Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవును
ఇప్పుడంతా వినబడుతున్నది
నిశ్శబ్ద మరణ మదంగమే!
కొమ్మూ లేదు బూరాలేదు తప్పెట దరువూలేదు
సాలు వారిన శవాల ఊరేగింపు!
ఈ దేశంలో మద్యం మాంసం
అన్నీ పుష్కలం
పీల్చే గాలొక్కటి తప్ప.!
మనిషిప్పుడు మనిషిని
హక్కుగా చంపేస్తున్నాడు!
గడపదాటితే
అదే కడపటి చూపు!
ఇక్కడ కన్నీళ్ళు
ఎవరి హృదయాలనూ కరిగించవు
చివరికి మిగిలేది శవమే!
ఇప్పుడు
మరణం మామూలు విషయం.
మరణిస్తేనే మనిషి!
సజీవుడిక్కడ
విచిత్ర మానవుడు.!
మనుషులు ఆకలితో ఛస్తున్నపుడు
మనమంతా అంగట్లో సరుకుల్ని
అధిక ధరలకు అమ్మేస్తున్నాం!
నగరాలు పట్నాలు పల్లెలు
మహమ్మరి చావు కోరలు చాస్తున్నపుడు
మందుల్ని దాచి
మూడంతలకు అమ్ముకుంటున్నం!
దొరికి పోతామని భయంతో
మురికి కాల్వల్లో పారబోస్తున్నం.
మనల్ని మనమే మోసం చేసుకుంటున్నం!
ఇప్పుడు
నా శరీరమంతా
శవాలకంపు వాసన
నా ప్రతి శ్వాసలో
ప్రాణాలు వదులుతున్న నిర్భాగ్యుల ఎక్కిళ్ళు !
మనం మనుషులం
అసలే కాదు
ఇక్కడ గాలి పీల్చే అర్హతనెప్పుడో కోల్పోయాం
మేంచేసిన మహా పాపాలకు
శిక్షాస్మతే లేదు.
మేం మనుషులమే కాదు
మనుషులుగా ఉండే
హక్కు లేనే లేదు
మాగొంతులు నులిమి చంపండి
మంటల్లో విసిరి మసి చేయండి!
దుర్గంధ భరితమైన
మా శవాల్ని
నగరం నడి వీధుల్లో
విసిరేయండి!
వాటిపై కాండ్రించి ఉమ్మేయండి!
మనుషుల నోటి ముందు ముద్దను లాగేసిన పాపంమాది!
ఇప్పుడు
ప్రాణాలు కూడ్షా తీసేస్తున్నాం!
మేం మనుషులం కాదు
ఆఖరుకు రాక్షసులం కూడా కాదు!
మమ్మల్ని చంపేయండి!
- హెచ్. రమేష్ బాబు