Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాత్రి లేదు పగలు లేదు
నడిచే మరలకు సొలుపు లేదు
చిందే చెమటకు అలుపు రాదు
బతుకు వాకిట వెలుగు లేదు
గంజి దొరకని రోజులెన్నో
కునుకు తియ్యని రాత్రులెన్నో
చలిలొ వానలొ మండుటెండలొ
దేహ బాధల గాథలెన్నో
మురికి వాడల నరక కూపాల్
యజమానుల ముష్టి ఘాతాల్
ఆడ బిడ్డల మాన ప్రాణాల్
పసికందుల ఆర్తనాదాల్
కష్టమొకడిది సోకులొకరివి
కన్నీరొకడిది పన్నీరొకడికి
పరుల కష్టం దోచి దాచి
పెద్దలయ్యిరి గద్దలయ్యిరి
నింగికెగిసిన మేడలు
ఆ పక్కనే వెలివాడలు
ఇవే కదా పారిశ్రామిక యుగపు
ఘన కీర్తి జాడలు
కష్టాల్ నష్టాల్
పొంగి పొర్లిన దుఃఖాల్
అనంత బాధల అంతానికి
కావాలోరు నిర్దిష్ట పని దినాల్
ఆలోచన రగిలింది
ఆవేశంగా మారింది
కార్మికులను ఒకటిగ చేసి
హే మార్కెట్లో కదిలింది
విదిలించె కొరడాల్
ఘర్జించే తూటాల్
వేటాడగ కార్మికుల దేహాల్
కరకుగా సాగె యాజమాన్య సైన్యాల్
గుండె గదిలో దూరిన తూటా
అగ్గినే రాజేసే
నెత్తురోడిన దేహ వస్త్రం
ఎర్ర జెండై నింగికెగిసె
పనిగంటల సాధనా సమరం
మే డే గా చరితకెక్కే
ఎనిమిది గంటల పని దినమ్మును
ఖాయపరచి వినుతికెక్కే
కార్మికోద్యమ కదన జ్వాల
కమ్యునిజముగ రూపు దాల్చే
సుత్తె కొడవలి నొకటి జేసీ
జగతినంతా చుట్టు ముట్టే
- వి.ఆర్. తూములూరి