Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రేవతీదేవి రాసిన అనురాగ దగ్ధసమాధి కవిత చదివితే మనకెవరికైనా ఏమనిపిస్తుంది? 'నేనెవరినో మీకెవరికీ తెలియదు. ఆర్తి సెగతో ఎర్రగా జ్వలించే నీలం నిప్పు పువ్వును' అని మొదలవుతుందా 'సాంద్ర లాలసాతప్త వేదనాస్తిత్వ' కవిత. ఫలానా స్త్రీవాద ధోరణిననుసరించి రేవతీదేవి (1979) ఆ కవితలు రాయలేదు. వ్యవస్థతో రాజీ పడలేని తన ఉనికిని, స్పహని, స్త్రీలందరి గాఢమైన చైతన్య కాంక్షగా మాట్లాడిందామె. 'నాదేమీ కోకిల పుట్టుక కాదు, నా గబ్బిలం గొంతుకు గమకాలెన్నో నేర్పాలి' (నా పాటేదో నాదే) అంటోందిప్పుడు తోట సుభాషిణి. వ్యక్తిగతంగా అనిపించే ఆలోచనలు, నిర్ధారణల్లో బాహ్య ప్రపంచ స్తితిగతుల మీద గల ఒప్పుకోలో, వ్యతిరేకతో వ్యక్తం కావడం సహజం. ఏది దేన్ని ప్రతిబింబిస్తున్నదో, ఎందుకు ప్రతిస్పందిస్తున్నదో అది వేరే చర్చ కావచ్చునుగానీ, పరస్పరానుగుణంగా ఒక 'కదలిక'కి కారణమవడం ఎప్పటికప్పుడు కొత్త విషయమే. తోట సుభాషిణీని రేవతీదేవితో పోల్చడంలేదు గానీ, కుహానా నైతిక (?) జీవితం పట్ల నిజాయితీతో కూడిన ఘర్షణ ఎవరు చేసినా దాని ప్రతిఫలనాలను శ్రద్దగా గమనించవలసిందే నంటున్నాను. ఒక సింగిల్ మదర్ గా, ఉద్యోగిగా స్త్రీ రోజువారీ నిర్వర్తిస్తున్న అనేక బాధ్యతల నడుమ, ఏ సంక్షుభిత జీవన పార్శ్వాల్ని ఈ కవిత్వం చూపెట్ట దలుచుకున్నదో ఆసక్తి రేపే విషయమేనంటున్నాను.
సుభాషిణీ కవితల నిండా దు:ఖమూ, ఆవేదన, అసహనమూ, అత్యంత ప్రధాన పాత్ర కలిగి ఉన్నాయి. వాటితో బాటు వేళ్ళూనికుని ఉన్న సంఘ నియంతత్వాన్ని కొంత గిల్లి తొడపాశం పెడుతున్న అల్లరితనం ఉంది. ఆ అల్లరి వెనుక మెత్తటి తన పసితనమూ, అందులో తప్పనిసరై మోస్తున్న పెద్దరికమూ - వాటిని ఏమాత్రమూ లెక్కచెయ్య నట్టుండాలనుకునే మొండితనమూ ఉన్నాయి. లేకపోతే 'నగంగా చూడాలనుందా' (49), నేను సీతను కాదు సావిత్రిని కాదు (60), నాకు కొన్ని మగ పదాలు కావాలి (54), లాంటి కవితలు రాయగలిగేది కాదు. పైపైన చూస్తే అదంతా కోపమనిపిస్తుంది కానీ, కవయిత్రిలో ఎప్పటిదో గూడుకట్టుకుపోయిన ఒక ఆక్రోశం ఉంటుంది. అందుకే (ఆమె బుగ్గని విప్లవం చేస్తూ అన్నాడు లాంటి) కళాత్మక అభివ్యక్తుల కన్నా కూడా ఈ పుస్తకంలో వాస్తవికత ఎక్కువ స్థలాన్నాక్రమిస్తుంది. సాహిత్యపరంగా, మరీ ముఖ్యంగా కవిత్వ పరంగా స్త్రీల 'సమస్యలే కాక ఎక్కడైనా పరిష్కారాలు రాయబడ్డాయేమోనని' (83) ఆశగా కొత్తగా వ్యక్తం కాగల సామాజిక చలనాన్నేకవితలోనైన్న వెతకడం తప్పు కాదేమో? లేబర్ రూములు, అబార్షన్ స్టేట్మెంట్ల గురించీ ఇంకాచెప్పవలసిందదేమన్నా ఉందా? అని సంశయిస్తే, ఖచ్చితంగా ఉందంటుందీ పుస్తకం. 'ఎవరూ స్పశించని స్త్రీ కోణం నాది' (ఆటబొమ్మను కాదే) అని సాహసోపేతంగా ప్రకటించుకున్న కవిత్వమిది. సుభాషిణీ సజనాత్మక దక్కోణంలోని క్రియాశీలతని పరిశీలిస్తే, చుట్టూ జరుగుతున్న విషయాలు ఆమెకు ప్రేరణగా ఉంటాయి గానీ, వాటిని వ్యక్తీకరిస్తున్నప్పుడు ఆమె అప్పటిదాకా అనుభవించిన కష్ట కాలమూ, ఎదుర్కొనబోయే ఆశాజనక భవిష్యత్తూ రెండూ ప్రభావం కలిగి ఉంటాయి. వస్తువూ, శిల్పమూ రెండూ చాలా చిత్రమైనవి. ఈ పుస్తకంలో దేన్ని ఏది సానబెడుతున్నాయో సందిగ్ధం ఉంది. అందుకే ఆమె తన కవిత్వంలో చూపిన మొగ్గులోని సానుకూలత, సానుభూతుల వల్లనే సుభాషిణి కవిత్వ నిర్మాణాన్ని అంచనా వేయగలం. అందుకే ప్రముఖ విమర్శకులు లక్ష్మీనరసయ్యగారు 'సారంలో ఉక్కపోత రూపంలో ఉత్కంఠ' అనడం ఆసక్తికరకర వ్యాఖ్య.
'తీరం అల నిరీక్షణలో నీకు ప్రేమ కనబడలేదా' (వింటున్నావా), 'నా లోలో ఉన్న ఆర్తిని నువ్ తోడట్లే కన్నీళ్ళగా' (అతనితో ఆమె), 'మొత్తంగా కన్నీళ్ళు అరుగుపై సుద్దముక్కతో అలికిన పిచ్చి గీతల్లా అనిపిస్తాయి' (గడ్డకట్టిన గుండెల్లో), లాంటి వాక్యాల్లో స్త్రీ హదయం క్షణక్షణమూ పరితపిస్తున్న స్వేచ్చ కనిపిస్తుంది. చాలా కవితల్లో ఆమె అలుగుతుంది, అరుస్తుంది, మూగబోతుంది, మూతి ముడుచుకుంటుంది, కవయిత్రిలోని ఈ రకరకాల భావ ఖండనల్ని కవితలుగా చూడ్డమే మనల్ని కదిలిస్తుంది. ఆమె తన కవితల్లో ఏం జొప్పిస్తోందీ? వాటిల్లోంచి మనలోకేం వొంపేస్తోంది? ఈ జీవితమింతకన్నా ఇంకేం కాదులే పో అన్న తెగింపు ద్వారా సమస్యల్ని చెబుతున్నట్టే ఉంటుంది, కానీ అదొక సామాజిక స్థిర రూపంలో గాక, 'కొంత' మాత్రమైన మానసికావరణలో తిరుగాడ్తున్నట్టుంటుంది. సుభాషిణి ఇంకాస్త సంగ్రహంగా, స్పష్టంగా రాస్తే బాగుంటుంది. ప్రసేన్ వర్తమాన కవిత్వానికి గుడ్ 'ఎడిటింగ్' అవసరం అంటాడు. అవగాహనలో అస్థిమితం ఉందనలేను కానీ, ఈ కవిత్వ సంపుటిలో ఎక్కువ భావావేశం వల్ల దక్పధ చిత్రం కన్ను దాటిపోతున్న ప్రమాదం కనబడింది. సంయమనం కొరవడుతుంది. ఆత్మ (ూవశ్రీట) కైనా, అక్షరాని (ఔతీఱ్ఱఅస్త్ర) కైనా అదెంత ముఖ్యమైనదో (వ్యక్తిగతం పక్కనబెడితే) సాహిత్య వ్యక్తిత్వంలో సుస్పష్టంగా దొరకబుచ్చుకోవచ్చును. 'బ్రతకాలనే ఉంది' 'నిజం చెప్పొద్దూ'' ఆమె కధ' లాంటి కవితలు చదివే కొద్దీ చెబుతున్నదీ, చెప్పనిదీ ఏదో ఉంటూనే ఉందనిపిస్తుంది.
రెండొకట్ల రెండు కదా? పదకొండంటుందేమిటి? కవిత్వంలోకొచ్చేసరికి హెచ్చవేతలు మారుతున్నాయా? తన సంభాషణాత్మక కవిత్వమంతటిలో రెండొకొట్లుంటాయి. తనొకటి. ఇంకొకరు మరొకటి. ఇవి రెండూ కేవలం స్త్రీపురుష సంబంధిగా తోచినా, కాదు. తానేమీ ఎక్కాల పుస్తకాన్ని కొత్తగా అచ్చువేయట్లేదు, స్త్రీకి మాత్రమే నైతికత నేర్పాలనుకునే ఒక దుర్మార్గ 'లెక్కప్రకార' సమాజ తర్క పరామర్శని ఆమె 'లెక్క' చెయ్యదలుచుకోలేదు. ఈ కవితలవే మాట్లాడతాయి. 'ఆమెను మరుగుజ్జులుగా మలచిన ద్రోహుల్ని నమ్మడం సిగ్గు పడాల్సిన పనేం కాదు' (ఆమెలందరూ)బీ అంటుంది.'ఇక్కడ దోషులు కానిదెవ్వరు' (వురు డోంట్ వాంట్ జస్టిస్) అనడుగుతుంది. స్త్రీల పట్ల ఈ అసమ సమాజం తీరు కొత్తదేం కాదు, కానీ ఈ వంచన భావజాలాన్నెలా ధ్వంసం చెయ్యాలో చెప్పమంటున్న శక్తివంతమైన అతి మామూలు 'వచన' కవిత్వమిది. తోట సుభాషిణి కవిసంగమంలో మెరిసిన నక్షత్రం.
ఈ రెండొకట్ల పప్రస్తావనలో ''ప్రేమ గలవారు తాము రెండోవారికిగల ఆనందాన్ని గూర్చి ఆలోచిస్తారు గానీ, తమకి వారివ్వగల ఆనందాన్ని తలవరు. రెండోవారి ఆనందంతో తాము ఐక్యమవుతారు. ప్రేమ గలవారు తమని ప్రేమించక పోయినా వీరి ప్రేమ పోదన్న'' చలం (స్త్రీ) మాటలు గుర్తొస్తాయి. ఇందులో సుభాషిణి ఒక స్త్రీ తాలూకూ ఆనందం-బాధల గురించి మాత్రమే చెప్పట్లేదన్నది మనల్ని తీవ్రంగా గాయపరుస్తుంది. తానే అన్నట్టు ఇందులో ''నిస్సహాయత ఉంది. చెప్పలేని కరువూ'' (విప్లవకారుడా) ఉంది.
ఈ ఆధునిక శాస్త్ర విజ్ఞాన ప్రపంచంలో కూడా స్త్రీని సరికొత్తగా బంధిస్తున్న సో కాల్డ్ 'మార్పుల్ని' ఎలా ధిక్కరించాలో చెబుతున్న కవిత్వమిది. సుభాషిణి కవిత్వం దాపరికంలేని వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
ఆమెది కొత్త ఆలోచనలకు మూలమైన వాక్యం. అందుకే సుభాషిణి తన ఆత్మాశ్రయ ధోరణిలో చిక్కువడుతున్న లౌకికతకి మరింత నిర్దిష్టమైన బలాన్నివ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఆమె కవిత్వ స్వభావం గెలవాలనుకున్న లెక్కలు 'పరిపూర్ణంగా' తేల్తాయి. ''నది ఖురాను సూక్తం, నది బైబిలు వాక్యం. నది నా దేశాన్ని కన్న అమ్మ. తెలుసా ఈ ప్రపంచమొక మహానది. దేశాలన్నీ ఉపనదులు. నీ ఊరు నా ఊరు పిల్ల కాలువలు, సెలయేర్లు. దేశమేదైనా పాదాలు ప్రవహించే నది కనిపిస్తే నమస్కరించు' అన్న సుభాషిణీలోని కవిత్వప్రవాహపు ఘనపుటడుగుల లోతుల్నిబీ ఏ పొడవూ వైశాల్యాలతో, ఏవిధంగా గుణించి లెక్కించాలి? కొత్త సూత్రీకరణలు చేస్తున్న ఆమె కవిత్వ పాదాల్ని ఏ అనుభవ గణితం కాదంటుంది? అందుకే ఈ పుస్తకాన్నందరూ తప్పకుండా చదవండి. (పుస్తకం కోసం 9502818774ని సంప్రదించగలరు. వెల 120/-)
- శ్రీరామ్.పుప్పాల
9963482597