Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కుటుంబం సమాజానికి మీనియేచర్ లాంటిది. సమాజంలో కుటుంబం ఒక చిన్న యూనిట్. కుటుంబ క్రమశిక్షణ సమాజంలో ప్రతిఫలిస్తుంది. సమాజ అభివద్ధికి కుటుంబం ఆధారం. అనేక కుటుంబాల కలయిక సమాజం. కుటుంబంలోని మనుషుల మధ్య ఉండేవి కుటుంబ సంబంధాలు. కొన్ని సంబంధాలు సమాజంలో గల కుటుంబాల మధ్య నెలకొని ఉంటాయి. ఆ విధంగా సమాజంలో పటిష్ట సంబంధాలు ఏర్పడుతాయి. ఈ సంబంధాలన్ని మనుషుల మధ్య మానవీయతను పెంపొందిస్తాయి. మానవీయ సంబంధాలన్నీ మానవ ప్రగతికి దోహదపడుతాయి. ఇందులో మళ్ళీ అనేక రకాలు. రక్త సంబంధీకుల మధ్య గల అనుబంధాల్ని రక్తసంబంధాలు అనీ, కుటుంబాల మధ్య జరిగే ఆదాన ప్రదానాలకు ఆధారమైన వాటిని కుటుంబ సంబంధాలనీ అంటారు. భారత దేశము అనేక కులాలతో కూడిన దేశము. కులాల వల్ల మనుషుల విభజన జరిగింది. దానికోసం కులకట్టుబాట్లు ఏర్పడినాయి. ఒకే కులం లోపల కాని, అనేక కులాల మధ్యగాని ఉండే కట్టుబాట్లు, వాటి మధ్య సంబంధాల్ని ఏర్పరుస్తాయి. అలా కులసంబంధాలు ఉనికిలోకి వచ్చాయి. సమాజంలో సుస్థిరత, ప్రగతి, శాంతి భద్రతలు పరిపాలన వల్ల నెలకొల్పబడుతాయి. పాలన సజావుగా సాగడానికి సమాజంలో ఒక క్రమాన్ని లేదా దొంతరల్ని ఏర్పాటు చేసారు. పూర్వకాలంలో పాలనా చట్రం నియమనిబంధనల్ని మనుషుల మధ్య విధించింది. అవన్ని వర్గ సంబంధాలు, పాలనా సంబంధాలు, అధికార సంబంధాలు, ఇలా పేర్లేమయినా అన్ని సామాజిక సంబంధాలే. సారాంశంలో మానవుల మధ్య మానవీయతను పెంచడానికి సుఖమైన అభివద్ధికి సాధనాలుగా పనిచేయడానికి ఉద్దేశించబడినవి వీటిని మానవ సంబంధాలుగా పరిగణించ వచ్చు. ఇదొక విస్తతార్థం. మనిషి పుట్టినప్పటి నుండి నేటి వరకు మానవ సంబంధాలు వర్దిల్లుతూనే ఉన్నవి. ఏయే ప్రాతిపదికలపై అవి కొనసాగుతున్నవో వాటిని ఆయా పేర్లతో పిలుస్తున్నరు. ఇదంతా దష్టి బేధం వల్ల జరుగుతుంది. సాహిత్యం విశ్వమానవ కళ్యాణాన్ని కాంక్షిస్తుంది. అదే అలవరసలపై కథ సాగుతున్నది. మానవ సంబంధాలకు కథ పెద్దపీట వేసింది. తెలంగాణ కథకులు ఆ దారిలో కథను ముందుకు నడిపారు.
ఒక ప్రాంత సంస్కతీసంప్రదాయాలు, అక్కడి ప్రజల ఆదానప్రదానాలను, మనుగడను సూచిస్తాయి. వీటి వల్ల ఆ కాలపుప్రజల మానవీయ స్పందనలు, స్పూర్తి, జీవన ప్రమాణాలు తెలుస్తాయి. తెలంగాణది పల్లె సంస్కతి. ఇక్కడ ఉత్సవాలు, ఉర్సులు, వేడుకలు ఎక్కువ.
జానపదులు శ్రమజీవులు. తెలంగాణవారు సమిష్టికి పీట వేస్తారు. వీరిది ఉమ్మడి సంస్కతి. ఊరుమ్మడి బ్రతుకు. దీన్ని గమనిస్తే ఇక్కడ విరిసిన మానవీయత తెలుస్తుంది. ఊరి మానవీయసంబంధాల్ని, సంస్కతి విశేషాల్ని తెలుపుతూ జింబో ''వేములవాడ కథలు'' రాస్తే కులం కట్టుబాట్ల మధ్య మానవ సంబంధాలు ఎలా ఉంటవో శ్రీనివాస్ గౌడ్ రాసిన ''పేదల బతుకులు' తెలుపుతాయి.
తెలంగాణది వ్యవసాయ సంస్కతి. ఇక్కడి పండగలు ఎక్కువగా ప్రకతితో ముడిపడినవి బతుకమ్మ, దసరా, కామునిపున్నమ, బోనాలు మొదలైనవి ఇక్కడి పండగలు. గ్రామదేవతల పండగలు ఈ ప్రాంత విశిష్టతను తెలుపుతాయి. గుండె డప్పుకనకయ్య రాసిన ''తీర్థం'', ''గావు'' వంటి కథల్లో గ్రామదేవతల పూజాదికాలను చూస్తాము. పీర్ల పండగ, ముల్కీ,
ధోకా, అస్సోయిదూల మొదలగు కథల్లో పీర్ల పండుగ విశేషాలు కనపడుతాయి. ఈ కథల్లో మానవ సంబంధాల్లోని రుణాత్మక, ధనాత్మక ధోరణులు కనపడతాయి. శ్రామిక సంస్కతికి చిహ్నాలైన పాటలు ఇక్కడి కథల్లో వినిపిస్తాయి. ఒకప్పటి మానవసంబంధాలు పల్లెల్లో కరువయ్యాయని, నాగరికత నీడల వల్ల పల్లెలు సహజ దనాన్ని కోల్పోయాయని వనమాల చంద్రశేఖర్ రాసిన ''శిథిలాలు'' కథ చెబుతుంది. రైతు జీవితం చితికి పోవడానికి అనేక కారణాలున్నవి. అందులో బ్యాంకు అప్పులు కూడా ఒక కారణం. ఈ అప్పులు రైతు జీవితాన్ని అమానవీయ పరిస్థితికి నెట్టి వేస్తున్నవి. ఈ విషయాల్ని ఎలికట్టె శంకర్ 'భూతనక'' కథలో విశదీకరించారు.
అభివద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రకటిస్తుంది. చేపడుతుంది. అందులో ప్రాజెక్టుల నిర్మాణం కూడా ఒకటి. దీనివల్ల ముంపు సమస్య ఏర్పడింది. అనేక పల్లెలు నీళ్ళల్లో మునిగిపోయాయి. గ్రామీణ మానవ సంబంధాలు కూడా ఆ నీళ్ళల్లో కొట్టుకు పోయిన వైనాన్ని అనేక కథలు నిరూపించాయి. అందులో బి.వి.ఎన్. స్వామి రాసిన ''అభివద్ధికి ఆవల'' కథ ఒకటి. తెలంగాణలో నీటి కరువు కరెంటు సంక్షోభం వల్ల రైతులు దివాలా తీస్తున్నారు. పదిమందికి పెట్టే రైతులు, కడుపు కట్టుకొని వలసలు పోవడం ఆత్మహత్యలు చేసుకోవడం కనపడుతున్నవి. వ్యక్తుల మధ్య పోటీలు, స్పర్థలు, కుట్రలు మొదలయ్యాయి. ఈ దశలో మానవసంబంధాలన్నీ ఎండమావులయ్యాయి. మనుషుల జీవితాల్లో మానవతా కరువును, దానివల్ల కలిగే దయనీయతను ఆర్తిగా చిత్రించిన కథ ఉదయమిత్ర రాసిన ''అమ్మను జూడాలే!'' ప్రాజెక్టులు ప్రజల్ని ముంపుకు గురిచేసినట్లే ఒపెన్‌కాస్టు అక్కడి ప్రజల్ని భూనిర్వాసితుల్ని చేసినవి. భూములు, నివాసాలు కోల్పోయిన వారు తెగిన గాలిపటాలుగా బతుకుతున్నరు. ఇక వాళ్ళ జీవితాల్లో మానవ విలువలకు తావెక్కడీ ఆకలిచావులకు గురవుతున్న వారి జీవితాల్ని చిత్రించిన కథ ''బొగ్గుదొంగ''. పి.చంద్ రాసిన ఈ కథలో ముసలి, ముతక, పిల్లాపాపలు ఏ విధంగా బతుకీడుస్తున్నారో తెలుస్తుంది.
బజార్లో, వర్షంలో తడుస్తున్న లంబాడీలకు తన బంగళాలో ఉండటానికి చోటిచ్చిన చిన్నపిల్ల కథ ''నేను సైతం'' అమతలత రాసిన ఈ కథలోని మానవీయ స్పందనలు ఆకట్టుకుంటాయి. అల్లాడి శ్రీనివాస్ కు మానవసంబధాల పట్ల గల తపన కథలుగా మారింది. ''అమతధార'', ''ఎడారిపూలు'' ''మబ్బులు కలిసిన వేళ'' లాంటి వీరి కథలు ఇందుకు నిదర్శనాలు. ఆర్థిక విషయాలు, మానవసంబంధాలను ఏ విధంగా మలుస్తాయో అన్జద్ అలి ''పెట్రోడాలరు'' అనే కథ తెలుపుతుంది. శ్రీమతి ఉమాభాస్కర్ రచించిన కథ ''ఆశీర్వాదం''. కొడుకుల ఆదరణను పొందని తల్లిదండ్రుల దైన్యాన్ని ప్రస్తావించింది. ఉప్పుల లింగయ్య రాసిన ''రాతితేమ'' కథ భార్యాభర్తల మధ్య గొడవలు, పట్టింపులు, రాజీలను చిత్రించింది. ఎం. విజయమోహన్ రెడ్డి ''దొరకని భాగ్యం'' కథలో వినియోగదారీ మనస్తత్వాన్ని విమర్శకు పెట్టి, మానవత్వానికి పెద్దపీట వేశారు. ఎనగంటి వేణుగోపాల్ ''రుణం'' కథ వద్ధులైన తల్లిదండ్రుల పట్ల అనుచితంగా ప్రవర్తించే కొడుకుల కళ్లు తెరిపిస్తుంది. కటుకోజ్వల మనోహరాచారి కథలు ఎక్కువగా మానవ జీవితంలోని సుఖదుఃఖాలను పట్టిచూపుతాయి. చింతల దేవేందర్ ''జ్ఞాపకం'' అనే కథలో చిన్ననాటి స్నేహితురాలి ఆదరణ కంటికి నీరు తెప్పించడాన్ని సహజంగా చిత్రించారు. చొప్పకట్ల చంద్రమౌళి వేములవాడ గుడి నేపథ్యంలో 'గుడిగంటలు'' అనే కథను రాశారు. అంతస్తులు అడ్డువచ్చి భగప్రేమగా అంతమైన విషాదాంత గాధ ఇది. మానవుల జీవితం మనకంటే హీనంగా ఉన్నదనే విషయాన్ని రెండు ఎద్దుల సంభాషణ ద్వారా ''మనమేనయం'' అనే కథలో కాళోజీ చెప్పించారు. శేషాద్రి రమణ కవులు రాసిన ''ప్రణయ బంధము'' అమలిన ప్రేమను, బి.వి.రంగారెడ్డి రాసిన ''పాశ్చాత్య వ్యా మోహము'' భారతీయ కుటుంబ సంబంధాల విశిష్టతలను తెలిపాయి.
ఇక్కడి నుండి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసీ అనే వాక్యసారాన్ని కలంలో ఒంపుకొని కథలు వెలువడ్డాయి. చొప్పదండి సుధాకర్, దోరవేటి, ఐతాచంద్రయ్య లాంటి వారు ఈ ధోరణిలో కథలు రాశారు. ఈ కథలు బారతీయ సంప్రదాయానికి పట్టం గట్టాయి. దేశభక్తిని పరిచయం చేసే ఇలాంటి కథల్లో నా భూమికి నేనేదో చేయాలనే తపన కనిపిస్తుంది. ననుమాసస్వామి ''గంటీలు'' కథ తల్లి జ్ఞాపకాలు, అమ్మతనం కలిపి సాగుతుంది. నామని సుజనాదేవి ''ప్రేమలేఖలు'' శిల్పరీత్యా ఎన్నదగిన కథ. ఇందులో దూరంగా ఉన్న భార్యాభర్తల మధ్యగల అన్యోన్యత కనపడుతుంది. జీవితం తాలూకు మంచి చెడ్డల ఘర్షణ, కష్టసుఖాల సారాంశం, బోయిన భాస్కర్ రాసిన ''గడ్డిపువ్వు'' కథలో కనపడు తుంది. తాగుబోతు భర్తతో భార్యపడే కష్టాలను వివరిస్తూ మలయశ్రీ రాసిన కథ ''భార్య-భర్త'', రాజీవ కథాసంపుటి ''మనసు మాట'' ఇందులో ఒంటరి స్త్రీల కష్టాలు కడగండ్లు కనపడతాయి. రేగులపాటి కిషన్‌రావు రాసిన ''వెలుగునీడలు'' కథలో రిక్షా కార్మికుడి నిజాయితీ అబ్బురపరుస్తుంది. రేగులపాటి విజయలక్ష్మి రాసిన ''ప్రతీకారం'' కథ వరకట్న సమస్య నేపథ్యంగా సాగుతుంది. వరిగొండ కాంతారావు రాసిన ''ఆలంబన'' కథలో తను కన్నవాళ్ళే తనకు కాకుండా పోయినప్పుడు వేరే వాళ్ళు ఎలా
ఆదుకుంటారో చిత్రించబడింది. వంశీకష్ణ ''రెండుతలల మనిషి'' అనే కథలో మనిషికి, మనిషికి మధ్య గొడవలు రావడానికి కారణమేంటో చూపిస్తాడు. సరోజనీ ప్రేంచంద్ రాసిన ముఖాముఖి, మాంచాల కథల్లో మానవ సంబంధాల విశేషాలను విడమర్చింది. చావు నేపథ్యంలో హనీఫ్ రాసిన ''ఇప్పుడే వస్తాను'' కథలో మనిషి చుట్టూ అతని సంబందీకుల ఆలోచనలు, ఆప్యాయతలు, ఎలా ఉంటాయో కనపడతాయి. అనారోగ్యం బారినపడి, పట్నంలో రోగం బాగు చేయించుకునే స్తోమత లేకపోయిన వ్యక్తి పిల్లల బాధలు ఒక వైపు, చావు తప్పదని తెలిసి పట్నం నుండి నన్ను తీసుకెళ్ళండి, నా
ఊర్లో ప్రశాంతంగా కన్నుమూస్తాను అన్న రోగి మరోవైపు, ప్రేమల సారాంశాన్ని తెలిపే కథ గుడిపల్లి నిరంజన్ రాసిన ''ఊరుమెచ్చిన మనిషి'', చందు తులసి రాసిన ''రంగురెక్కల వర్ణ పిశాచం'' కథ హిందు, ముస్లిం అనే విభజన మత రాజకీయాలు మానవత్వానికి కట్టిన గోరీని చూపించింది. ఎలాంటి అడ్డుగోడలు లేకుండా మనుషులు ఎలా బతకగలరో కూడా ఈ కథ చెబుతుంది. బాల్యస్మతులు, నాయనమ్మ మమకారం, నాన్న కష్టం, అంతా మానవీయ తడితో సాగిన కథ, కాంచనపల్లి రాసిన 'నాన్న-ఒక వర్షం రోజు' కథ. వల్లమాలిన ప్రేమ వల్ల జైలుపాలైన వాడి జీవితం ఎలా గంగపాలైందో నందగిరి ఇందిరాదేవి రాసిన ''గంగన్న'' కథ తెలుపుతుంది. కోడిపుంజును ప్రధాన పాత్రగా జేసి కుటుంబ సంబంధాల పటిష్టతను కోరుకున్న కథ ''గజేంద్రమోక్షము'' శిల్పరీత్యా శిఖరాలకెదిగిన ఈ కథను పొట్లపల్లి రామారావు రాసిండు. విజయార్కె రాసిన ''మనుషులమేనా'' కథలో పేద బిచ్చగత్తె అవస్థచిత్రితమైంది. అన్వర్ రాసిన ''పిచ్చిది'' కథ మానవసంబంధాల్ని ప్రశ్నకు నిలిపింది. మెట్టుమురళీధర్ రాసిన ''సంస్కారం'' కథ, కొడిగడుతున్న మానవ సంబంధాల పట్ల ఆశను చిగురింపజేస్తుంది. ఆత్మహత్య చేసుకున్న పత్తిరైతు కుటుంబం పడ్డ బాధల్ని 'అప్పులమంటలు' కథ ద్వారా ఫర్జాన్ సింగ్ తెలిపిండు. అసమ సమాజంలో మానవ విలువవలు ఎలా ఉంటాయో అంత్యక్రియల నేపథ్యంలో ''పాడెకట్ట'' ద్వారా వడ్డెబోయిన శ్రీనివాస్ తెలిపిండు.
ప్రైవేటీకరణ ఫలితాల్ని అనేక కథలు, జీవితాల ఆధారంగా పట్టి చూపాయి. మేనేజర్, యాజమాన్యం కుమ్మక్కై కార్మికులకు బోనస్ రాకుండా చేయడం, ప్రశ్నించిన కార్మికుడిని చంపడం పులుగు శ్రీనివాస్ ''బోనస్'' కథలో కనపడుతుంది. బతకు దెరువు కోసం సైన్యంలోకి వెళ్ళిన వారి అవస్థలను మంచు కొండల్లోని కార్గిల్ నేపథ్యంలో ''ఆకాశవీధిలో'' అనే కథలో చిర్రరాజు వివరించిండు. పెళ్ళి బట్టలు, నగల షాపింగ్ సందర్భంగా జరిగే తంతులో గల దోపిడీని వివరిస్తూ శివకౌముదీదేవి ''ఐస్'' అనే కథ రాసింది. ఉన్నతంగా విదేశాల్లో స్థిరపడ్డ యువకులు స్వంత ఊరుమీద మమకారం వదలక, ఊరు బాగుకోసం నడుం కట్టడాన్ని సత్యశ్రీ తన ''వందేమాతరం'' కథ ద్వారా చిత్రించిండు. భాగవత స్పూర్తితో ఆధ్యాత్మిక చింతనను ''పలికించెడివాడు'' కథలో కోవెల సుప్రసన్నాచార్య ఒలికించిండు. సంగీత సాధన విశిష్టతను పర్చ అంజనీదేవి ''సంగీత దక్షిణ' కథలో తెలిపింది. నీళ్ళ ప్రాధాన్యతను తెలుపుతూ భండారు ఉమామహేశ్వరరావు రాసిన కథ ''గంగేయమునేచైవ...'' కొండపల్లి నీహారిణి రాసిన ''రాచిప్పు'' కథ పాతతరం జ్ఞాపకాలకు, ఆత్మీయతలకు సజీవ సాక్ష్యాలు. ఉపాధ్యాయ స్నేహితుల మధ్య అభిప్రాయాలు ఎలా ఉంటాయో చూపిన కథ గోపగాని రవిందర్ రాసిన ''నడకముచ్చట్లు''. దేవులపల్లి వాణి రాసిన ''గురువయ్యసారుకానిగిబడి'' కథ మొత్తం బాల్యజ్ఞాపకాల ఆధారంగా సాగింది. ధాశరథి రంగాచార్య ''మర్రిచెట్టు'' అంపశయ్యనవీన్ ''కసి'' కథలు తెలంగాణకథకు కొత్త సొగసులు అద్దాయి. కవితా గోష్టి నేపథ్యంగా చల్లా సరోజినీదేవి ''మనస్విని'' కథ రాస్తే, సూర్యప్రసాదరావు రాసిన ''వాదమే వేదం'' అనే కథ నేటి సాహిత్యలోకపు తీరుతెన్నుల్ని,
ధోరణుల్ని చర్చకు పెట్టింది. అమ్మిన శ్రీనివాసరాజు రాసిన ''వారసులు కావలెను'' అనే కథ ''పెద్దలమాట చద్దిమూట'' అనే సామెతను రుజువు చేస్తుంది.
సుమారు ఐదు దశాబ్దాల రచనానుభవం ఉన్న రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి. దాదాపు 65 నవలలు, వందవరకు కథలు రాసింది. తెలంగాణలో అత్యధిక నవలలు రాసిన ఏకైక రచయిత్రి ఈమె కథల్లో మానవీయత పుష్పిస్తుంది. మానవ సంబంధాల పట్ల ఈమెకు గల ఆర్తి విశేషమైనది. కుటుంబ సంబంధాల పట్ల ఆత్మీయత, బాధ్యతలు ఎలా ఉంటవో ''వరమాల'' అనే కథలో చిత్రించింది. కుటుంబంలోని వ్యక్తుల మధ్య బాధ్యతలు, అనుబంధాలు ఎలాఉంటవో, అలాగే
ఇద్దరు స్త్రీ, పురుషుల మధ్య నడిచే ''ఇష్టం లేదా ప్రేమ'' అనే భావన కూడా రేఖా మాత్రంగా కథలో ఉన్నది. కథ మొత్తం చదివితే ఈ ప్రేమ పర్యవసానం తెలుస్తుంది. అందరు మనుషులే, కాని కొందరు పేదవారుగా, మరి కొందరు కలిగిన వారుగా జీవిస్తుంటరు. అలాంటి వారి మధ్య సాగే సంబంధాలు ఎలా ఉంటవో బొమ్మ హేమాదేవి తన ''బాంచెను దొరసాని'' కథలో చిత్రిక పట్టింది.
ఆదిమకాలం నుండి మనిషి ప్రకతితో పోరాడుతూ రాజీపడుతూ మనుగడ సాగించాడు. తరువాత దశలో సంచార జీవిగా బతికిండు. ఈ క్రమంలో చెట్టుపుట్ట, జంతు-వక్షజాలాలతో సహచర్యం చేసాడు. తనకు హానికరములైన వాటిని నిర్మూలించాడు. ఉపయోగకరములైన వాటిని చేరదీసాడు. అలాంటి వాటిలో పశుపక్ష్యాదులు, జంతు జాలము ఉంది.
మొదటి నుండి మనిషి జంతువులను పెంచిండు. పెంపుడు జంతువులుగా అవి మనిషితో అవినాభావ సంబంధాన్ని పెంచుకున్నవి. అలాంటి పెంపుడు జంతువులకు, మనిషికీ మధ్య ఉన్న సంబంధాలు కూడా మానవీయ మైనవే. ఇలాంటి సంబంధాలను రావుల పుల్లాచారి ఎక్కువగా తన కథల్లో చిత్రించాడు. కోడి, పిల్లి, బర్రె, ఎలుగుబంటి, కోతి లాంటి జంతువులు మానవ జీవితంలో భాగమైన విషయాన్ని ఇతను వివరిస్తాడు. అందకు ఉదాహరణగా ''దబిస్సి'' కథ చెప్పుకోవచ్చు. గొడ్డుకు, మనిషికి మధ్యగల మానవీయ సంబంధం గుండెబోయిన శ్రీనివాస్ రాసిన ''మమకారం'' కథలో కనిపిస్తుంది.
మానవసంబంధాలపై వ్యాఖ్యానాలుగా వచ్చిన కథలే కాకుండా ఆధ్యాత్మిక శోభతో అలరారే కథలు, చారిత్రక నేపథ్యం కలిగిన కథలు, తాత్విక ధోరణి కలిగిన కథలు, సెంటిమెంట్ వ్యాల్యూ ఉన్న కథలు, సైన్స్ ఫిక్షన్ కథలు, అపరాధ పరిశోధక కథలు, అంతరిక్ష కథలు,
పిల్లల కథలు, అనేక సింగిల్ కాన్సెప్ట్ కథలు (ఉదా: యుద్ధం కథలు, జైలు కథలు) పాలనా సంబంధకథలు ఇలా జీవితపు ప్రతికోణాన్ని స్పశిస్తూ ఇక్కడ కథలు వచ్చాయి. ఇలాంటి కథలు మానవుల్లోని జీవకారుణ్య గుణాన్ని పట్టి చూపుతవి. ఇవి మానవ సంబంధాల పరిపుష్టికి దోహదపడుతవి. ఇలా తెలంగాణ కథ అన్ని దిశల్లో అన్ని కోణాల్లో తన ఉనికిని ప్రదర్శిస్తుంది.
డా|| బి.వి.ఎస్. స్వామి,
9247817732