Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యుద్ధానికీ యుద్ధానికీ మధ్య
విరామ విహ్వల సంగీతం
నిద్రకి ముందూ వెనకా
నిద్రకి లోపలా పిడుగుల వేట
పిచ్చుకలు కూడా పరిహసిస్తున్నాయి
నెమలి పింఛాల మీద సంధ్య వెలుగులు
మొహం చాటేసి మురిసిపోతున్నాయి
కుక్కపిల్లలైనా లెక్కచెయ్యడం లేదు
అప్పుడే పల్లవించిన చెట్టుకొమ్మ మీద
లేత కిరణపు నీటి బొట్టు ప్రశ్నచిహ్నమై
మనిషి నడినెత్తిమీద దిగబడుతోంది
ఇంత సమూహమూ
ఎంత ఒంటరిని చేసిందిరా నాయనా
ఏమి జన్మం ఏమి జన్మం
ఏమి జన్మంరా ఇది
వందేళ్ల జీవితం కోసం కాదు..
బరియల్ గ్రౌండ్లో ఆరడుగుల జాగా
ఇప్పుడొక మహాస్వప్నం
పడకలు లేని ఆసుపత్రి మెట్ల మీద
మత్యువుతో ముఖాముఖి
చేతులు కట్టేసిన వైద్యుడిలా
రోదిస్తోంది జీవితం
ఎవరి లోపల వారే ఎవరి చుట్టూ వారే
పెదాల మీద భయం నవ్వు
ఏలికల మీసాల మీద సగర్వ చిద్విలాసం
పిల్లల పరీక్షలు వాయిదా వేసి
ఎన్నికల్లో కత్తుల వీరంగం
పిల్లల్ని గదుల్లో పెట్టి
నదుల్లో రాజకీయ కుంభమేళా
మనిషికి మనిషికి మధ్య శత్రు గుడారంలో
అదశ్య యుద్ధవ్యూహాలు
ఎవరి పాపం ఎవరి పుణ్యం
పంచభూతాల మీద
మానవ దంతఛ్ఛాయల నెత్తుటి ధార
కనపడుతోంది కనపడుతోంది
వైరస్సు ఇప్పుడు మరింత
స్పష్టంగా కనపడుతోంది
మానవాత్మల రంగుటద్దాల
చర్మాల పగుళ్ళలోంచి పళ్ళికిలిస్తోంది
ఎవరెవరో నడుచుకుంటూ
వెళ్ళిపోతున్నారు
ఈ త్రొక్కిసలాటల్లోంచి
ఈ జీవఛ్ఛవ పేటికల్లోంచి
ఈ జన సమాధుల
వల్లకాటి వాటికల్లోంచి
నడుచుకుంటూ
నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు
కాలం చెంపల మీద
కన్నీటి శిలల శిరోవేదన
పడవ చెయ్యి దాటిపోయిందిరా నరుడా
ఏ పాట పాడతావిప్పుడు
నీ నగ దేహాన్ని కోసుకుపోతున్న
ప్రవాహం మీద
ఏ గజ్జె కట్టి ఆడతావిపుడు
ముందస్తు ప్రణాళికలూ
ముందు జాగ్రత్తలూ
సిహాసనాలకీ కిరీటాలకే పరిమితం
సాధుపుంగవుల పాదాల మీద
పాలక పుష్ఫాల వాన
దైవ సాక్షిగా పవిత్ర నదీమతల్లుల
శీల భంగం
ప్రజారోగ్యం పాడె చుట్టూ
కాలభైరవుడి గావుకేక
బయట గాలికీ లోపలి గాలికీ
యుద్ధం మొదలైంది
ఆక్సిజన్ సిలెండర్లో
చిలక చిక్కుకుపోయింది
పిల్లలకు పాఠాలు చెప్పినట్టు
ప్రకతినిప్రేమించమని..
ప్రకతితో జీవించమని
ప్రభువా ఎన్నడైనా పలవరించావా
పిట్టలతో పాటు ఎగిరిపొమ్మని
రెండు రెక్కలైనా ఇచ్చావా
నదులూ కొండలూ అడవులూ
సముద్రం
చేతులు చాపితే
పొరపాటునైనా వాటేసుకున్నావా
ప్రభువుల్లారా అంతా
మీ చిత్తమే
ఇక కానివ్వండి
ఎవరి భుజం మీద
శవానికి వారే బాధ్యులు
- ప్రసాదమూర్తి,
8499866699