసి కొత్త రిక్రూట్మెంట్
జారీ చేస్తాయి కార్పొరేట్ కంపెనీలు
జీతానికి కాదు జీవితాలకీ వారసులు వుండరిక్కడ
ఉక్కుని దోచే కొక్కెరలు వడ్డునవిసిరితే
అలలకి తలవంచడం తెలీదు
సంద్రం ఉసూరుమనదు, ఉప్పు పాతరేస్తది
ఎటుతిరిగీ పాపం రైతుదే
నీకు .. నీకు.. ఇంకోలాంటి నీకు,
అన్నం పెడతాడు తప్ప ఏమీ చేతకాదు
కానీ కొడవలి పంటను మాత్రమే కొస్తుందా?
గొడ్డలి పొయ్యిలో చితుకుల్నే కొడుతుందా..?
- జయశ్రీ మువ్వా, 9052733822