Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పోరాడితే పోయేదేం లేదు...బానిస సంకెళ్లు తప్ప
ప్రపంచ కార్మికులారా ఏకం కండి...మీరొక ప్రపంచాన్ని సాధించుకోవాలి''
ఈ నాలుగు మాటలు ప్రపంచాన్ని కుదిపేసిన రణన్నినాదాలు. వీటి వెనక అద్భుతమైన శక్తి ఉంది. ఇదొక సిద్ధాంతంగా రూపొంది ప్రపంచ చరిత్రని, దాని గతిని సమూలంగా మార్చేసింది.
మహాకవి శ్రీశ్రీ చెప్పినట్లు 'గనిలో... వనిలో... కారా?నాలో...' పనిచేసే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికులందర్నీ ఒక్కతాటిపై నిలిపిన మాటలివి. 1848లో కమ్యూనిస్టు మ్యానిఫెస్టోలో మార్క్స్-ఏంగిల్స్ చెప్పిన ఈ నాలుగు మాటలు, మనుషులందరూ సమానంగా గౌరవప్రదంగా బతికేందుకు, అందుకనుగుణంగా ఒక నూతన ప్రపంచాన్ని నిర్మించుకునేందుకు కార్మిక వీరుల చేతిలో ఆయుధాలుగా మారాయి.
ప్రపంచ గతిని మార్చిన సంఘటనలతో పాటు సిద్ధాంతాలనూ గుర్తుంచుకోవాల్సిందే. ఉత్పత్తి ప్రక్రియలో కష్టం మరింత కష్టాన్ని తెచ్చిపెడితే, చేతులు ఇంకా హక్కులను ఒడిసిపట్టుకోలేక కాయ కడుతుంటే, ఏంచేయాలో దిక్కుతోచని స్థితిలో కార్మికులను ఆదుకున్న ఆపన్నహస్తం అక్షరమే. వాళ్లకు ఏం చేయాలో, ఎందుకు చేయాలో చెప్పింది సాహిత్యమే.
''మహితాత్ముడు
కార్మికుడేజి
నక్షత్రజి
కిరీటధారి'' అని శివసాగర్ అంటే..
''శ్రమైక జీవన సౌందర్యానికి
సమానమైనది లేనేలేదు'' అని శ్రీ శ్రీ అంటాడు.
శ్రామిక కవిత్వం అనగానే, వీరి కవిత్వమే కళ్ళకు కనబడుతుంది. వీరి కవిత్వమే చెవుల్లో వినబడుతుంది. అభ్యుదయ కవులు శ్రామిక జీవనాన్ని ప్రతిబింబించే కవిత్వాన్ని, అభ్యుదయ కవిత్వాన్ని మన జీవనలోకంలోకి ఒలికించారు.
వియత్నాం నాయకుడు హౌ-చి-మిన్ ''అడవిలో వెన్నెలకు స్పందించి, నిన్ను గురించి నేను కవిత్వం రాయలేను.../ నాకు చాల పనులున్నాయి.../ కవిత్వం కన్నా నా ప్రజల విముక్తే ముఖ్యం...'' అంటాడు. కానీ మన ప్రభుత్వాలకు ప్రజల ఇతిభాదల కంటే వారి స్వప్రయోజనాలే ముఖ్యం. అందులో భాగంగానే కార్మికుల హక్కులను కాలరాసే చట్టాలను తీసుకువస్తున్నారు. మరోవైపు కర్షకుల కష్టాన్ని మింగడాని పరాన్న బుక్కులా ఎదురుచూస్తున్నారు.
అవును ఇలాంటి అనేక సమస్యలు సమాజాన్ని చుట్టుముట్టాయి. అవి సమాజానికి ఊపిరాడకుండా చేస్తున్నాయి. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అయిందని అమతోవ్సవాలు చేస్తున్నారు. ఒకవైపు దేశానికి వెన్నుముక అయిన రైతులు దేశరాజధాని నడిబొడ్డున ఆరు మాసాలుగా తమ హక్కుల కోసంలో ఉద్యమిస్తున్నారు. మరోవైపు భద్రత లేని బందీలుగా మారిన ప్రజారాజ్యంలో మనం ఉన్నాం. కరోనా విపత్కర పరిస్థితిలో ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసి ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు మన పాలకులు.
నాటి చికాగో పోరాటం నుండి నేటి వరకు కార్మికులు, కర్షకులు ఎర్రజెండా నీడలో తమ ముల్గులు పీల్చే దోపిడీదారుల దురాగతాలపై అనేక రూపాల్లో పోరాడుతూనే ఉన్నారు. అలాంటి పోరాటాలకు అన్ని వర్గాలతో పాటు కవులు, రచయితలు కూడా తమ రచనల ద్వారా కార్మిక, కర్షకులకు తమ బాసటగా నిలిచారు. ఇలాంటి తరుణంలో ఆకలి గురించి, అన్యాయం గురించిన కవిత్వమే వస్తుంది. పారిస్ కమ్యూన్ పతనాతరం యాజినీ పాటిల్ రాసిన బాలంత్రపు నళినీ కాంతారావు తెలుగు అనువాదం చేసిన అంతర్జాతీయ గీతం '' ఆకలి మంటలు మలమలమాడే /అనాధలం దరూ లేవండోయో'' లో దోపిడీ వర్గం కష్టజీవుల శ్రమ ఫలితాన్ని చేజిక్కిచుకుంటున్న వైనాన్ని కళ్ళకు కట్టినట్టు చూపుతుంది. ఇన్ని ఏండ్లు గడిచినా అదే వ్యవస్థ సమాజంలో ఉంది. వాటికి ప్రభుత్వాలు వంతపాడు తున్నాయి. మతం మాత్రమే రాజ్యమేలుతున్న సందర్భం ఇది. కులానికి, మతానికి ఉన్న ప్రాముఖ్యత మనిషికి లేకుండా పోయింది. మతం మూఢత్వంలో ఎలాంటి దారుణాని కైనా దిగజారు తున్న తరుణమిది. ప్రశ్నలు లేవనెత్తకుండా దౌర్జన్యం రాజ్యం ఏలుతుంది. ఇట్లాంటి సమయంలో మనిషిని, మనిషిలోని శ్రమను గుర్తించే కవిత్వం రావడం గొప్ప విషయం.
తెలంగాణ సాహితి మే డే సందర్భంగా శ్రామిక కవిత్వంతో సంకలనంగా తీసుకుని వచ్చింది.
''రైతుల, ఉద్యోగుల గుండెల జెండాలతో
వీధులు ఎరుపుగా ప్రవహించాయి''. 'గుండె జెండా' అనే కవితలో ఒబ్బిని అన్న మాటలలో మహరాష్ట్ర రైతు చిందించిన రక్తం కనబడుతుంది.
''విశ్రమించని అలసటను
స్వేద జలంతో కడిగేసుకుం టున్నారు వాళ్ళు'' శ్రమకు చిరునామా స్వేదమే అయినా ఆశాజీవులుగానే జీవనాన్ని గడిపేస్తారు అంటారు పొత్తూరి సుబ్బారావు.
శ్రామిక కవిత్వం అనగానే గనిలో, కారా?నాలో, ఆయిల్‌తో బొగ్గు పూసుకొని మసిబారిన దేహాలే కాదు. రోజూ ఇంట్లో స్త్రీ గహిణిగా చేసే పనిని శ్రమ కింద భావించలేని భావజాలానికి సంబంధించిన ప్రశ్న నస్రీన్ ఖాన్ ''అమ్మీవ జయతే'' కవిత.
''వ్యవస్థ మింగేసిన అర్ధ చంద్రుడిలా...'' అన్నారు కళా గోపాల్. శ్రమకు లాల్ సలామ్ చేసిన గొట్టిపర్తి యాదగిరిరావు, అనేక సందర్భాలలో శ్రమ ఎవరి చేతులలో చిక్కుకుంటుందో చూపిన సలీమా, పొగబారిన జీవితాలను తాకిన సర్ఫరాజ్ అన్వర్ కవిత్వం ఆలోచింప జేస్తున్నాయి.
కథలు, నవలలు
ఒక్కో చెమటచుక్కదీ ఒక్కో కథ. ఆ కథలూ, వ్యథలూ లోకానికి తెలియాలంటే సాహిత్యం చెయ్యం దించాలి. 'ప్రపంచ శ్రామికులారా ఏకంకండి' అన్న నినాదం నిజం కావడానికీ, ఒక ప్రగతిశీల మార్పునకూ సాహిత్యం తోడు కావాలి. కథలు సమస్యలను చూపిస్తే, నవలలు వాటిని చర్చించి, విశ్లేషించి, కార్యోన్ముఖుల్ని చేస్తాయి.
గొంతెత్తడం ఇంకా నేర్చుకోని పసి ప్రాయపు శ్రామికలోకం 'అమ్మ' నవలతో పిడికిలి బిగించడం నేర్చుకుంది, పోరాడటం తెలుసుకుంది. సోషలిస్టు సాహిత్య మౌలిక లక్షణం ఉత్ప్రేరకంగా నిలవడమే. ఆ పని అక్షరాలా చేశాయి ఇలాంటి కొన్ని నవలలు. సామ్యవాద భావజాలంలోంచి, మార్క్సిస్టు దక్పథంతో చూసి కార్మిక, కర్షకుల ఈతిబాధలను ప్రపంచానికి చూపెట్టిన నవలలు ప్రపంచ సాహిత్యంలో కోకొల్లలు. కానీ మన తెలుగు సాహిత్యంలో వాటి సంఖ్య వేళ్లమీద లెక్కపెట్టేంత మాత్రమే.
ప్రపంచీకరణ, పారిశ్రామికీకరణలతో నిరుపేద కార్మికులు మరింత పెరిగారు. పెట్టుబడిదారీ వ్యవస్థ దెబ్బకు శ్రమైక జీవనంలో సౌందర్యం కరవై కాయకష్టం మాత్రమే మిగిలింది. తాము అన్యాయానికి గురవుతున్నా తెలుసుకోలేని పరిస్థితి. తెలిసినా తమ హక్కుల గురించి నిలదీసి అడగటం ఎలాగో, శ్రామికుడే దేశాభివద్ధికి మూలం అని గొంతెత్తడం ఎలాగో తెలియని కష్టజీవికి దొరికిన దిక్సూచీ ఈ శ్రామిక వర్గ సాహిత్యం. ఇందులో నవలది ప్రముఖ స్థానం.
రాసినవాళ్లు కొంతమందే అయితే అవి పూర్తిగా మార్క్సిస్టు మూలసూత్రాలకు కట్టుబడి లేవు. కారణం కాల్పనిక సాహిత్యంలో కథని ఆసక్తిదాయకంగా సన్నివేశ కల్పనతో చెప్పాల్సిరావడం. అందువల్ల ఇవి కథ, కథన పద్దతులకు అనుగుణంగా కేవలం సిద్ధాంత అవగాహన కల్పించేందుకు మాత్రమే అన్నట్లుగా
సాగుతాయి. తెలుగులో వట్టికోట ఆళ్వారుస్వామి నవల 'ప్రజలమనిషి' ఆనాటి రైతాంగ సమస్యలని చర్చించిందే. అందులో కంఠీరవం పాత్ర ఉద్యమానికి బయల్దేరడం హక్కుల పోరాటంలో ముందడుగేయమని సూచించడమే. భూస్వాములు రైతులను దోచుకోవడం అనే అంశాన్ని ఈ నవల ప్రశ్నిస్తుంది. కేశవరెడ్డి 'రాముడున్నాడు - రాజ్యముండాది' ఉద్బోధ చేసేదీ ఇదే. అల్లం రాజయ్య జమీందారీ వ్యవస్థనీ, దొర పీడననీ కళ్లకు కట్టేవి 'కొలిమంటుకుంది, ఊరు' నవలలు.
ఇక పి.చంద్ యాదగిరి సింగరేణిలో గుమాస్తాగా పనిచేశారు. అక్కడి జీవితాలను కళ్లారా చూశారు. ఆ అనుభవంతో ఏడు నవలలు రాశారు. వాటిలో 'బొగ్గులు, భూదేవి, శ్రామిక యోధుడు' లాంటి వాటిలో అక్కడి శ్రామిక జీవితాల్ని ప్రభావవంతంగా అక్షర బద్ధం చేశారు. శ్రామికుల భాషనూ, మాండలికాన్నీ రాయడం నవలకు ఎప్పుడైనా ఆయువుపట్టు అవుతుంది. ఈ రచయిత అదే చేశారు.
నా రీమణుల శ్రమల వెనక...
కార్మికులంటే పురుషులే కాదు, స్త్రీలు కూడా. కానీ, ఇక్కడ ఇద్దరినీ ఒకే గాటన కట్టడానికి లేదు. ఎవరి సమస్యలు వారివి. ఎవరి హక్కులు వారివి. వేతనం విషయంలో స్త్రీలకు పురుషులకంటే తక్కువ ముట్టడం శ్రమదోపిడీలో భాగమే. మహిళలు పనిలోనే కాక, ఇంటికొచ్చాక కూడా అందరికీ చేసిపెట్టడం సామాజిక కోణంలో అన్యాయమే. పనుల్లో ఆడపనీ, మగపనీ విభజనల్లేవు, అన్నీ అందరూ చేయదగినవేనన్న స్పహ కలిగించే నవల 'జానకి విముక్తి'. సామాజిక జీవనంలోని అనేక పార్శ్వాలను ఇందులో చర్చిస్తారు రచయిత్రి రంగనాయకమ్మ. సాహిత్యానికి సామాజిక ప్రయోజనం ఉండాలన్న కొడవటిగంటి కుటుంబరావు మార్క్సిస్టు సామాజిక దక్పథాన్ని స్వీకరించి అదే రీతిలో రచనలు చేశారు. ఆయన 'ప్రేమించిన మనిషి' నవల అందుకు ఉదాహరణ. ఆయనే రాసిన 'కార్మిక
విజయం' శ్రామికుల సమస్యల ఇతివత్తంగానే సాగుతుంది. కార్మిక హక్కులు హరించబడుతున్న, కర్షకుల కష్టం దోచుకుంటున్న ఈ సమయంలో మరోసారి ఇలాంటి రచనలు రావాల్సిన అవసరం ఏంతైనా ఉంది.
సినిమాలో శ్రామికుల పాటలు
''అన్యాయం అక్రమాలు దోపిడీలు దురంతాలు, ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని నిలదీసినదిరోజు అనగారిన శ్రమ శక్తిని ఆవేశం ఊపరిగా కదిలించినదిరోజు నేడే మేడే'' అనే ఎర్రమల్లెలు సినామాలోని అదృష్ణ దీపక్ రాసిన పాట కార్మికులను ఉత్తేజ పరుసుంది. ఇలా సినిమాలలోనూ, శామ్రిక, సాహిత్య గీతాలు వెలువడ్డాయి.
- అనంతోజు మోహన్ కష్ణ, 8897765417