Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గాజు రెక్కల తూనీగ' అనేది ఒక అమూర్త భావన. కానీ కవి తన చిన్ననాటి రోజులను గుర్తుకు తెచ్చుకొని, ఈ శీర్షిక పెట్టారు. సిక్కోలు ప్రాంతంలో నీలి నీలి రంగుల లేబ్రాయపు తూనీగలను పాలతూరీగలు అంటారు. పిల్లలకు వాటితో ఆడుకునే అనుభవాలు ఉంటాయి. ఆ అనుభూతులను గుర్తుకు తెచ్చుకున్న కవి, తన కవితా సంపుటికి వినూత్నంగా 'గాజు రెక్కల తూనీగ' అనే నామకరణం చేసారనవచ్చు.
''ధర్మయుద్ధంలో ఆహుతి అయ్యే అనేక జీవుల అరుపుల చప్పుడు కవిత్వం'' అని ప్రముఖ నాటక రచయిత శ్రీ 'బెల్లంకొండ రామదాసు' అంటారు. ఈ కోవలోనే ప్రజాజీవన పోరాటంలో నిత్యమూ జనం ఎదుర్కొంటున్న సమస్యలను, వేధింపులను, పీడనలను సామాజిక దక్కోణంలో చూస్తూ, తనదైన శైలిలో అక్షరీకరణ చేస్తున్న కవన కార్మికులు సాంబమూర్తి లండ గారు. ఇటీవల తన సాహితీ అమ్ములపొది నుండి 'గాజు రెక్కల తూనీగ' అనే కవితా శరాలను పాఠక లోకంపై ప్రయోగించడం జరిగింది. ఆ శరాలు నిండా సామాజిక చేతనయే నిండి ఉంది. అవి జన హదయాలను లోతుగా తాకుతూ, అణగారిన మరియు అభాగ్య జనాల పురోగతికై పాటుపడేలా చేస్తున్నాయి. ఈ కవితా సంపుటిలో ఒక్కొక కవిత ఒక్కొక్క జీవన సమరాన్ని తెరపై చూపిస్తాయి. ఆయా జీవన సమరాలను మెరుపు తీగలాంటి మాటలతో మన ముందుంచారు కవి. 'మాటల వంతెనొకటి నిర్మించుకుందాం' అన్న కవితలో శత్రుత్వం మనిషికి శాపంగా భావిస్తాడు కవి. 'ఒకరి వెనుక వేరొకరు చేరి/ గోతులు తవ్వుకుని నవ్వుకోవడం/ ఒకరి బలహీనతల మీద/మరొకరు సింహాసనం వేసుక్కూర్చోవడం/ ఎన్నాళ్ళిలా నాటకాన్ని రక్తి కట్టిస్తాం?/ హదయ వేదిక మీద ఎదురెదురుగా/ కూర్చొని చర్చించుకుందాం రా!' అన్నీ పక్కనబెట్టి మరచిపోయి, మనుషుల మధ్య మాటల వంతెనొకటి నిర్మించుకొని, దోబూచు లాడుతున్న మౌనాన్ని, నిశ్శబ్దాన్ని స్వస్తి పలకాలని కవి అభిలషిస్తాడు.
'సంక్రాంతి రావాలి' అన్న కవితలో కవి ఒకప్పటి సంక్రాంతి శోభ పల్లెల్లో కనిపించక పోవడం పట్ల ఆందోళన చెందుతాడు. పండుగ తన ప్రత్యేకతను కోల్పోవడాన్ని గూర్చి ఆలోచన చేస్తాడు. ప్రపంచీకరణలో భాగంగా మన సంప్రదాయాలు, ఆచారాలు మంటగలవడాన్ని చూసి ఆక్రోశిస్తాడు. పాశ్చాత్య ధోరణులకు అలవాటు పడిన జనం వివిధ పండుగల పట్ల అనాసక్తితో ఉండడం విధ్వంసంగా భావిస్తాడు. 'కంపా కర్రా తెచ్చి నెగళ్ళెన్ని వెలిగించినా/ రంగుకొకరుగా విడిపోయిన పల్లెల్లో/ భోగి మంటల వెలుగుల్లేవు/కత్రిమ రంగులేరుకొచ్చి/ వాకిళ్ళలో ఎంతలా కుమ్మరించినా/ సంక్రాంతి లక్ష్మి నవ్వుతున్న దాఖలాల్లేవు'
కొంతమంది కవులు ఎడతెరిపి లేకుండా విరగబూయిస్తున్న కవిత్వాన్ని, మేధావులుగా చలామణి అవుతున్న కొంతమంది వ్యక్తుల ఆలోచనల్ని ఎండగడతాడు 'అక్షర నక్షత్రమై వెలిగిపోతాను' అన్న కవితలో కవి. 'వీధిబాలల ఆర్తనాదాలను ఆర్తిగా పలికించని/ పాటొక పాటేనా అని ఎద్దేవా చేసింది/ పసిమొగ్గలపై కర్కశత్వాన్ని తూర్పారబట్టని/ కవిత్వం కవిత్వమేనా అని నిలదీసింది/ సైనికుడి దేహంపై అక్షరపుష్పాలై రాలని/ పదాలు పదాలేనా అని అపహాస్యం చేసింది/ కవితలోని ప్రతిఫంక్తి సత్యశోధన కాని/ కవనం కవనమేనా అని నిప్పులు చెరిగింది'.
నా కవిత్వం నిత్యమూ ప్రజాపక్షంగానే నిలుస్తుందని కవితా లోకానికి వినమ్రంగా భరోసా ఇస్తాడు. 'సమయం లేదు' లో కవి తన జీవితపు అనుభవాలని స్పశిస్తాడు. తన చిన్ననాటి రోజులను గుర్తు తెచ్చుకొని ఇలా అంటాడు. 'నక్షత్రాల కళ్ళలోకి తనివితీరా చూసే/ సమయం లేదు/ చెరువు అరుగుమీద కునుకుతీస్తున్న/ చందమామను చేతులతో కదిపి/ నీళ్లన్నీ నిమ్మళించే దాకా/ గట్టున నిల్చొనిచూసే సమయం లేదు' కార్పొరేట్ వస్తువుల మోజులో పడి, నేడు తీరికలేని సమయాలను గడుపుతున్న జనాలను చూసి చురకలం టిస్తాడు కవి. 'విశాల మైదాన మొకటి నా భుజంతట్టి చెప్పింది/ ఏదైనా చేసి నేనింకా బ్రతికే ఉన్నానని ప్రపంచానికి తెలిసేలా/ స్వీయ ప్రకటనొకటి వేయించుకోవాలి' అని 'నేను తప్పిపోయాను' అన్న కవితలో కవి తన అస్తిత్వాన్ని ప్రశ్నించుకోమంటాడు.
'కన్నీటి చుక్కలో' ఇలా ఎత్తి పొడుస్తాడు కవి. 'ఇక్కడ ఎవ్వరికీ/ నీ కోసం ఏడ్చే సమయం లేదు/ నీ గోడు వినే తీరికలేదు/ కవచమంతా కేంద్రంలోకి/ కుచించుకుపోయిన సమూహమిది/ 'నేను' తప్ప 'మనం' అనే స్పహ లేని నవనాగరిక నగరమిది/ ఇక్కడ ఎవడి తలకొరివి వాడే పెట్టుకోవాలి/ ఎవడి శ్రాద్ధం వాడే వడ్డించుకోవాలి/ ఎవడి తద్దినం వాడే జరుపుకోవాలి/ ఇది మర మనుషులున్న మహారణ్యం/ అంతరాత్మరహిత జనారణ్యం' నేటి సమాజంలో జీవిస్తున్న జనం ఆలోచన ఎంతసేపూ 'నేనూ-నాది' అనే మాట తప్ప, 'మనం' అనే విశ్వమానవ భావన లేకపోవడం తరచూ చూస్తున్నాం. 'అందరమూ ఉంటేనే కదా-మనమూ ఉండేది' అనే కనీస జ్ఞానం కొరవడిన రీతిలో ప్రజా సమూహాలు ప్రవర్తించడం దారుణంగా భావిస్తాడు కవి.
'అంతంలేని వేదన' లో కవి ఉద్దానం బిడ్డగా, తన ప్రాంత ప్రజల ఆరోగ్య స్థితిగతులను దగ్గరగా చూసిన వ్యక్తిగా ఆర్ద్రంగా పరామర్శిస్తారు. తన తల్లి కూడా ఈ వ్యాధికి గురై మత్యువుతో పోరాడ్డాన్ని గుర్తుకు తెచ్చుకుంటాడు. సిక్కోలులో ఉద్దానం ఒక అందమైన ప్రాంతం. సుందరమైన సాగర తీరం గల ఈ ప్రాంతంలో హెచ్చుశాతం ప్రజలు కిడ్నీ వ్యాధి బాధితులై జీవనాన్ని నెట్టుకురావడం చూస్తుంటాం. 'ప్రతి ఊళ్ళో కిడ్నీ వ్యాధుల మరణమదంగం/ వారానికొకమారైనా మోగు తూనే ఉంటుంది/ ఎప్పుడొస్తుందో, ఎలా వస్తుందో తెలీదు/ నిశ్శబ్దంగా బతుకును కాటేసి వెళ్ళిపోతుంది' ప్రతి నిత్యం ఉద్దానం ప్రతి గడపలోనూ కన్నీటి కాలువలు సాగుతుంటాయి. ప్రతి ఊళ్ళోని దుఃఖపు నది పొంగి పొర్లుతోంది. ప్రతిరోజు తీరం వెంబడి కాకులు పిండాలను ఆరగిస్తుంటాయి. ఈ హదయ విదారక సంఘటనల సమాహారమే ఉద్దానం ప్రజల జీవిత చరిత్ర. ఇంకా కవి ఇలా ప్రశ్నిస్తాడు. 'కష్టాన్ని నమ్ముకున్న పల్లె జనాలకు/ ఇంత కష్టమెందుకో వైద్యశాస్త్రం గుట్టువిప్పదు' ప్రతీ నాయకుడు ఈ ప్రాంతాన్ని సందర్శించడం, ఉద్దానం కిడ్నీ వ్యాధులు గురించి మాట్లాడడం ఓట్లు దండుకోవడంలో భాగమే అయింది. 'నీ పేజీ నీకుంటుందా?' అని కవి నిర్మొహమాటంగా ప్రశ్నిస్తాడు ఈ కవితలో. 'అక్షరాలన్నీ తమకు నచ్చినట్లుగా ఉండాలన్న/ వాదమిప్పుడు బలం పుంజుకుంది/ చారిత్రక పుటలన్నీ తళతళా మెరవాలన్న/ ఆదేశం ఒకటి వెలువడింది /నిజాల్ని కరివేపాకుల్లా తీసి పారేసి/ వాదాల్ని వాస్తవాలుగా ముద్రిస్తున్నారు/ కొత్తగా కొందరికి దేశభక్తుల హౌదానిచ్చి/ వారి కోసం కొన్ని పుటల్ని కేటాయిస్తున్నారు' దేశభక్తి, జాతీయవాదం గూర్చి నేడు మరల మాట్లాడుతున్నారు కొందరు. గతంలో అవేవీ తెలియకుండానే, ఈ స్వతంత్ర భారతావనిలో అనేక ఉద్యమాలు జరిగాయా? మరలా దేనికి ఈ శుష్కవాదాలు వైపు పరిగెట్టడం? దేశభక్తులు వీరు అని, వీరు కాదని చెప్పడం దేనికి సంకేతం? ఇప్పుడా అవసరం ఏమొచ్చింది? కుహనా దేశభక్తుల కోసం నిత్యమూ కవిత్వం రాస్తూ, వారి కోసం కొన్ని పేజీలు కేటాయిస్తూ పోయే, మేధావుల అంతరంగాలకు అడ్డుకట్ట వేసేది ఎవరు? కానీ, కొందరు తమ విశేష సాహితీ సేద్యం ద్వారా నిజమైన దేశభక్తులను మరియు వారి త్యాగాలను భావితరాలకు చేర్చే కషిని అభినందిద్దాం. విభిన్న శైలిలో ఉత్కష్ట సామాజిక కవిత్వాన్ని సష్టిస్తున్న ఉత్తరాంధ్ర వర్ధమాన కవి సాంబమూర్తి లండ గారికి అభినందనలు.
- పిల్లా తిరుపతిరావు
7095184846