Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనకు తెలియకుండానే పరివారోన్మత్తేదో గుప్పున కురిసి
తెలియని బానిసత్వంలోకి జోకొడుతున్న వేళ
కొచ్చటి రాళ్ళలాంటి ప్రశ్నలిసిరే లోకాయతాన్ని మరిచి
గడ్డకట్టిన నెత్తురును మరిగించేందుకో కొలిమి కావాలి.!
కొత్తవేషంలో తిరుగుతున్న పాత రూపమేదో ప్రధానమై ఆవహించి
చీకటి నవ్వులు చిమ్మి ఏమారుస్తున్న కాలాన
వెచ్చటి ఊపిరిలాంటి చార్వాక మూలాల జీవకణాలను
తట్టిలేపేందుకో అగ్నిగోళం కావాలి.!
మానవజాతి మాయికే మసిపూసిన ధర్మమేదో
దేశంకోసమని వగలబడుతూ
ప్రజాస్వామ్య ఊపిరిగుడిలో దట్టంగా
కేంద్రీకతమైన మధ్యయుగాల కాలుష్యాన్ని
ప్రారదోలేందుకో జ్వాజ్వలప్రాణ బోధివక్షం కావాలి.!
ఇండియాకు కవచకుండలమై కంటికి రెప్పలా
కాపలా కాస్తున్న రాజ్యాంగాన్ని రద్దుచేసేందుకు
నాల్గుపడగల నాగరాజు నాల్కలుకోరి కాటేస్తుంటే
అచేతనంగా చూస్తున్న నరాలను నరుక్కుని
తిరగబడేందుకో గండ్రగొడ్డలి కావాలి.!
నిచ్చనమెట్ల కట్లపాముగాట్ల గాయాల నుంచి
కారుతున్న కన్నీటి గేయాలను మానవత్వ
మూలాలను గానం చేస్తూ నేలక్షేత్రానికి నెత్తురద్దిన
శాంతి మొక్కలకు నీరుపోసి దేశాన్ని
రక్షించుకునేందుకో సాంస్కతిక సైన్యం కావాలి.!
బలికి సిద్ధంచేసిన భారతికి కమండలవస్త్రం చుట్టి
కమలం పూదండేసి జై కొడుతూ అమ్ముతుంటే
భారతమాతంటే అంగట్లో బొమ్మకాదురా
సామాన్యుడి అమ్మ అని ఎలుగెత్తేందుకో
నిప్పులగొంతుక కావాలి.!
- ఎం. విప్లవకుమార్