Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాశం ఎర్రజెండా ఎగరేస్తూ
నల్లదుప్పటి కప్పుకునేలోపు
ఎన్నెన్నో అందాలు ఎగిరిపోతాయి!
పచ్చదనం తపస్సులో ఉండగా
నిశ్శబ్దం నాట్యం చేస్తుంది,
గూడు చేరుతున్న పక్షుల వరుసలో
రెక్కల సవ్వడుల మధ్య
అనుభవాల ముచ్చట్లు వినబడుతాయి!
చెమటచుక్కలు చల్లబడుతుంటే
శ్రమజీవుల పాదాల ఆచ్ఛాదనలో
నేలతల్లి పులకించిపోతుంది,
మేఘాల మధ్య వెలుగు తగ్గుతూ
వినయంగా వందనం చేస్తుంది!
లోలోపలి మనసు
గాలి అలలపై విశాలమౌతుంది,
గోడల మధ్య ఊపిరి బిగబట్టిన ప్రాణం
అందని స్వేచ్ఛలో ఊయలూగుతుంది!
ప్రకతికి దగ్గరౌతున్న ప్రతిసారీ
మనలోని మరోమనిషి పసివాడై
సంబరంతో అడుగులేస్తాడు,
కొత్తమనిషై మరింత మెరుపౌతాడు!
- పుట్టి గిరిధర్, 9491493170