Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్థివ దేహం మీద ఎవరెన్ని పూలు జల్లినా
నీ రెండు కన్నీటి చుక్కలే పరిమళించాయి -
ఆ పరిమళాల తడిలో
అసలైన నా చివరి స్నానం సంపూర్ణమైంది...
ఎవరి ద్వారా ఎవరొచ్చారు?
ఎవరి ద్వారా ఎవరికి దారులు వేయబడ్డాయి?
తెలియదు గాని -
జీవితమంతా ముందుండి నడిపించాననుకున్నాను
ఈ రోజుతో అది భ్రమయని తేలిపోయింది
దుఃఖ వదనంతో
నీవు ముందుండి దారి చూపుతుంటే
పూల పల్లకినెక్కిన నా ఆత్మ ఆనందంతో
నీ అడుగుల జాడలోనే వెన్నంటి వస్తుంది-
జీవితం ఎప్పుడూ శూన్యంతో నిండిన
ఒక వలయమే కదా!
జీవితమంతా చీకటంటే భయంతోనే బతికాను
బిడ్డా! తలకొరివిగా చితికి నిప్పంటించి
నా మరో ప్రపంచాన్ని వెలుతురుమయం చేసావు
ఇక భయం మరిచి కాంతి మార్గం గుండా
మళ్ళీ ప్రయాణం సాగిస్తాను..
- డా. రూప్‌కుమార్ డబ్బీకార్
99088 40186