Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రయాణం ఎలా సాగింది అని మాట వరుసకు అడిగితే.. బాగా సాగింది అంటారు. బాగా సాగడం అంటే ఏమిటి? దారిలో ఎటువంటి ప్రమాదాలు లేని ప్రయాణం అని చెప్పటం. ముచ్చట ముగించకుండా కొనసాగింపు చేస్తూ రైలుకా? బస్సుకా? అని అడుగుతారు. ప్రయాణాలు పలు రకాలు.. నడక, బండి, సైకిల్, బస్సు, మోటార్ సైకిల్, రైలు, గాలిలో అయితే విమానం, నీళ్లలో అయితే పడవ ప్రయాణం ఇవి మనకు తెలియంది కాదు. ఇక్కడ ప్రయాణ ప్రస్థానం మానవ వికాసానికి (గమనం) ఏమిటన్నది అసలు ప్రశ్న. రవాణా అభివద్ధి అయి గ్రామాలు, మండలాలు, జిల్లాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయి. సమాజ అభివద్ధికి మెరుగులు పడ్డాయి. ప్రతి ప్రయాణానికి యాత్రికుడు నిర్ధేశించుకున్న స్థలం, కాలం, పరిశీలనకు ఎంచుకున్న అంశం చట్రం అవుతుంది. తెలంగాణ రాష్ట్రం నిధులు, నీళ్లు, నియామకాలతో ఏర్పడింది. నిధులు, నీళ్లను వదిలేసి 30 శాతంగా ఉన్న యువత ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయో.. డీవైఎఫ్ఐ రాష్ట్రమంతా మోటార్ సైకిల్ యాత్ర చేసి పరిశీలించిన అంశాలే ఈ ప్రయాణ పుస్తకం. జయప్రదంగా జర్నీ చేసి అనుభవాలను అక్షర రూపమిచ్చి.. దినాలను పుటలుగా పేర్చి పూసలుగా పుస్తకం రాశారు. ఇది చదివి అందరం ఆస్వాదిస్తాం. తెలంగాణలో యువత ఏ పరిస్థితులో ఉందో తెలుసుకునేందుకు ఈ పుస్తకం దోహదం చేస్తుంది. విప్లవ్, విజరులు యాత్ర చేసి సుమారు మూడేండ్లు కావస్తోంది. నాడు ఉన్న పరిస్థితులు అలాగే ఉంటాయని కూడా చెప్పలేం. యాత్ర చేసినప్పుడు ఉన్న పరిస్థితులు మెరుగు పడ్డాయా? దిగజారాయా? అని బేరీజు వేసేందుకు కూడా ఈ పుస్తకం కొలమానంగా పని చేస్తోంది. గీటురాయిగా ఉంటుంది.
జ్ఞానులు మునులు కాదు. మునుల వలే ఒకే దగ్గర కూర్చుని జపం చేస్తే జ్ఞానం రాదు అంటారు రాహుల్?సాంకత్యన్. రెండు వైపుల నుండి ఇద్దరు నాయకులు 46 రోజుల పాటు యాత్ర చేశారు. ఒకే సమస్య మీద ఇద్దరి ప్రతిస్పందనలు ఎలా ఉంటాయి. వైవిధ్యం లేకపోతే ఎలా? అనే అనుమానం కలుగుతోంది. ఇలాంటి సవాళ్లను రచయితలు అలవోకగా అధిగమించారు. వైవిధ్యాన్ని పాటించారు. పాఠకులను ఆకట్టుకుంటారనే విశ్వాసం కలిగింది. వలసలు అనే అంశం తీసుకుంటే విప్లవ్ నిజామాబాద్ గల్ఫ్ వలసలను అధ్యయనం చేసి అనుభవాలు రాశాడు. విజరు పాలమూరు వాసులు ముంబయికి వెళ్లటం, హైదరాబాద్‌లోని బాల్నగర్ స్థానికుల ఉద్యోగాలు రాకపోవటం, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పని చేసి స్థానికులను నిరుద్యోగులను మార్చే ప్రభుత్వ విధానాలను ప్రశ్నించారు. ఒక మామిడి అనే ప్రాంతం నుండి 25 మంది యువకులు తెలంగాణ వచ్చినంక గల్ఫ్‌కు పోవడం బాధాకరం. ఉపాధి అవకాశాలు చూపని పాలకులు సిగ్గు పడాలి. రచయితలకు కథా వస్తువు నిరుద్యోగం. దానికి ప్రకతి, పరిసరాలను భౌతిక పరిస్థితులను చరిత్రను మేళవించారు. రూపానికి ప్రాణం పోసారు. అద్భుతంగా కథను నడిపించారు. నవలలో పాత్రలను మాట్లాడించినట్లు విప్లవ్, విజరులు మాట్లాడకుండా యువతను మాట్లాడించారు. వారి ద్వారానే పాలకులను ప్రశ్నించడం అద్భుతంగా ఉంది.
అన్వేషకులకు నిజమైన ఆనందంగా లక్ష్యయ గమనాన్ని చేరడంలో ఉండదు. నిజమైన ఆనందం దానిని చేధించడానికి చేసే కఠినమైన ప్రమాదకరమైన ప్రయత్నంలో ఉంటుంది. పోలియో చుక్కలు అంగ వైకల్యం నుండి కాపాడినా నిజంగానే విజ్ఞాన చుక్కలు మనిషి ఆలోచన వైకల్యానికి గురికాకుండా కాపాడుతాయి. అది అక్షర ఔషధంగా పనిచేస్తాయి. అని చెగువిరా, ఫులే, అంబేద్కర్, భగత్‌సింగ్ పుస్తకాలు బయటకు తీసి అమ్ముతుంటే అందరూ ఆశ్చర్యానికి గురికావడం పాఠకులలో ఆసక్తితో పాటు అక్షరాలను ఆకర్షిస్తుతోంది. చదివిస్తోంది. డబ్బాలో ఏముందో తెలిసిపోతుంది. కిడ్డీ బ్యాంక్ అవినాష్ తండ్రి విప్లవ్‌ను పరిచయం చేస్తూ వీళ్లు మార్క్స్ మార్గదర్శకులు. మన ఇంటి ముందు నుండే వెళుతున్నారు అంటారు. తండ్రి మాటలు విన్న కొడుకు తన కోసం దాచుకున్న కిడ్డీ బ్యాంక్ బద్దలుకొట్టి డబ్బులు ఇవ్వడం పాఠకుల మనసులను కరిగిస్తుంది. భాగ్యనగరంలో బతుకమ్మకుంట వాసుల జీవన ఎగుడుదిగుడులు హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వచ్చారు. గుడిసెలు వేసుకున్న వారి జీవితాల మీద దాశరథి రాసిన 'మాయ జలతారు' నవలను గుర్తుకు తెచ్చింది. చీమల పుట్టలో పాములు చేరినట్టు ఒకప్పుడు దాదాలు ఇప్పుడు రియాల్టర్లు దర్జాగా భూములు కబ్జా పెట్టిన కథలు చదువరులను ఆలోపింపజేస్తాయి. కలువరపరుస్తాయి.
మానవుడు సజనాత్మక మార్గంలో కూడా విధ్వంసకారుడిగా ఉండాలి. ఉన్నతమైన విలువలు కావాలని కోరుకుంటే తక్కువ స్థాయి విలువలను నాశనం చేయాలి. కొత్త ఇంటిని నిర్మించుకోవాలంటే పాత ఇంటిని నాశనం చేయాల్సిందే. ఇక్కడ కులం పాత బస్తీలో సమస్యగా మారింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోకుండా చేసింది. విద్యా, ఉద్యోగ అవకాశాలకు దూరమైన కథే పిట్టలోళ్ల కథ. దీన్ని విజరు చాలా ఆసక్తికరంగా మలిచాడు. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఉమ్మడి రాష్ట్రం నుండి జీవిస్తున్న కొన్ని కులాలను తెలంగాణ సర్కార్ తీసివేసింది. ఎన్నికల ముందు కొనసాగించినట్టు గుర్తు . ఆర్య సమాజం, రజాకారులు, మెజారిటీ, మైనారిటీ మతశక్తులు భాగ్యనగరాన్ని బాధలకు గురిచేశారు. కలిసి ఉన్న ప్రజలను మతం మంటలు రాజేశారు. పసి మనసులలో విష బీజాలు నాటుటకు సరస్వతి విగ్రహాలు పెట్టడం. సంక్షేమ పథకాల పేరుతో కులంను బలహీనపరిచే బదులు బలపరుస్తున్నారు. ఈ కథలు ఆలోపింపజేస్తాయి. యాదవులకు గొర్రెలు, ముదిరాజ్‌లకు చేపలు, వలలు పంచడం, ఉద్యోగాలు అడిగితే గొర్రెలు కాయమని, చేపలు పట్టుకుని బతకమని చెప్పుతున్నారు. పాలకుల కుట్రలను యువకులు గమనించాలి. అడవి మీద ప్రేమతో విదేశీయుడైన హేమన్ డార్క్ కథ అందరిని ఆకట్టుకుంటుంది. ప్రజలను కులాలుగా చేర్చింది పాలకులేనని తేల్చేశారు. ఎర్ర బస్సుకు నోచుకోని గ్రామాలు ఎన్నో చెప్పేశారు. అభివద్ధికి ఎంత దూరంలో పల్లెలు ఉన్నాయో ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో భూస్వామ్య శక్తులు పాల్గొని నాయకత్వం వహించారు. ఒకప్పుడు గ్రామాల నుండి వెళ్లిపోయిన దొరలు మెల్లగా పల్లెలకు తిరిగివచ్చారు. విప్లవ్?తో మాట్లాడిన కొందరిని మీరు ఎందుకు భయపడుతున్నారంటే మీరు ప్రశ్నించమంటారు. పోరాడమంటారు. అవి చాలు మమ్మల్ని పగబట్టటానికి అన్నారు. మధుకర్ హత్య నుండి నిన్న జరిగిన లాయర్ల జంట హత్య వరకు భూస్వామ్యం బుసలు కొడుతూనే ఉంది. పగబట్టేది పాములు కాదు మనుషులని ఉత్తర తెలంగాణ యువత ఉలిక్కిపడుతుంటే ఆందోళన కలుగడం సహజం. ఆదిలాబాద్‌లో ఖాళీ అయిన నక్సలిజం స్థానంలో అందిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతుందని జైభీమ్ నినాదం ప్రగతిశీల అభ్యుదయ శక్తులకు అత్యావశకం. కానీ ఇక్కడ రచయిత ఊహించిన దానికంటే భిన్నంగా జరిగితే ఆదిలాబాద్ ప్రజలు మతతత్వశక్తులకు, ఓటుబ్యాంక్ రాజకీయాలకు బలి అవటం ఖాయమని భావించాడు. రచయిత అంచనా ఈ కాలంలో వాస్తవమేనని తేలిపోయింది. మోటారు సైకిల్ యాత్ర నడిచిన తీరు యువకులు చర్చించిన అంశాలు పుస్తకంగా రావటం ఎంతైనా నేటి తెలంగాణకు అవసరం.
అధ్యయనం చేయడం ఒక లక్ష్యం అయితే అందులో ఉన్న సమస్య పరిష్కారానికి కషి చేయటం మరొక్క లక్ష్యం కావాలి. అప్పుడే పుస్తకం యొక్క సార్ధకత నెరవేరుతుంది. ఇలాంటి అధ్యయనాలు విరివిరిగా జరుగాలని ఆశిద్దాం.
- గడ్డం రమేష్, 94900 98484