Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గుండెల నిండా ఊపిరి తీసుకోలేకపోతున్నాను
నలుదిక్కుల నుంచి చెట్లు వీస్తున్న శబ్దాన్ని వింటున్నానే తప్పా
బతకడానికి ప్రాణవాయువుగా పొందలేక పోతున్నాను
నేనేసిన ఓటు ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని
నిలబెడుతుందో తెలియదుకాని
నా వేలికున్న ''ఆక్సిమీటర్'' నేనెంత గాలి
పీలుస్తున్నానో రహస్యం లేకుండా చెప్పేస్తుంది
టెంపరేచర్ పరికరం ఏసీ గదిలో కూడా
బతకడానికి చావడానికి మధ్యనున్న
పర్సంటేజ్ ఖచ్చితంగా చూపిస్తుంది.
కేవలం కాన్పులే చూసిన ఆసుపత్రుల
గోడల పక్కనే ఎవరి చితి వారే పేర్చుకుని
దేహాలు కాల్చుతున్న వాసనలకి కడుపు దేవుతోంది
తల్లుల కడుపు పండిన రోజులన్ని మాసిపోయి
కడుపుకాలిన భార్యల రోదనల్లోకి సమయం రూపాంతరం చెందింది
సరికొత్త నాగరికత మనిషి చరిత్రని మసితో రాస్తోంది.
కొంగు చాటున చనుబాలు తాగాల్సిన శిశువుల ముక్కుకి ఆక్సిజన్ పైపుకి మధ్య అవినీతి అడ్డంపడ్డప్పుడు
భోపాల్ నుంచి నీలోఫర్ దాకా
జలియన్‌వాలా బాగ్ నుంచి ఇంద్రవెల్లి దాకా
బలవంతంగా ఆపేబడిన శ్వాసలన్నీ కుట్రలేనని బట్ట బయలయ్యాక
గాలి పీల్చడమూ నేరమేకదా
కాబట్టే దేశమంటే స్మశాన వాటిక అందులో
ప్రతీ రోదనా ఓ కాటీసీను పద్యం
గతం నుంచి నిన్నటిదాకా
కృత్రిమంగా కూడా శ్వాస దొరకక
ఆయువుని మింగేస్తున్న వేళ
ప్రభుత్వాలకు ప్రజల ప్రాణమంటే ఎన్నికలనే భ్రమలు ముదిరినాక
రేపటిని కలలుకనే దేహాల భవిత కోసం బతకడానికి అవసరమైన స్వచ్ఛమైన గాలి కోసం
ఇప్పుడాగిపోతున్న ఆఖరి ఆయువుల కోసం
రాజ్యాంగ సవరించైనా ఇవ్వమని
రాజ్యాన్ని గొంతుపట్టుకుని అడగాల్సిందే.
- అనిల్ డ్యాని,
9703336688