Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్మశానం రోడ్డుపైకొచ్చేసింది
మానవత్వమేనాడో చేసిందా పని
వైద్యం వ్యాపారం స్నేహంగా
ఒకదాని భుజం పై ఇంకొకటి
చేతులేసుకొని సంచరిస్తే
సేద తీరేందుకు పడక
పీల్చేందుకు ఆమ్లజని
ధరల ట్యాగులతో దర్శనమిచ్చి
ముసుగేసుకున్న మనిషి ముఖంలో
మానవత్వం ఇసుమంతైనా
కానవస్తుందేమోనన్న ఆశని
ఎదురవుతున్న శవాల రూపంలో
నిరాశ తొక్కిపెడుతోంది
నీకిక కాలం చెల్లిందంటూ
ఐనా మనిషిపై ఉన్న నమ్మకాన్ని
ఏ వైరసూ చంపలేకున్నది
ఎన్ని జరిగినా ఎంత చూసినా
ఇక దిక్కెవరు మనకంటూ
మానవుడినే ఆశిస్తోంది స్వప్నం
ఇంకా ఎక్కడో చిన్నపాటి అపేక్ష
శవానికి ముందు రూపమైన రోగికి
నిన్నటిదాకా తనతో పాటు
రెండుకాళ్ళతో తిరిగిన వారిపై
ఎదలోతుల్లో ఎక్కడో ఓ మూల
తనతో పాటు జన్మనెత్తిన జీవిని
డబ్బును పక్కన పెట్టి చూస్తారన్న
చిరు వాంఛ ప్రాణం పోకుండా
ఊపిరి బిగబట్టి చూస్తోంది
శవమై కాలిపోతూ కూడా
మనిషివైపొకసారి చూస్తోంది
దింపుడుకళ్ళెపు అత్యాశలాగా....
- జంధ్యాల రఘుబాబు
9849753298