Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళి
1960వ దశాబ్దపు రెండవ సగంలో ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఆలోచనలు, ఆందోళనలు, ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అనేక దేశాలు వలస పాలన నుండి విముక్తమ య్యాయి. దాదాపు రెండు దశాబ్దాల పాటు తమ తమ దేశాలలో ప్రజల స్థితిగతులలో గొప్ప మార్పులేవో వస్తాయని వేచి చూశారు ఆయా దేశాలలోని ప్రజలు. మార్పులు వస్తున్నాయి. కానీ అవి అసంఖ్యాక పేద ప్రజల జీవితాలలో ఎలాంటి మార్పులూ తీసుకు రాలేకపోగా ఉన్న స్థిమితాన్ని, శాంతిని భగం చేసి కొత్త సంక్లిష్ట పరిస్థితులను తెచ్చి పెట్టాయి. కొత్త ప్రమాదాలలోకి వారిని నెట్టాయి. నిరుద్యోగం, నిరుపాధి, సమానా వకాశాలలేమి అనేవి క్రమంగా పెరుగుతూ పోతున్నాయి. దీని మీద యువకులు అనేక దేశాలలో ఆందోళనలు చేశారు. మేధావులు పరిస్థితిని అంచనా వేయటానికి పూనుకు న్నారు. రచయితలు సృజనాత్మక సాహిత్యం ద్వారా స్వతంత్య్రానంతరం దేశంలో వచ్చిన మార్పులు, జరిగిన అభివృద్ధి ఎవరికి లభిం చింది, ఎవరిని నిర్లక్ష్యం చేసింది అని చూసే ప్రయత్నం మొదలుపెట్టారు. తెలుగు సాహిత్యంలో అటువంటి ప్రయత్నం చేసిన మొదటి రచయిత కాళీపట్నం రామారావు గారు. మొదటి కథ యజ్ఞం.
యజ్ఞం కథ తర్వాత తెలుగు కథలో గుణాత్మకమైన మార్పు వచ్చింది. ఆ మార్పుని కాళీపట్నం రామారావు గారే తను రాసిన మరికొన్ని కథలతో ఒక మార్గంగా మలిచారు. ఆయన రాసిన 'జీవధార', 'ఆర్తి', 'చావు', 'వీరుడు - మహా వీరుడు', 'నో రూమ్', 'కుట్ర', వంటి కథలు దేనికదే ప్రత్యేకత కలిగినవి. 'భయం'వంటి కథ మళ్ళీ వచ్చిందా అనిపిం చేంత గొప్ప కథ. మామూలు జీవిత సన్నివేశా లలో నిండి నిబిడీకృతమైన తాత్త్విక కోణాలను, చాలా సరళంగా, సహజంగా, నిబ్బరంగా చెప్పే నేర్పరి కా.రా. గారు. ప్రతి కథలోనూ లోతుకు వెళ్ళి విశ్లేషిస్తే జీవిత చలన సూత్రాల సారాంశం కనబడుతుంది. లోతుకు వెళ్ళలేన పుడు జీవితం ఇంత దారుణంగా ఉంది. రాజ్యం ఇంత భయంకరంగా ఉంది. దీనిని మార్చుకుని తీరాలి అనే ఆలోచన, ఆవేశమూ తప్పక కలిగిస్తాయి కా.రా. కథలు. ఈ కథలు ఒక్కసారి మెరిసి కనులుమిరుమిట్లు గొలపవు. నెమ్మది నెమ్మదిగా విచ్చుకుని వెలుగుని ప్రసరించే అరుణ కిరణాల వంటి కథలివి. కథను శిల్పం దురాక్రమించకూడదంటారు కాళీపట్నం గారు. అలాగని శిల్పాన్ని మరిచిపో కూడదు. గురజాడ చెప్పిన ''ఆకులందున అణిగి మణిగి, కవిత కోకిల పలుకవలెనోరు'' మాటలు కా.రా అక్షరాలా ఆచరించారు. తన కథావరణాన్ని చాలా స్పష్టంగా చిన్న చిన్న వివరాలతో సహా నింపు తారు. పాఠకుల దృష్టి కోణాన్ని పరిపుష్టం చేస్తారు. అందుకే ఆయనను కథా దీపధారి, కథల మాస్టారు అని పిల్చుకుంటాం.
నిజానికి ఇది ఆయన కథలనూ, కథన రీతిని అంచనా వేసే సందర్భం కాదు. నిండు జీవితాన్ని ప్రయోజన వంతంగా, ఫలప్రదంగా తాననుకున్నట్లు గడిపి వెళ్ళిపోయిన మహా రచయితకు వినమ్రంగా నివాళులర్పించి వీడ్కోలు పలకవలసిన సమయం, సందర్భం. ఆయన రచనలనూ, జీవితాన్ని, కథా నిల యాన్నీ సెలబ్రేట్ చేసుకోవాల్సిన సమయం. ఆయన తాను మహా రచయితనని ఏనాడూ అతిశయం చూపలేదు. తన తోటి రచయిత లను, తన తర్వాతి తరాల రచయిత లనూ ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. కథా మెలకువలు చూపించారు. సలహాలు ఇచ్చారు. కథా సూత్రాలు విప్పి చెప్పారు. బోధించారు. తర్వాతి తరాల రచయితలతో ఇంత సన్నిహిత స్నేహ సంబంధాలు నెరిపిన రచయితలు చాలా తక్కువ మంది ఉంటారు. వారందరికీ గురుతుల్యులు కాళీపట్నం రామా రావు. ఆయన దగ్గరకు వెళ్ళాలంటే ఎవరికీ సంశయం ఉండదు. గౌరవం, ప్రేమ ఆత్మీ యతలలోనే ఆయనను ఆలింగనం చేసుకుం టారు. ఆ చనువు ఆయన అత్యంత సహజంగా అందరికీ ఇస్తారు. రచయితలకూ, రచయిత్రులకూ కూడా! నిరాడంబర మైన జీవితం ఆయనది, ఆయన కథలవలే!
ఇక కథానిలయం ఆయన నిజం చేసు కున్న కల. కథలకు ఒక చిరునామా కావాలనీ, ఏ కాలంలో రాసిన ఏ కథ అయినా పాఠకు లకు అందుబాటులో ఉండాలనీ ఆయన అనుకోవటంలో కథల మీదా, పాఠకుల మీదా ఆయనకున్న ప్రేమ తెలుస్తుంది కదా! ఆ ప్రేమను ఆయన పంచాడు. తిరిగి పొందాడు. తెలుగు కథలన్నీ శ్రీకాకుళం దారిపట్టాయి. కంచికి వెళ్ళటం మాకున్నాయి. ఆ రకంగా కూడా మాస్టారు కథలకు కొత్తదారి చూపిం చాడు. ఆ కథా నిలయం నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీ ఆయన. ఊరూరూ తిరిగి మరీ కథా నిధులను పోగు చేసుకున్నారు. ఆ ప్రయత్నం లోని చిత్తశుద్ధి వల్ల ఎందరో ఆయనతో కలిసి నడిచారు. చివరకు అది డిజిటల్ అవటానికి వివినమూర్తి వంటి వారు శ్రీకాకుళంలో ఉండి రాత్రింబవళ్ళూ పని చేసి సాధించారు. ఇదంతా సులువుగా జరగలేదు. అప్పలనాయుడు, గౌరునాయుడు వంటివారు తమ శక్తి సామర్థ్యా లను వినియోగించారు. కథా నిలయం తెలుగు కథా గౌరవాన్ని నిలబెట్టే భవనంగా నిలబడింది. కేవలం భవనం కాదు. అనేక సృజనాత్మక శక్తుల కూడలి. అదంతా కాళీ పట్నం రామారావుగారి సంకల్పబలం. ఆయన మీద రచయితలకూ, పాఠకులకూ ఉన్న విశ్వాస ఫలం. మనం గురజాడ ఇల్లు, శ్రీశ్రీ ఇల్లు స్మారక చిహ్నాలుగా చేయమని ప్రభుత్వా లకు విజ్ఞప్తి చేస్తుంటాం. మనం తలుచుకుంటే పాఠకులుగా, అభిమానులుగా చేయలేని పని కాదు. తలుచుకోవటం లేదంతే- రామారావు గారు తలుచుకున్నారు కథలతో నెలవు కావాలని. సమకూరింది.
కాళీపట్నం రామారావు గారి నుంచి యువ రచయితలు నేర్చుకోవాల్సినదెంతో ఉంది. ముఖ్యంగా పుస్తక పఠనం. ప్రతి రోజూ చదవటం, రాసే కథ పట్ల నిబద్ధత, అతిశయ ఆర్భాటాలు లేని సాహిత్య ప్రపంచ సంచారం. సామాజిక, రాజకీయ, తాత్త్విక విషయ పరి జ్ఞానం సంపాదించటం, తోటి రచయితలతో స్నేహపూరిత సంబంధాలు ఇలా ఎన్నో నేర్చు కోవచ్చు. నేర్చుకోవటం, ఆచరించే ప్రయత్నం చేయటమే ఆయన కిచ్చే అసలైన నివాళి.
- ఓల్గా