Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కెకెఆర్ అనబడే కోవెల కందాళై రంగనాథాచార్యుల పేరు సంప్రదాయాన్ని స్పురింపచేస్తుంది గాని దాంతో ఆయన తీరుకు పొంతన కుదరదు. ఎందుకంటే ఆయన అక్షరాలా ఆధునిక దక్పథానికి ప్రతిరూపమనదగిన మేధావి. నిబద్ధత, నిరాడంబరత్వం, నిమ్మళమైన నిక్కచ్చితనం వీటన్నిటినీ మించిన నిర్దుష్టత నిపుణత ఆయన స్వంతం.
విమర్శకుడు అనడం కంటే ఆయనను సవిమర్శనుడు అనడం మెరుగు. విమర్శనగా దర్శించడం సూటిగా సున్నితంగా విశ్లేషించడం, కొద్ది మాటలతో వివరించడం ఆయన పద్ధతి. పటాటోపం కన్నా పదార్థానికి ప్రాధాన్యత నిచ్చే తత్వం. ఉద్వేగ ఉద్ఘాటనలు, ఉపదేశోపన్యాసాల కన్నా ఉపమానాలు ఉమ్మడి భావనల తరహాలో బోధించడం ఆయన స్వభావం. శక్తివంతులైన చాలా మంది శిష్యులు రాజకీయ ప్రచార రంగాలలో వున్నా కీర్తి కాంక్షకు దూరంగా మసలిన పండితుడు. తను చెప్పవలసిన అవసరం వుందనుకున్నది చెప్పవలసినంత వరకే చెబుతూ అందుకోసం అవసరానికి రెండింతలు అధ్యయనం చేస్తూ అర్థవంతమైన సార్థక జీవితం గడిపిన సాహిత్య జీవి. భాషావేత్త. సామాజిక భావుకుడు. సామయిక పరిశోధకుడు. అందుకే తెలుగు నాట విద్వత్ లోకంలో ఆయనది ఒక విలక్షణ బాణి. విభిన్నశ్రేణి.
హైదరాబాదులో ఆంధ్ర (ఇప్పుడు తెలంగాణ) సారస్వత పరిషత్ కళాశాల ప్రిన్సిపాల్‌గా కెకెఆర్ ఎందరో ప్రతిభా వంతులను ప్రభావితం చేయడమే కాదు. చర్చా పద్ధతిలో ఆధునిక తెలుగు సాహిత్య గమనాన్ని గమనించేందుకు వేదికలు సష్టించారు. దశాబ్దకాలం పాటు క్రమబద్ధంగా సాహిత్య గోష్టులు జరిపారంటే ఎంత క్రమశిక్షణ మరెంత దీక్ష కావాలి. ప్రాచీన సాహిత్యం నుంచి ఆధునిక సాహిత్యం వరకూ, అరసం విరసం దశలు దాటిన తర్వాతి పరిస్థితిని సమగ్రంగా సమిష్టిగా చర్చకు పెట్టి సంపుటీకరించారు. ఆ దశలన్నిటికీ నామకరణం చేయడమే గాక జనరంజక సాహిత్యం అనే విభాగం కూడా చర్చకు పెట్టడంలో ఆయన వాస్తవికత కనిపిస్తుంది. అలాగే ధోరణి అన్న దాన్ని నిర్వచించి విభిన్న ధోరణులు అనే చర్చ కూడా చేశారు. ఆధునికతకే పరిమితం కాకుండా వీరికి పితామహుల వంటివారైన వేమన, వీరబ్రహ్మం ఇత్యాదులకు తొలి సమాజ కవులు అని పేరు పెట్టి వారి వారసత్వాన్ని వీరసత్వాన్ని కూడా గుర్తింపచేశారు.
కెకెఆర్ తెలుగు భాషా సాహిత్యాల అధ్యయనానికి చేసిన దోజూదాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన నేపథ్యాన్ని, కాలాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్ సీతారాంబాగ్ ఆలయ ప్రాంతంలో తొలినాటి దిగంబర, విరసం కవులు జ్వాలాముఖి నిఖిలేశ్వర్ వంటివారు అతి సన్నిహిత స్నేహితులుగా బయలుదేరిన కెకెఆర్ విరసం తొలి ప్రకటన పైన కూడా సంతకం చేసి ఖమ్మం సభలకు కూడా హాజరైనారు. తర్వాత కాలంలోనూ తన ప్రగతిశీల భావజాలం మారకపోయినా విరసంలో లేరు. దిగంబర కవిత్వం తర్వాత విరసం ప్రాబల్యంలో పాత సాహిత్యం పాతకాలపు ప్రతిదీ తిరస్కరణకు గురైన దశ. నన్నయ్యను బొందెలోనే నిద్రపోనివ్వు వంటి జ్వాలాముఖి వాక్యాలు దానికి ఉదాహరణలు. 1975లో వచ్చిన అత్యవసర పరిస్థితి ప్రజా ఉద్యమాలపై ఉక్కుపాదం మోపింది. అనుభూతివాదం వంటివి మొదలైనాయి. సాహిత్య రంగంలోనూ చర్చలోనూ కొంత ఖాళీ ఏర్పడింది. అలాటి సమయంలో కెకెఆర్ చొరవ కొత్త గవాక్షాలు తెరిచింది. సాహిత్యంలో విభిన్నదోరణులు అంటూ వరుసగా మాట్లాడించి పుస్తకరూపంలో ప్రచురించి అర్థవంతమైన ముందు మాట రాసి ఆయన భిన్న కోణాలను ఆవిష్కరింపచేశారు.
ప్రగాఢత, కాలీనత
ప్రాచీన సాహిత్యం నుంచి సామ్యవాద వాస్తవికత వరకూ అధ్యయనం చేసిన వ్యక్తిగా వివిధ ధోరణుల మధ్య తేడాను మాత్రమే గాక కొనసాగింపును కూడా అర్థమయ్యేట్టు చేశారు. ఇప్పుడు ఆ ఉపోద్ఘాతాలు చదివినా మనకు వాటి ప్రగాఢత, కాలీనత ఆశ్చర్యం కలిగిస్తాయి. ఆయన రాసిన వ్యాసాలే గాక ముందుమాటల్లో కూడా ప్రతిదీ ఒక సూత్రీకరణలా గోచరిస్తుంటే అంతగా ఒడిసిపట్టి రాస్తారన్న మాట. గీతలు గీసుకోవడం మొదలెడితే అలా కొనసాగించాల్సిందే.
మౌలికంగా భాషావేత్త భద్రిరాజు కష్ణమూర్తి శిష్యుడైన కెకెఆర్ భాషా పరిశోధనలోనే డాక్టరేట్ పుచ్చుకున్నారు. అయితే సాహిత్యం భాషా రెంటినీ అధ్యయనం చేస్తేనే సమగ్రమైన అవగాహనకు రాగలమని ఆయన గుర్తించారు. ఉదాహరణకు భాష సాహిత్యం కవిత్వంలో అలంకారాలు అంటూ రాసిన వ్యాసాన్ని సాహిత్యం భాషా కళ గనక ఆధునిక సాహిత్య సిద్ధాంతాలకు భాష కేంద్రంగా వుండటంలో ఆశ్చర్యం లేదని ప్రారంభించారు. దీనికి ఒక పోలిక చెబుతూ విజ్ఞానశాస్త్రం ఏదైనా గణిత శాస్త్రం మనలేనట్టే సాహిత్య విమర్శ భాషా శాస్త్రం సహాయం లేకుండా నిలవలేదంటారు. సాహిత్య నిర్మాణంలోని మౌలికాంశాలకు భారతీయ లక్షణ శాస్త్రంలో నమూనాలు వున్నాయని స్పష్టం చేస్తారు. అయితే విస్త్రతి వైవిధ్యం సంక్లిష్టత దాన్నుంచి వచ్చే నూతన భావనలు భావజాలం ఆధునిక సమాజం లక్షణాలనీ ఆధునిక సాహిత్యం కూడా వీటికి ప్రాతినిధ్యం వహిస్తుందని విశదపరుస్తారు. రూపం నిర్మాణం బట్టి సాహిత్యాన్ని ముఖ్యంగా కవిత్వాన్ని అధ్యయనం చేయడంలో అలంకార సిద్ధాంతాలను ఆధునిక దక్పథాలను ఎలా అర్థం చేసుకో వచ్చునో అరిస్టాటిల్ ఆనంద వర్ధనుడు మొదలు త్రిపురనేని మధుసూదనరావు వరకూ తీసుకుంటూ సోదాహరణంగా చెబుతారు. ఇంత విస్తారమైన పరిధి పట్టు చాలా కొద్ది మందిలోనే చూస్తాం. సాహిత్యం రాజకీయాలకు అతీతంగా మనలేదా అని ప్రశ్న వేసి భారతం నుంచి ఈనాటి వరకూ ఏనాడూ సాహిత్యం రాజకీయాలకు దూరంగా లేదని, మార్కెట్ యుగంలో తమకు సమస్య వస్తే రాజకీయాలు వద్దనడం పెద్ద రాజకీయమని చెబుతారు.
తెలుగు భాష పరిణామం
నూరు సంవత్సరాల తెలుగు దశ దిశ, తెలుగు ఆధునికత ప్రాచీనత అనే వ్యాసాలు భాషావేత్తగానూ సామాజిక చారిత్రిక అధ్యయనశీలిగానూ గొప్ప అవగాహన నిస్తాయి. తెలంగాణ ఉద్యమం, కేంద్రం తెలుగును ప్రాచీన భాషగా గుర్తించాలనే ఆందోళన వచ్చినపుడు పైకి ఏది చెప్పకుండానే అన్ని అంశాలనూ సశిస్తూ ఆయన ఈ వ్యాసాలు రాశారు. తెలుగు ప్రామాణిక రూపం తీసుకోవడానికి ఒక కారణం ఆధునిక కాలం అంటూ ప్రారంభమయ్యే నాటికి తెలుగువారికి తమదంటూ ఒక నగరం లేకపోవడం అని గురజాడను కూడా ఉటంకిస్తూ చెబుతారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం సంగతి అటుంచి హైదరాబాదులో కూడా పాలనాభాషలుగా పర్షియన్ ఉర్దూ చలామణి అయ్యాయి. 1910 తర్వాతనే సాధారణ వ్యవహార రూపానికి దగ్గరగా వుండే ఆధునిక తెలుగుభాషా శైలి రూపుదిద్దు కోవడం మొదలైందని నిర్ధారిం చారు. 1925-30 నాటికి ఆధునిక తెలుగు వచన శైలి వ్యాపించిందని వివరించారు. మనుష్యేతర వాచకాలలో ము ప్రత్యయం పోయి మ్(ం) మాత్రమే మిగిలింది. నేనున్నూ అనే బదులు నేనూ అని రాయడం వచ్చింది. మార్పుల తర్వాత కూడా 1960ల వరకూ సరళ గ్రాంధికం కొనసాగింది. మొత్తంపైన ఇందుకోసం వందల ఏళ్లకాలం వాదనలు ఉద్యమాలూ అవసరమైనాయి. చాలా సున్నితమైన ఈ చర్చలో ఎలాటి ప్రాంతీయ లేదా పాక్షిక భావనలు లేకుండా శాస్త్రీయంగానూ ఆమోదకరం గానూ చెప్పడం కెకెఆర్ ప్రత్యేకత. భాషా శాస్త్ర దష్టిలో ఒక భాషా వ్యవహారం ఎక్కువదని గాని మరొకటి తక్కువదని కానీ వుండదని అటువంటి భావాలు ఎక్కడైనా ఎవరికైనా ఏర్పడితే అవి సామాజికమైనవి వ్యక్తిగతమైనవి తప్ప భాషాగతమైనవి కాదని స్పష్టం చేస్తారాయన. సామాజిక భాషా శాస్త్ర పరిశోధనలను విద్యావంతులకు విస్తారంగా అందుబాటులోకి తెస్తే పొరబాటు అభిప్రాయాలు కొంతైనా తొలగిపోతాయని సూచిస్తారు. మానవ సమాజ వికాస క్రమంలో నిర్వహించే పాత్రను బట్టి భాషల ప్రాధాన్యత ఏర్పడుతుందంటారు. ఆధునిక జీవితంలోని క్లిష్టతను వేగాన్ని ప్రతిబింబించే తెలుగు రచనలు వచ్చి వాటిని ఇతర ప్రపంచ భాషల్లోకి అనువ దించడం జరిగితేనే ఆధునికత సమస్యలు పరిష్కారం అవు తుందని స్పష్టం చేస్తారు. వాస్తవానికి ఈ రచయిత సంపాద కత్వంలో వచ్చిన ప్రస్థానం ప్రత్యేక సంచికలో తెలుగు జాతి సంసతి ఎలా చారిత్రికంగా రూపొందాయో అత్యంత ప్రామా ణికంగా సుదీర్ఘంగా రాశారాయన. ఆ సంచికలో తన వ్యాసమే పొసగనిదిగా అనిపిస్తుందని తర్వాత చమత్కరించారు.
మహామహుల నుంచి యువత దాకా..
గురజాడ, శ్రీశ్రీల నుంచి ఇటీవలి రచయితల దాకా చాలామందిని సందర్భోచితంగా సమీక్షించిన విశ్లేషించిన కెకెఆర్ విలువైన పాఠాలు తీశారు. కొత్తవారి పుస్తకాలకు రాసిన ముందు మాటల్లో సూత్రీకరణలతో పాటే ఆయా రచయితల ప్రత్యేకత ఏమిటో చెబుతారు. కాలీనత అంటే కాలానుగుణమైన పరిణామక్రమం అది రచనలో ప్రతి బింబించే తీరు. ఇది కెకెఆర్ ప్రధానంగా గమనించే అంశం. స్థలకాలాలలోనే రచనలు సాధ్యం గనక సామయిక, స్థల సాహిత్యం నిశితంగా పరిశీలించారు. శ్రీశ్రీని గురించి చాలా రాసినా గురజాడలో ఆధునికత ఎక్కువన్నది ఆయన మాట. శ్రీశ్రీ కవిత్వాన్ని గొప్పగా చెబుతూనే ఆయన సామాజిక భావుకత పరిమితులు కూడా గమనంలో పెట్టుకోవాలంటారు. అయితే శ్రీశ్రీ కవిత్రయంగా చెప్పిన ముగ్గురు తిక్కన వేమన గురజాడల గొప్పతనం ఏమిటో ప్రత్యేకంగా రాశారు. త్రిపుర నేని కెవిఆర్ వంటి విమర్శకుల నుంచి బాలగోపాల్, అశోక్ కుమార్ వంటివారి వరకూ ఆయన పరిశీలనలోకి వచ్చారు. మౌఖిక విమర్శనాశైలి అని దానికి పేరు పెట్టారు. సమాజ కవులు అని తాను నామకరణం చేసిన భక్తికవులపై పిల్లలమర్రి రాములు రాసిన పుస్తకానికి ముందుమాట రాస్తూ దాన్ని సమాంతర సాహిత్యం అని అభివర్ణించారు. క్రైస్తవ సంకీర్తనలు అన్న పుస్తకానికి ముందుమాట రాస్తూ భారతీయ సంప్రదాయ భక్తి సాహిత్యంలో దేవుడి గురించిన వర్ణనలకు వాటికి తేడా ఏమిటో చెప్పారు! ఇన్ని గంభీరమైన విషయాలు చర్చిస్తూనే కలం పేర్లు, మారు పేర్లు అన్న రచనలో మనుషుల అసలు పేర్లకు చలామణిలోకి వచ్చే పేర్లకు పొట్టి అక్షరాలకూ తేడాలు పోలికలు ఎన్ని రకాలో బోలెడు ఉదాహరణలతో చెప్పారు.
అపారమైన అధ్యయనం, సమగ్రత స్పష్టత వున్నా వినమ్రంగా ఆచితూచి జీవించిన కెకె రంగనాథాచార్యుల కషి గురించి ఎంతైనా చెప్పవచ్చు గాని పరిమితంగా రాయడం మితంగా మాట్లాడ్డం ఆయన లక్షణాలు. తెలుగు సాహిత్యం చారిత్రిక భూమిక, ఆధునిక కవిత్వం భిన్న దోరణులు, తెలుగు సాహిత్యం మరోరూపు, తెలుగులో తొలి సమాజ కవులు, తెలుగు కథానిక, బహుముఖం వంటి గ్రంధాలు ఆయన రచనలు సంపాదక సంకలనాలు అత్యంత విలువైనవి. బహుశా ఎమెస్కో ప్రచురించిన బహుముఖం ఆయన ఆఖరి పుస్తకం కావచ్చు. సారస్వత కళాశాల ప్రిన్సిపాల్‌గా తర్వాత కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పరిశోధన మార్గదర్శిగా ఎందరినో తీర్చిదిద్దారు. ప్రగతిశీల ఉద్యమాలతో కలసి నడిచారు. తను సేకరించి పెట్టుకున్న అమూల్య గ్రంధాలను సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి విరాళంగా ఇచ్చి సుసంపన్నం చేశారు. స్వయంగా వర్ణాంతర వివాహం చేసుకుని సంస్కరణ స్ఫూర్తి చాటారు. సాహితీ స్రవంతి నిర్వహించిన ఎన్నో కార్యక్రమాలు సదస్సులలో కీలక ప్రసంగాలు చేసి ప్రోత్సహించారు. వ్యక్తిగతంగానూ నన్ను అభిమానించేవారు. ప్రజాశక్తి బుక్ హౌస్‌లో హరిపురుషోత్తమరావు, తన తర్వాత సారస్వత కళాశాల ప్రిన్సిపాళ్లుగా పనిచేసిన నరహరి, డి.చంద్రశేఖరరెడ్డి ఆయనకు సన్నిహితులు గనక చాలాసార్లు చర్చోపచర్చలు సాగుతుండేవి. ఈ కరోనా కాలంలో అనుకోని విధంగా ఆయన మరణవార్త దిగ్భ్రాంతికరం. ఆయన రచనలు బోధనలే మిగిలిన స్పూర్తి.
- తెలకపల్లి రవి