Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథ చెప్పాలనుకుంటున్నాను
మొన్నా మొన్నటిదాకా
తులసి వనం కాకున్నా
గంజాయి మొక్కలు
ఇంతగా తెగబడి లేవు
ఏపుగా పెరిగిన
గంజాయి మొక్కొకటి
అకస్మాత్తుగా తెరపైకొచ్చింది
గంజాయి వనం నుంచే..
దాని దేహమంతా
మెత్తగా కోసి ప్రాణాలు తీసిన ఆనవాళ్ళే
అయినా
పేనుకు పెత్తనమిచ్చినట్లు
అదే గంజాయి మొక్కను
తమను పాలించమని వేడుకున్నాయి
పిచ్చి తులసి మొక్కలు
ఇంకేముంది..?
నెమ్మది నెమ్మదిగా
చికిత్స లేని జబ్బులు వచ్చి పడ్డాయి
మరు భూమిని తలపిస్తున్నా
తులసి మొక్కలు ఆ గంజాయి మత్తును
వదిలే సోయిలోనే లేకున్నాయి
అర్థం కాలేదా ఆ కథ?
ఇప్పుడు మరోటి చెబుతాను
వినుకోండి
ఆవును కామధేనువంటూ మొక్కుతూ
దాని ఉత్పత్తులను ఆరగించిన
గండుపిల్లి కన్ను
ఎలుకల కలుగుపై పడింది
మెల్లిమెల్లిగా ఎలుకలు
ఒక్కటొక్కటిగా మాయమవసాగాయి
ఎలుకలన్నీ అత్యవసర
సమావేశం పెట్టుకున్నాయి
గండు పిల్లి మెడలో
గంట కట్టాలని తీర్మానించాయి
ఇప్పుడు గంటకట్టే
వీర మూషికానికై
వెదుకులాడుతున్నాయి
ఒకసారి బోనులో చిక్కిన
పిల్లిని వదిలేసిన ఆ...
పిచ్చి ముదిరిన ఎలుకలు
ఇంకా అర్థం కాలేదా..!
దేశ దేహంపై
రాచపుండు మొలిచింది
నైజీరియాలా మారకముందే
నయం చేయాలిరా నాయనలారా..!
- నస్రీన్ ఖాన్