Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎవరినీ తప్పు పట్టలేం
దేనినీ కాదనలేం!
కాలం కఠినభాష మాట్లాడుతున్నప్పుడు
ఏదీ అంచనా వేయలేం
దేనినీ గాలికొదిలేయలేం!
అధీనంలో ఉండాలనో...
ఉంచాలనో కాంక్షలుండవు
వాటంతటవే తెరలు తెరలు
తరంగాల్లా
భ్రమా ప్రపంచాన్ని సష్టించి
వణికిస్తున్నప్పుడు
అణువు.... అణువులో ఒదిగుండదు!
ఇక చెట్ల భాష చెట్లది
మొక్కల మాట మొక్కలది
సమన్వయానికి
గాలిదొక వింత పాట
ఊగిసలాడించే మనసుకొమ్మల్లోని
పిచ్చుకలదొక రాగం!
గుబులు ద్రావణాన్నొలికే ఆకులదొక ఊసు
వొణుకు తున్న రెమ్మల శబ్దాలాపనలు
కళ్ళముందు ధీటుగా
ఎదుగుతూ ఎగురుతున్న
దట్టమైన గుబుర్ల నవ్వులను గ్రహించినా
అడుగుకు అడుగూ
ముందుకు వేయలేని ముతకమూస మౌనం!
అన్నీ తెలిసీ
తెలియని అధైర్యపు అనామికా స్వప్నం
స్వంత లిపి మరిచి
తెరపై ఆరేసిన పతంగిలా
రెపరెపలాడుతున్న వేళ...
అంతా తమలో తామై
జీవితపుగోడ మీద నిలబడి
సందిగ్ధంలో
ఏడ్వలేక నవ్వడమో...నవ్వలేక ఏడ్వడమో....
ఎటూ దూకలేని అస్వస్థతలో
లోలకమైన హదయలయలది
ఒకానొక అసంతప్త శోకసంద్రం....
ఉప్పునీటి ఎడారిలో
తుదితెలియని
మనోధర్మ సంగీతం!!
- అరుణ నారదభట్ల