Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చూపుడు వేళ్ల సంతకాలు చేస్తేనే..
కాలచక్ర యంత్రాలు తిరిగేవి !
చెమట చుక్కల నదులు పొంగితేనే..
ముడి సరుకుల చక్రాలు కదిలేవి !
శ్రామిక కార్మిక కర్షక అడుగులు వేస్తేనే..
కాలగమన సోపానాలు నిద్రలేచేవి !
దేహపు కండరాలు కరిగిస్తేనే..
ప్రపంచ చక్రాలు ముందుకు నడిచేవి !
జీవన సౌరభాల విత్తనాలను మొరకెత్తిస్తేనే..
బతుకు పోరాటల ఆటలు గెలిచేవి.!
కార్మిక ఆశయాల్ని తాకట్టుపెట్టి
మానవత్వంలేని విలువలను మూటకట్టి
నడుస్తున్న ఒంటెద్దు పోకడలపై
చెదలు పట్టిన చీడపురుగుల్నీ
నాశనం చేసే విప్లవాగ్నిని రగిల్చే
ఆత్మవిశ్వాసపు దివిటీలు
తూర్పున సింధూరం తిలకం దిద్దిన
పడమటిన సంధ్యారాగం పాడిన
గొంతునుండి రుధిర భాష్పాలు రాలిపడిన
గనులు కొలనులో బురద చల్లిన
రేపటి సూర్యతేజ కిరణమై
నిండు వెలుగులను ప్రసాదించే
గొప్ప హదయంగల ధిక్కార స్వరాలు
నేటి 'మే'టి కార్మిక సూర్యులు
- పగిడిపల్లి సురేందర్ పూసల
80748 46063