Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాపట్యము, కాలకూట ధర్మాలు రాజ్యమేలుతున్న వేళ రంగ స్థలమే రంగభూమిగా మారుతుంది. ప్రజాకళే ఓ శాస్త్రమూ, శస్త్రమూ అవుతుంది. నాటక కళా స్రష్ట అప్పుడు ఓ సుశిక్షతుడైన విలుకాడు అవుతాడు. దుర్భేద్యమైన నిరంకుశా ధిపత్యాన్ని ప్రజాబలంతో ఛేదించగలుగుతాడు. నాటకం సర్వకళల సమాహారం. నాటకంలో సాహిత్యం, సంగీతం, నాట్యం, పాత్ర చిత్రణ, అభినయం, రంగాలంకరణ రంగోద్దీపన, సమయపాలన, సందర్భోచితం, సన్నివేశాలు, మిళితమై ఓ అద్భుత జీవన చలన దృశ్యాన్ని సజీవంగా ఆవిష్కరిస్తాయి.
మానవ జీవన ఉద్ధాన పతనాలు, సుఖద్ణుఖాలు అనుపానాలు, లోతుపాతులు, కుశించు విస్తరణలు మొదలైన అన్ని ప్రకంపనలు నాటకం సమాంతరంగా చూపగలదు. తెలుపగలదు, విశ్లేషించగలదు. వర్గ, వర్ణ, భాషా, లింగబేధాలు అధిగమించి ఏకపత్ర సమారాధన చేయగలదు. అందుకే నాటకం అలరించే వినోదస్థాయిని దాటుకుని ఆలోచనామృత స్థాయికి ఎదిగింది. లోకవృత్తాను కరణమయింది. వస్తువులో రూపంలో ఇది దినదిన ప్రవర్దమానమవుతూనే ఉన్నది.
సద్విమర్శమలు, స్రష్టలు, ద్రష్టలు ఈ పరిణామ శీలాన్ని నిశితంగా పరిశీలించి వడిసిపట్టగలరు. ఆ ప్రజానుకూల ప్రగతిశీల మార్గాన్ని స్వశక్తితో మరింతగా ఉద్దీపన గావించగలరు. మన సమకాలీన సమాజంలో అలాంటి అద్వితీయ ప్రజా కళాసైనికుడు కామ్రేడ్ సఫ్దర్ హష్మీ.
1954 ఏప్రిల్ 12న జన్మించిన హష్మి 1989 జనవరి 1న నాటి కాంగ్రెస్ గూండాల చేతిలో క్షతగాత్రుడై అస్తమించాడు. కేవలం 34ఏండ్ల చిరుప్రాయంలో నేలకొరిగినా ప్రపంచ ప్రజా వీధినాటకోద్యమానికి హష్మి అందించిన సేవలు అనన్య సామాన్యం. 20వ శతాబ్దం ప్రథమార్థం అంతా తెలుగునాట పౌరాణిక పద్యనాటకంతోనే వర్ధిల్లింది. చారిత్రక జానపద నాటకాలు వచ్చినా అవి బహు స్వల్పం. యక్షగానం బయలు నాటకం, వీధినాటకం. తోలు బొమ్మలాటలు, కధానృత్యాలు రూపమేదైనా జనపదాలు, పల్లెసీమలే ఆ ప్రదర్శనలకు ఆవాసాలు. ప్రజలు వినోదానికి, విశ్వాసాలకు, విజ్ఞానానికి అవే ఆధారభూతాలు.
1936లో అభ్యుదయ రచయితల సంఘం, 1943లో ఇప్టా (ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్) ప్రజా నాట్యమండలిలు కళా సాహిత్యాలకు కేంద్ర బిందువుగా దైవం స్థానంలో మానవుడ్ని నిలపడంతో సామాజిక వాస్తవికతకు పట్టం కట్టినట్టయింది. ప్రజాకళ ఓ ఉద్యమంగా అవతరించింది.
'కాలం వంతుగ కత్తుల వంతెన కట్టిన వేళ
అణువణువు అడ్డుగోడలై నిలచిన వేళ
కళావన్నెలకు కళలను గరిపిన బళ్ళారికి నయనాంజలి.. అంటూ ప్రజానాట్యమండలి పతాక గేయంతో పాడుకోవడం తెలిసిందే.
కళ కళ కోసం అనే వాదన పూర్వపక్షం అయింది. కళ కాసుల కోసం కూడా కాదని, కళ ప్రజల కోసం, ప్రగతి కోసం అనే వాదం సిద్ధాంతంగా సుస్థిర స్థానం పొంది విరజిల్లింది. ఇక ఆ భూమికపై ఎన్నో ప్రజా కళారూపాలు, ప్రజా నాటకాలు పరిఢవిల్లాయి. 1947 ఆగస్టు 15న మనకు స్వాతంత్య్రం వచ్చింది. పట్టుమని ముప్ఫై ఏండ్లు కాలేదు. 1975లో అత్యవసర పరిస్థితి చీకటికాలం దాపురించింది. ప్రజల హక్కులు ఎలా హరించుకుపోతాయో ప్రజానీకానికి అనుభవంలోకి వచ్చింది.
ఏదేశంలోనైనా, ఏ కాలంలోనైనా ప్రజాస్వామ్యం అగాధంలో పడితే చీకటి కాక మరేమిటి? అలాంటి చీకటి కాలంలో కూడా పాటలుంటాయా..? అని ప్రశ్నిస్తే.. చీకటిని చీల్చేందుకే పాట పుట్టింది. అని జర్మన్ కవి బ్రెటోల్డ్ బ్రెక్ట్ జవాబిచ్చాడు. తదనుగుణంగానే సప్దర్ హష్మి కళ తన్నుకుంటూ ముందుకొచ్చింది.
పదవీ వ్యామోహం ఎంతదారుణంగా పరిణమిస్తుందో వివరించే లఘనాటికల వ్యంగ్య రూపకాలను రచించి ప్రదర్శించాడు. రిగ్గంగ్, కుర్చీ అనే వీధినాటికలు ప్రజల్ని విపరీతంగా ఆకర్షించేవి. రాజకీయ కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా ఉండే ఢిల్లీ బోట్స్ క్లబ్లో అవి ఆరోజుల్లో నిత్యం ప్రదర్శితమయ్యేవి. పదవీ వ్యామోహానికి, నాయకత్వానికి అలవాటు పడిన మనిషి, ఆ కుర్చీని వదలని తత్వం, వదలలేని తనం వ్యంగ్యంగా కండ్లకు కట్టేది. నవ్వులు పూయించేది. రాజకీయ చైతన్యాన్ని రగిలించేది.
1973లో తన నేతృత్వంలో స్థాపితమైన జన నాట్యమంచ్ (జనమ్) సంస్థ ద్వారా అలా ఎన్నెన్నో కళారూపాలు ఎప్పటికప్పుడు సమకాలీన రాజకీయ ఆర్థిక, సామాజిక సమస్యలకు అనుగుణంగా అల్లుకుని రూపొందించుకుని పట్టపగలు నడివీధుల్లో ప్రదర్శితమయ్యేవి. వ్యక్తివాదం కంటే సమిష్టి జన జీవన అస్థిత్వమే ఆ కళారూపాల్లో గోచరించేది.
కార్మికుల కోసం 'మిషన్' మహిళల కోసం 'ఔరత్', రైతులు - నిరుద్యోగుల కోసం 'గావ్ సే షెహర్ తక్' ఇలా ఎన్నెన్నో నాటకల్లోశ్రమైక జీవన సౌందర్యంతో పాటు ఉద్యమాల వరవడి తొణికిసలాడేవి. పిల్లల కోసం రూపొందించిన పేడ్ (చెట్టు) కళారూపం పాఠ్యగ్రంథమైంది. అలాగే అసంఘటిత కార్మికుల కోసం చక్కాజామ్, హల్లాబోల్ వీధినాటికలను ప్రత్యేకంగా రూపొందించడం, ఆ ఉద్యమాల్లో భాగస్వామ్యం చేయడం తెలిసిందే.
హల్లాబోల్ నాటిక ఎంతటి ప్రభంజనం సృష్టించిందో అందరూ ఎరిగిందే. అలా దాదాపు 24 నాటికలు రూపొందించి లక్షలాది మంది ప్రజానీకం మధ్యన నాలుగువేలకు పైగా ప్రదర్శనలిచ్చిన సిసలైన ప్రజాకళా సైనికుడు కామ్రేడ్ సఫ్దర్ హష్మి. ఏ సిద్దాంతమైనా దాని బతుకు ఆచరణతోనే సజీవంగా ఉంటుంది. మార్క్సిజం - లెనినిజం ప్రాతిపదికన ఏర్పడిన 'కళ ప్రజల కోసం' సిద్ధాంతాన్ని 20వ శతాబ్దం ద్వితీయార్థంలో నికార్సుగా అమలు జరిపినవాడు హష్మి. అందుకే ఆధునిక వీధినాటకం - ప్రజా పోరాటయుద్దం అని నినదించాడు. కడకు ఆ మార్గంలోనే ప్రాణాలను తృణప్రాయంగా అర్పించాడు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా వస్తువుతో రూపాన్ని మార్చి నాటకాన్ని సులువుగా చేసి జనసామన్యంతో ప్రవేశపెట్టగలిగాడు. అయితే కళా విలువల్లో ఎక్కడా రాజీపడలేదనే విషయం సదా గమనంలో ఉండాలి. నాలుగు గోడల మధ్యనున్న నాటకాన్ని నడివీధుల్లోకి తీసుకువచ్చి ముఖ్యంగా కష్టజీవులకు ఆ రూపకంపై సాధికారత కల్పించాడు. ఒక చేత్తో కత్తి, ఒక చేత్తో డాలులా సౌద్ధాంతిక కళాయుధాలు చేబూని వీధి నాటిక ప్రక్రియతో స్వైర విహారం చేశాడు.
ప్రజా నాట్యమండలి వంటి సంస్థలు ఎన్నెన్నో ఈ వీధినాటిక ప్రక్రియను పుణికిపుచ్చుకుని ఓ ఉద్యమ స్థాయిలో ముందుకు నడిచాయి. హల్లాబోల్తో పాటు గొర్రెలు తిరగబడ్డారు, అప్పా- అమ్మకమా?, రైతు, మన చరిత్ర, ప్రశ్నించండి, భారతమ్మ ఎక్కడ, గోగ్రహణం, సారా సర్కార్, వీరతెలంగాణా, మన్యవిప్లవం, , కొమరం భీం వంటి వీధినాటికలు వందల వేల సంఖ్యల్లో ప్రదర్శించి అశేష ప్రజానీకాన్ని చైతన్య పరిచాయి.
1990-2009 వరకు 20ఏండ్ల పాటు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సప్ధర్ హష్మి ఓపెన్ థియేటర్ (షాట్) పేరుతో రాష్ట్రస్థాయి వీధినాటకోత్సవాలు కొనసాగాయి. ఆ విధంగా హష్మి తెలుగు ప్రజానీకం హృదయాల్లో చెరగని ముద్ర వేశాడు.
ప్రస్తుత పరిస్థితుల్లో హష్మి వరవడిని అందిపుచ్చుకుని యువత మరింతగా విజృంభించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా శ్రామిక రైతాంగ ఉద్యమం రాజధాని పొలిమేర్లను దాటుకుని దేశమంతటా పరుచుకుంటున్నది. ఆ ఉద్యమ ప్రవాహం మన ముంగిళ్ళల్లోకి వస్తున్న తరుణంలో హష్మి వారసులు ఎక్కడున్నా చేతులు ముడుచుకు కూర్చోరనేది ఓ తిరుగులేని వాస్తవం.
(ఏప్రిల్ 12 హష్మి జయంతి)
- కె. శాంతారావు, 9959745723