Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ పేరు వినగానే ఓ సీదాసాదా వ్యక్తి ఎదురుగా నిలబడ్డ ఫీలింగ్. అది సాయంత్రం వేళ. ఖలీల్ వాడిలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో సాహితీ సమావేశం. నేనప్పుడే డిచ్పల్లి నుండి ఆదరబాదరగా వచ్చి కూర్చున్నాను. అప్పుడే మధుగారి ఉపన్యాసం ప్రారంభమైంది. ఎన్నో సాహితీ విషయాలు మాట్లాడి ప్రేమ్‌చంద్ కథ 'సవాసేర్ గెహూ' గూర్చి చెప్పడం ప్రారంభించాడు. కథ ఆసాంతం విన్నాక కండ్లముందు మొత్తం దృశ్యమానమయ్యింది. బహుశా ఆ కథను నేను చదివితే కూడా నేను అంతగా దాంట్లో లీనమయ్యేవాణ్ణి కాదేమో. అప్పట్నుండి అతనంటే నాకు తెలియకుండానే అభిమానం పెరిగింది.
1973-74 సంవత్సరాల్లో కామారెడ్డిలో ఆదర్శ కళాసమితి ఏర్పాటు చేయడం ఎప్పుడన్నా నిజామాబాద్‌కు వస్తే మధుగారు పని చేస్తున్న బట్టల షాపులో కూర్చొని చాలా సేపు మాట్లాడి పోయేవాణ్ణి. పక్కనే బిఎన్బి కూడా వుండేవాడు.ఆ పిదప మా పెళ్ళిలో మాట్లాడి ఓ కవిత కూడా చదివాడు. అది 1980 నాటి ముచ్చట. 'విరసం' తీవ్ర నిర్బంధం ఎదుర్కొంటున్న సమయంలో ఓ ఎనిమిది మంది సభ్యులముగా అప్పుడప్పుడు కూర్చొని చర్చించే వాళ్ళము. మధుగారు ఎందరి పుస్తకాలకో ముందు మాట రాశారు.
నా అనువాదం 'స్వాతంత్య్రం ప్రజావిమోచనం' (కోబడ్ గాంధీ ఆంగ్లవ్యాసం)కు కూడా ఎంతో అభిమానంతో ముందుమాట రాసిచ్చాడు. అనివార్యకారణాల వల్ల అది ముద్రణకు నోచుకోలేదు. సెప్టెంబర్ 2018లో మేము హైదరాబాద్‌కు మకాం మారుస్తున్న వేళ ఎంతో ప్రేమతో కొన్ని కవితలు రాసి మా ఇద్దరు భార్యభర్తలకు అంకితమని రాసిచ్చాడు. మొన్నటికి మొన్న ఒకవైపు క్యాన్సర్‌తో జీవన్మరణ పోరాటం చేస్తూ 20 కవితలు రాసి మాకు పోస్టు చేశారు. సుమారు 18 నెలలుగా క్యాన్సర్ బారినపడి ఓటమి పాలయ్యాడు. నిజామాబాద్‌లో ఏ ప్రజా ఉద్యమం జరిగినా తానుగా వెళ్ళి తన సంఘీభావం తెలిపే వాడు. ప్రతి ఉద్యమంలో తన ముద్ర కనపడేది. ఎందరో కవులకు, రచయితలకు సూచనలు ఇవ్వడమేగాక అడగడమే ఆలస్యం 'ముందు మాట' రాసివ్వడమేగాక నిరంతరం తన సాహితీ కృషిని కొనసాగించడం ఎప్పుడూ ముందుండేవాడు. చాలా సంవత్సరాలు 'సెప్టెంబర్ 17' నాడు నిజామాబాద్ పట్టణంలో 'తెరవే' పక్షాన జరిపిన 'సాహితీగోష్టి'లో ప్రధాన వక్తగా పాల్గొని ఆనాటి రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతుల్ని కళ్ళకు కట్టినట్లు వివరించే వాడు. నవతెలంగాణతో పాటు అనేక పత్రికలకు శాస్త్రీయ ఆలోచనతో అనేక వ్యాసాలు , కవితలు రాసేవారు.
ఆయనో ధిక్కారస్వరం ఆయనో ప్రజా రచయిత
కోవిడ్ మహమ్మారి విళయతాండవం చేస్తున్న వేళ ఆప్తులు, ఆత్మీయులు, రక్త సంబంధీకులు... ఎందరో.... ఎందరెందరో భౌతికంగా దూరమ వుతున్నా కడసారి చూపు చూడలేని అమానవీయ సందిగ్థంలో కొట్టుమిట్టాడుతున్న మనమంతా ఆ ప్రజారచయితకు పిడికిళ్ళెత్తి లాల్ సలాములు చెబుదాం.
- ఎనిశెట్టి శంకర్, 9866630739