Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చరిత్ర-కల్పనల మేలు కలయిక మిఖాయిల్ షోలొకోవ్కి అద్భుతమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ''అండ్ క్వయిట్ ఫ్లోస్ ద డాన్'' గురించి చెప్పుకోవాలంటే రష్యన్ చరిత్ర లోకి ప్రయాణించడం,డాన్ అనే నదీ పరివాహక ప్రాంతం లో నివసించే అక్కడి కొసాక్ జాతి ప్రజల జీవితాల్లోకి తొంగి చూడటం,ఆ సంస్కతి తో పెనవేసుకు పోయిన స్టెప్పీల తోనూ,అశ్వాలతోనూస్నేహం నెరపడం ఇంకా అంతేనా నవల పూర్తి అయ్యేసరికల్లా రష్యా లో పెల్లుబికిన జాతీయ వాదం, పౌర యుద్ధం,బోల్షివిక్కుల తిరుగుబాటు ఇలా ఎన్నో అనుభవాల గుండా మనం ప్రయాణించి వస్తాము. అలా అనిచెప్పి ఇది ఒక చరిత్ర పుస్తకం లా ఉంటుందని భావిస్తున్నారా ,అయితే పొరపాటు పడ్డట్లే...హదయమున్న ప్రతి మనిషి ని కదిలించే పాత్రల తో నడిచే నవల ఇది.కల్పన ని చరిత్ర తో చాలా తెలివి గా ముడివేసి అల్లిన విలువైన హారమిది.
రచయిత మిఖాయిల్ షోలొకోవ్ 1926 లో నవలని మొదలుపెట్టి 1928లో పూర్తి చేశాడు. 1965లో దీనికి నోబెల్ బహుమతి వచ్చింది. వార్ అండ్ పీస్ తర్వాత రష్యన్ సమాజంపై వెలువడిన సాధికారమైన రచనగా విమర్శకులు భావిస్తారు. ఇంతకీ ఏమున్నది దీనిలో..! సరే, కథలోకి ప్రవేశిద్దాము. డాన్ అనేది దక్షిణ రష్యాలో ప్రవహించే నది. ఈ నదికి దగ్గరలో ఉండే ఓ గ్రామమే.. టటార్స్క్! అక్కడ నివసించే సముదాయం అంతా కొసాక్ జాతి ప్రజలు. వారు జీవిక కోసం వ్యవసాయం చేస్తారు. కాని తాము రైతులం మాత్రమే కాదు, ప్రధానంగా యుద్ధ వీరులం అని వారి భావన. సైన్యంలో కూడా కొసాక్ల పేరు మీద రెజిమెంట్లు ఎప్పటినుంచో ఉన్నాయి. అది ఏ యుద్ధం గాని రష్యా తరపునుంచి దానిలో కొసాక్లు ఉండవలసిందే.
నవల మొదలు కావడమే ప్రధాన పాత్ర అయిన గ్రెగరి మెలెఖొవ్ యొక్క తాత వత్తంతంతో మొదలు అవుతుంది. అతని పేరు ప్రొకాఫి మెలెఖొవ్, ఒక యుద్ధంలో ఫాల్గొన్న తరవాత తన స్వగ్రామానికి తిరిగివస్తాడు. వస్తూ వస్తూ టర్క్ జాతీయురాలైన ఒకావిడని భార్యగా చేసుకుని ఇక్కడ అడుగు పెడతాడు. ఒక కొసాక్ ఇంతవరకు టర్క్ని పెళ్ళి చేసుకోవడం అనేది లేదని ఆ గ్రామం అంతా వారిని వేరుగా పెడుతుంది. దానితో చేసేది లేక ఊరికి దూరంగా డాన్ నది ఒడ్డున చిన్న ఇల్లు వేసుకుని నివసిస్తుంటాడు. అయినప్పటికీ అతని భార్య పై వేధింపులు ఆగవు. ఆమెని మంత్రగత్తె అని చెప్పి దాడి చేస్తారు. అప్పుడు జరిగిన గొడవల్లో భార్య మరణిస్తుంది. అప్పటికి వారికి ఒక మగబిడ్డ పుడతాడు. అతని పేరు పేంటలైమన్ మెలెఖొవ్. ఈ కొడుకుకి ఓ కొసాక్ యువతిని ఇచ్చి పెళ్ళి చేస్తాడు. ఆ విధంగా మళ్ళీ మెలెఖొవ్ కుటుంబం ఊరిలోని ప్రధాన స్రవంతిలో కలుస్తుంది. ఈ పేంటలైమన్కి పుట్టిన వాడే గ్రెగరి మెలెఖొవ్. నవలకి ఇతనే ప్రధాన పాత్రధారి. సరే... గ్రెగరికి ఓ సోదరుడు, ఓ సోదరి ఉంటారు.
ఈ టాటర్స్కీ గ్రామంలోని కొసాక్ల జీవిత విధానం చాలా విషయాల్లో భారతీయ గ్రామాల్లాగే ఉందే అనిపిస్తుంది. ఇంటికి సంబందించిన విషయాల్లోనూ, పెళ్ళిళ్ళ విషయాల్లోనూ, సామాజిక పరమైన అంశాల్లోనూ పితస్వామ్య విధానమే అమలులో ఉన్నట్లు అగుపిస్తుంది. అలాగని స్త్రీలు ఎటువంటి పాత్ర లేనివారు అనుకోవడానికి లేదు. అవసరమైన పరిస్థితుల్లో ఎటువంటి కఠినమైన జీవన యానానికైనా వెనుదీయని ధీరవనితలే..!
గ్రెగరీ యవ్వన ప్రాయంలోకి వస్తాడు. తండ్రికి వ్యవసాయ పనుల్లోనూ ఇంకా ఇతర పనుల్లోనూ చేదోడు వాదోడుగా ఉంటాడు. తండ్రి పేంటలైమన్ ఒకప్పుడు యుద్ధంలో ఫాల్గొని వచ్చినవాడే. ఆ సమయంలో అతని కాలు సైతం దెబ్బ తింటుంది. ఒక వయసు రాగానే ప్రతి కొసాక్ పురుషుడు సైనిక శిక్షణ పొందవలసిందే. ఆ తర్వాత ఏ యుద్ధం వచ్చినా తయారుగా ఉండవలసిందే. ఆస్ట్రియన్లతోనూ, జర్మన్లతోనూ, ఇంకా ఇతర ఏ యుద్ధం ఏ వైపునుంచి వస్తుందో అన్నట్లుగా ఉంటుంది వారి జీవితం. ఇవి కాక దేశంలో రేగే పౌర యుద్ధాలు... కొసాక్ల జీవితం మొత్తం యుద్ధమయమే. యుద్ధాలు లేనపుడు మరో వైపు జీవితాన్ని ఆనందంగా స్టెప్పీల మధ్య వ్యవసాయం చేస్తూ, చేపలు పడుతూ, జానపద గీతాలు పాడుకుంటూనూ గడిపేస్తుంటారు. ఇంకా మతపరంగా చెప్పాలంటే రష్యన్ అర్థోడాక్స్ చర్చ్ వారి జీవితాలతో పెనవేసుకుపోయి ఉంటుంది.
యవ్వన ప్రాయానికి వచ్చిన గ్రెగరీ తమ ఇంటిపక్కనే ఉండే అక్సీనియా అనే వివాహితని ప్రేమిస్తాడు. ఈమె భర్త స్టెపాన్ అస్టకోవ్ సైన్యంలో ఉంటాడు. ఆమె కూడా ఇతని పట్ల అనురక్తితో ఉంటుంది. ఇటువంటి సంబంధాల్ని కొసాక్ సమాజం ఎంతమాత్రం ఆమోదించదు. తండ్రి కూడా గ్రెగరిని హెచ్చరిస్తాడు. ఇది ఎంతమాత్రం తగని పని అని చెప్పినా ఈ రహస్య సంబంధం సాగుతూనే ఉంటుంది. ఇక ఇలా కాదు అని పేంటలైమన్ కొడుకికి ఒక సంబంధం చూసి పెళ్ళి చేస్తాడు. కోడలి పేరు నటాలియ. పొరుగు గ్రామానికి చెందిన ఓ ధనిక వ్యాపారి కుమార్తె.
అయినప్పటికీ అక్సీనియా, గ్రెగరిల మధ్య అనుబంధం సడలదు పైగా గట్టిపడుతుంది. ఒక రాత్రిపూట వీళ్ళు ఇద్దరూ గ్రామం విడిచి పారిపోతారు. అలా వెళ్ళిపోయి నికోలారు అలెక్సియేవిచ్ లిస్టిన్స్కీ అనే విశ్రాంత సైనికాధికారి భవనంలో పనికి కుదురుకుంటాడు. ఆర్మీ నుంచి రిటైర్ అయి విశ్రాంత జీవనం గడిపే ఈయనకి కొన్ని వేల ఎకరాల భూమి ఉంటుంది.అక్సీనియ ఇంట్లో వంటమనిషిగా పనిచేస్తుండగా, గ్రెగరీ ఎస్టేట్ పనుల్లో ఉంటాడు. అలా వాళ్ళ జీవితం గడిచిపోతుంది. కొన్ని నెలలతర్వాత టాన్యా అనే కూతురు పుడుతుంది. గ్రెగరి తండ్రి, కొడుకు చేసిన పనికి ఎంతో చింతిస్తూ ఉంటాడు.
సైన్యంలో చేరడానికి గ్రెగరి కి పిలుపు వస్తుంది. తప్పనిసరిగా వెళ్ళవలసిన పరిస్థితి. నికోలారు భవనంలో భార్యని, కూతురుని ఉంచి నిరాశతోనే సైన్యంలోకి వెళతాడు. శిక్షణ అనంతరం ఆస్ట్రియా వారితో జరిగే యుద్ధానికి పంపబడతాడు. ఆ యుద్ధంలో మంచి ప్రతిభ చూపి సెయింట్ జార్జ్ మెడల్ పొందుతాడు. అలాగే ప్రమోషన్ మీద ఆఫీసర్ కూడా అవుతాడు. విధి విచిత్రమా అన్నట్లు ఈలోగా అక్సీనియ తన యజమాని కొడుకు అయినటువంటి యూజిన్ లిస్టిన్స్కీకి చేరువ అవుతుంది. సైన్యం నుంచి వచ్చిన గ్రెగరి ఎంతో బాధపడి తన గ్రామం వెళ్ళిపోయి నటాలియాతో కలిసిఉంటాడు. ఆమెకి ఇద్దరు పిల్లలు పుడతారు.
గ్రెగరి సైన్యంలో ఉన్నప్పుడే కొన్ని మార్పుల్ని గమనిస్తుంటాడు. సైన్యంలోనే అంతర్గతంగా బోల్షివిక్ల్ని సమర్ధించే వారు ఉంటారు. ఎంతోమంది సానుభూతిపరుల్నిపై అధికారులు చంపివేయడం చేస్తుంటారు. అలాగే రష్యన్ జాతీయవాదం ఏ విధంగా చాప కింద నీరులా విస్తరించిందో అనేక సంఘటనల ద్వారా అవగతమవుతుంది. గ్రామాల లోనికి వివిధ వత్తులు చేసే వారిగా ప్రవేశించి ఏ విధంగా ప్రజల లోనికి తమ భావజాలాన్ని కొనిపోయారో ఈ నవలలో ప్రస్ఫుటం గా తెలుస్తుంది. అలాగే అనేక యుద్ధ సన్నివేశాలు కళ్ళకి గట్టినట్లుగా వర్ణించాడు రచయిత. స్వయంగా సైనికాధికారిగా పనిచేసిన మిఖాయిల్ షోలకోవ్ ఇలాంటి సందర్భాల్లో చాలా లోతుగా వెళ్ళి మనకి వివరిస్తుంటాడు. కొన్ని చిత్రణలు క్రూరంగా, దయనీయంగా, దమనీయంగా ఉంటాయి.
పౌరయుద్ధం అవడంతోనే మళ్ళీ అక్టోబర్ విప్లవం మొదలవుతుంది. వీటికి ముందు ఇంకా కొన్ని యుద్ధాలు జరుగుతాయి. ఇవి అన్నీ చాలా పేజీలు తీసుకున్నాయి.565 పేజీలు ఉన్న ఈ నవల ఓ సామాన్య కొసాక్ కుటుంబాన్ని ఆలంబనగా చేసుకుని నడుస్తుంది. కొన్ని డజన్ల పాత్రలు వస్తూంటాయి. చివరకి అక్సీనియ, నటాలియ ఇద్దరూ మరణిస్తారు. ఇంతేనా జీవితం అనుకుంటూ ఉండగా నవల ముగుస్తుంది. కొసాక్ల యొక్క జానపద గీతాలు కూడా నవలలో సందర్భానుసారం వస్తుంటాయి. నవల మొదట్లో వచ్చిన ఓ గీతాన్ని ఇలా తెలుగులోకి చేశాను.
''మా ప్రియమైన,ఘనమైన భూమి కేవలం
నాగళ్ళ తోనే దున్నబడలేదు
మా అశ్వాల యొక్క గిట్టలతో దున్నబడింది
మా కొసాక్ ప్రజల తలలనే ఇక్కడ విత్తనాలుగా నాటాము
మంద్రంగా ప్రవహించే మా డాన్ నదికి
అలంకరణ విధవరాండ్రైన యువతులే
మా తండ్రి డాన్ వికసించేది అనాధపిల్లలతోనే
మా డాన్ నదిలోని మంద్రమైన అలలలో ఉన్నవి
మా తల్లి తండ్రుల కన్నీళ్ళే
''ఓ తండ్రి, ఓ డాన్... ఎందుకని
ఇంత భారంగా ప్రవహిస్తున్నావు..?''
''అV్‌ా.. ఇంకెలా ప్రవహించాలి... ఇలాగే గదా ఉండాలి
నా లోలోపలినుంచి వసంతాలు కదా వికసించాలి
నా మధ్యలోనుంచే గదా మిలమిల మెరుస్తూ ఓ చేప పైకి ఎగరాలి..''
మానవ చరిత్రలోని కొన్ని ముఖ్యమైన భాగాల్ని ఒక ప్రాంత జనుల నేపథ్యం లో ఎలా నడిపించాడో తెలియాలంటే మిఖాయిల్ షోలొకోవ్ రాసిన ఈ నవలని ప్రతి ఒక్కరు చదవాలి. 1965 లో ఈ నవలకి నోబెల్ బహుమతి ప్రకటించినపుడు దీని కర్తత్వం మీద కొన్ని విభిన్న అభిప్రాయాలు వెలువడ్డాయి. అయితే ఆ తర్వాత జరిగిన పరిశోధన లో అవి అన్నీ వీగిపోయాయి.దాదాపుగా నాలుగుసార్లు ఈ నవల తెర కెక్కింది. ఓపెరాగా కూడా ప్రదర్శితమైనది. ఇంగ్లీష్ అనువాదం చేసినవారు స్టీఫెన్ గ్యారి.ఏ మాటకి ఆ మాట మిగతా చాలా సోవియెట్ రచయితల అనువాదాల తో పోలిస్తే కొంత పాషాణ పాకంగా ఉన్నదనే చెప్పాలి. అయినప్పటికీ ఓపిక చేసుకుని చదివితే గొప్ప క్లాసిక్ చదివిన అనుభూతి మిగులుతుంది.
- మూర్తి. కె.వి.వి.ఎస్.
7893541003