Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''ఒరేరు! ఓరె, కొడకా, నువు బానిసబతుకు బతుకుతావా- లేకపోతే సస్తావా! యీయాల సస్తే రేపటికి రెండు, రా నిన్ను సంపుతానన్నాను. ఆడు పరుగెత్తి కొచ్చినాడు. నాను పటక్కిన నరికేసినాను. ఆ కత్తటు, బారేసియిటు లగెత్తుకొచ్చినాను.
1964 కాలం నాటి మాట అప్పట్లో పురుడు పోసుకోని 1966 యువ దీపావళి సంచికలో అప్పుడు ఒకటిగా వున్న తెలుగు రాష్ట్రంలో సంచరించి, ప్రగతిశీల సంచలన ఆలోచన రేపిన అక్షర మూట అది- ఒక చిన్న పాటి పొట్టి నవల లాంటి 40 పేజీల కథ. కాళీపట్నం రామారావు మాస్టారు రాసిన యజ్ఞం!
సరిగా అప్పుడు నా ఒంటి మీద పారాడుతున్న వయస్సు సంఖ్య తొమ్మిదేళ్ళు... పొడవైన లాగులతో, చినిగిన చొక్కాలతో, పేదరికంలోని మధ్య తరగతి 'గతి'కి ఒక కొండ గుర్తుగా, కాలం మీద పాదం మోపిన బాల్యం అది. అప్పటి కాలం కన్నా ఆలోచనాపరులు సహచరంతో, అప్పటి తెలుగు జాతిని ప్రేరేపించిన ఉద్యమ నేత్ర శిఖంతో యజ్ఞం కథ చదవడానికి మరో ఆరేళ్లు పట్టింది. అప్పుడు సరిగ్గా నా వయస్సు పదహేను ఏళ్ళు మాస్టారును కలిసి కరమాల పొందడానికి మరో పదేళ్ళు పట్టింది. నా పాతికేళ్ళ జీవితం అది. కొత్త ఆలోచనలతో నూనూగు మీసాల యవ్వనంతో ఈ దేశ మట్టి మీద గొంతు పెట్టిన కాలం అది-
40 పేజీల కథ. నాలుగు తరాలను కదిలించిన కథ. తెలుగు యాసభాషల పాయలను, నది స్రవంతి చేసిన ఒకానొక వాస్తవిక కాలం కథ.
మరి కథ మీద వచ్చిన ముగింపు కథ! బహు ప్రజా చర్చ ఇప్పటికి ముగింపు కాని చర్చ కథ అది!
ముగింపు అలా ఉండకూడదు అని 400 పేజీలు. పర్వాలేదు ఆలోచనలను ఏదో రీతిలో పదును పెడుతుంది కదా మరో 400 పేజీలు. ఇక పత్రిక సమీక్షలు... లేఖలు అవి 200 పేజీలు. మొత్తం 1000 పేజీల పైగా 40 పేజీల తెలుగు కథకు ఇంత డిబెట్ ఇతరతర అభిప్రాయం పొందడమంటే చైతన్య నది ఉరకలు వేసినట్లే కదా.
ఇప్పటి నా 65 ఏళ్ళలోని అర్ధ దశాబ్దం సాహిత్య జీవన ప్రస్థానంలో ఒక కథకు ఇంత పెద్ద గ్రంథం రావడం అంటే, ఇది మొదటిది అనుకుంటా తెలుగు సాహిత్యంలో.. ఏదిఏమి అయినా మాస్టారి గారు ఒక చిరునవ్వును కలిపిన కథల ఆస్తి తెలుగు జాతికి అందించి, ఏదైనా చిక్కు ముడిల సమస్య వుంటే మీరే వెతుక్కోమనే వారు.
మరో శేషం మిగిలించిన విశేషం... 30 ఏళ్ల కింద అనుకుంటా 'కథాకేళి' ఒక చిన్నిపాటి పత్రిక నా గుమ్మంలోకి రెక్కలు తొడుక్కోని నా ఎదపై వాలింది. పత్రిక చిన్నది అయినా గొప్ప ఆలోచనలతో కూడిన ఇంద్ర ధనస్సు జ్వలను అది.
జనజ్వాల పత్రిక చదివి మీ అభిప్రాయం తెల్పమని మీరు కూడా భాగస్వాములు కావాల్సిందింగా.. మీ... కా.రా
నాలుగు అక్షరాలు మాస్టార్ గారి మునివేళ్ళలో స్నానం చేసి పవిత్ర పసిపిల్లలు అయిన ఆ స్పర్శ లోపల తడితోనే ఇంకా అలానే వుంది.
రాత్రి అంతా కంటి మీద యుద్ధం ప్రకటించి, గది అంతా వెతుకుతూనే వున్నా, కథాకేళి పసిపిల్లల కోసం, అంతర్లీనంగా తేలాడుతున్న వాన తెప్ప అది.
ఏదిఏమైనా 97 ఏళ్ల వసంతాల వెన్నెల్ని, నిరంతర యజ్ఞ శ్రమ మేధా, తెలుగు జాతికి వీలునామా రాసిచ్చి, అలా నిచ్చెన అల్లుకొని అకస్మాత్తుగా ఎక్కడికి వెళ్లినట్లు! ఈ పెద్దాయన!
- జనజ్వాల
సెల్: 9949163770