Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హదయమున్న ప్రతిచోటా
ప్రేమ పరిమళిస్తుంది.
ద్వేషంతోనే పేచి
అది బహురూపి
సర్వవ్యాపి.
అయితే ఒకటి
ద్వేషం వల్లనే
ప్రేమ విలువ తెలుస్తుంది.
చిక్కని చీకట్లో
మిణుగురు వెలిగినట్లు.
వేదాంతం వద్దు
జీవితం చిన్నదే కావచ్చు
కాని అది ప్రేమ కారణంగానే
సంపన్నమౌతుంది
సంపూర్ణతకు చేరుతుంది.
రాజకీయానికి ప్రేమ అర్థం కాదు
విభాజిత స్వరాలకు
అది పాదు.
సందేహం లేదు
ద్వేషం వైరసే!
పుట్టిన చోటును పాడుచేస్తుంది.
ప్రేమ అట్లా కాదు
ఆక్సిజనై ప్రాణం పోస్తుంది.
గమనించండి!
ప్రేమ గోబి పువ్వులా
తాజాగా ఎలా నవ్వుతుందో!
చూస్తే కంటికి రుచి
తింటే నోటికి రుచి.
తలుపులు మూసుకొని
కవిత్వం రాస్తే ఎట్లా!
వాకిట్లోకి వచ్చి చూడు
ప్రేమ ఎంత విశాలమో తెలుస్తుంది.
- డా|| ఎన్.గోపి