Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మేఘావత హదయం...
ఉగ్గబట్టిన శోక నది
మబ్బులు కమ్మిన మసక వెలుతుర్లలో
దుఃఖ తడి తెమ్మెరొకటి నన్ను చుట్టెస్తూ
సుధీర్గ నెలపొడుపును కలగంటూ
అడవి వెన్నుమీద కమ్ముకున్న
చీకటి నీడలను వేటాడుతూ
గదినిండా పరుచుకున్న నిశ్శబ్ద తేరుల్లోంచి
సమాంతర దుఃఖ పోతల విశాద గీతమొకటి
కనురెప్పలపై మంద్రంగా కురుస్తుంటుంది
గాయాలు సలిపే బాధలను దాచేసుకొని
దైవం మత్తునో మతం మాలిన్యాన్నో
ఒంటికి పూసుకొని కొంత వానపాములై పోదాం
వసంత సమీరాల దారులను మూసి
బురదల్లోకి ముడుచుకొనే దీర్ఘ నిద్రల మండూకాలై
మత్తులో జోగే సుఖాల అంచుల మీద ఒక
ఈస్తటిక్ ని చర్చకు పెడదాం
కను చూపుకందని దూరతీరల్లోంచి
నీలో కురుస్తున్న వాన చప్పుడును
తలుపులు తెరవని గుండె గదిలో
కుండపోతయ్యి నాలో కురిసే జోరు వాన ను
పరస్పరం వింటూనే ఉంటాం
శతాబ్దాలుగా కుళ్ళు కళేబరాలను మోసుకొచ్చిన
సెద తీరే మన బానిస శరీరాలపైన
సరికొత్త గాయాల కమురు వాసన
మనం బంధీ అయిన గది ముందటి
కొత్త చిగురుల లేత తీగ ఒకటి
ఆత్మహత్య చేసుకుంటున్నది
నా పూలతోటలో విరుస్తున్న మంచురెక్కల శీతాకోచిలుకలు
నీ గుమ్మం ముందు సిద్దమైన తేనె దారలు
నిద్రాణమై తెర వెనకన బిక్కు బిక్కు మంటున్నాయి
వాన కురుస్తునే ఉన్నది
నీలోనా నాలోనా
చడీ చప్పుడు లేని హౌరు గాలై
ఉరుములు లేని ఆకాశమై
- చెమన్,
9440385563