Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''సిస్టమ్''ల స్థిరపడ్డ మనమే పంచుకుంటం/ చెట్లే నయం/ పటువలతో నీళ్లు పోసినందుకు/ పతాకం పలకరిస్తయి/...../ ''ఏం కూడబెట్టిచ్చిండు పిల్లలకు...'' / ''లోకం లోతు /ఇంత రేషం/ ఇన్ని కన్నీళ్ళు/ తలెత్తుకున్న చరిత్ర /వొడువనిదే ఇచ్చిండు/ చాలదా..../ (బాపు -డాక్టర్ నందిని సిద్ధారెడ్డి) ''నదిపుట్టువడి'' కవితా సంపుటి లోంచి...
కనిపెంచేది అమ్మయితే కనిపించకుండా మనల్ని ప్రేమించేది నాన్న. కన్నపేగులు చిన్నబుచ్చినా ''నాదాని'' కాకుండా నవ్వుతూ స్వీకరించి నదిలా సాగిపోయే మన జీవితపు నిలువెత్తు నిగ్రహం నాన్న కదా ..!
మా నాన్న మాకెంచేసిండు ఏమిచ్చిండు అంటారు కొందరు. ఇంకా ఏమియ్యాలె, తన జీవితాన్ని ధారపోసి రెక్కలను పిల్లలకు అంకితం జేసిండు అంతకంటే ఏం చేయాలి. కుటుంబం అనే బండిని లాగే రెండు చక్రాలు అమ్మానాన్నలు ఒక చక్రం లేక పోయినా బండి ఎలాగైతే కదలదో! సంసారం అనే నావకు అమ్మానాన్నలే చుక్కాని. వారిలో ఏ ఒక్కరు లేకపోయినా ఆ లోటు స్పష్టంగా కనిపిస్తుంది. ఇద్దరిలో ఎవరి విశిష్టత వారిదే ఎవరి బాధ్యత వారిదే అమ్మ ప్రవర్తనలో బిడ్డలపై కన్నప్రేమ కనిపిస్తుంది. నాన్న నడవడిలో కుటుంబంపై తనకున్న బాధ్యత కనిపిస్తుంది. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా బాధను గుండెల్లో మోస్తూ బతుకు భారాన్ని భుజాలకెత్తుకొని సంసారం మునిగిపోకుండా అనుక్షణం అప్రమత్తం చేసే ఆదెరువు నాన్న.
అందరి భావాలను ఒకచోట చేర్చి 113మంది కవులకలాలతో చెక్కిన కవితాశిల్పాలకు అక్షరప్రతిష్ట చేసి నాన్న అనే పదానికి కవితా పట్టాభిషేకం చేశారు భానుశ్రీ కొత్వాల్. తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ తండ్రిపై తన బాధ్యతను ప్రేమను తనదైన శైలిలో వ్యక్తపరిచారు.
భానుశ్రీ చేసిన ప్రయత్నం గొప్పది. చరిత్రలో నిలిచిపోతుంది. నాన్న కవితా సంకలనంలోని కొన్ని కవితలను చదువుతూ ఉంటే కన్నీళ్లు ఏరులవుతున్నాయి. కవితాక్షరాలలో కవుల కవయిత్రుల నాన్నల కష్టాలు, ప్రేమ, ఆప్యాయతలు వారివారి తండ్రులపై వారి బాధ్యత కనిపిస్తుంది. ఇక్కడ కన్న తండ్రి ప్రేమకు నోచుకోని వాళ్ళున్నారు. తల్లే తండ్రి బాధ్యత కూడా తీసుకుని రెండు పాత్రలూ పోషించిన తల్లులున్నారు. ఎంత బాధ్యత తలకెత్తుకున్నా కుటుంబ భారం మోసే క్రమంలో ఆత్మీయతకు నోచుకోని అతను లేని లోటు అడుగడుగునా కనిపిస్తుంది.
...../లోకం తిరిగిన/ ఆయన పాదాల ముందు/ నా కవిత్వం పాదాలెంత!/ ఓ నాయనా నీ జీవితమే నాకు దీవెన (నాయన యాదిలో -డాక్టర్ ఎన్.గోపి) తండ్రి గారిని గుర్తు చేసుకుని ఒక్క సారి తండ్రిని ఆవాహన చేసుకోవడానికి తండ్రి తనతో ఉన్నప్పుడు కలిసి తిరిగిన కూర్చున్న చోటులోని జ్ఞాపకాలను తడుముకుని ఆ స్థానంలోకి వెళ్లి కల్వర్టు మీద కూర్చుంటానంటాడు కవి. జీవితం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొనే నేర్పుతో పాటు అనుభవాల పాఠాలను చెప్తుంది.
సుట్టుముట్టు పదూర్ల పతారపు/ దొరకు ఎదురుతిరిగిన తొలి తలపాగావి/ ...../ నీ రుమాలు కాంతి వలయమై/ నా చుట్టు పగిడిమర్రి చుట్టు/ ఎప్పటికీ (ఇలవరస -డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి) నాన్నగారిని వర్ణించిన తీరు ప్రతి వరుసలో కవితా పాదమై విరబూసింది. పగిడిమర్రికి పట్నానికి ములాకత్ చేసింది నీవు'' అని అంటారు.
తన తండ్రి పల్లెకు నాగరికత నేర్పించాడని చెప్పకనే చెప్పారు. రుమాలు రైతన్న తలకు కిరీటం ఒక గౌరవం. దేశానికి అన్నం పెట్టే రైతన్న తను పుట్టి పెరిగిన ఊరుకు ఏదైనా చేయాలనుకోవడం అతిశయోక్తి కాదు కదా !
...../పదే పదే వీళ్ళు పట్టమన్న / పిట్ట రంగేదీ నాకు గుర్తు లేదు/ రెక్కలల్లార్చి/ మా వెన్నెముకల్ని నిలబెట్టే /అవకాశం తనకు దొరకలేదు (పిట్టరంగు-డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి)
తను తండ్రి ఆప్యాయతకు నోచుకోకపోవడం తోటివారు వారి తల్లిదండ్రుల గురించి మాట్లాడుతుంటే ఆ మాటల్లో తన తండ్రిని ఊహించుకున్నానని ఆవేదన వ్యక్తం చేసిన వైనం కనిపిస్తుంది. ఎదుగుతున్న క్రమంలో వేలుపట్టి నడిపించిన ముద్రలు ఉన్నాయేమోనని తడిమిచూసుకున్నప్పుడు. గోడపై చిత్తరువై నప్పుడు కన్నీటి చారికలే కనిపించుంటాయి.
...../నా కలలు మొలకెత్తుతుంటే /నన్ను నాటిన నాయన) నా వర్తమాన పూదోట (అనేకుడు-మునాసు వెంకట్) కష్టాల్లోనూ తనకలలను వెలిగించిన సూర్యుడిని చేసిండు అంటారు తన తండ్రిని.
...../ఆకస్మిక సూర్యగ్రహణంతో/ ఇల్లో గబ్బిలాల కొంపే అయ్యింది /అమ్మ బతుకు అమావాస్యే/ పందిరి లేని పాదునయ్యాను/ (అస్తమించని సూర్యుడు సరికొండ నరసింహరాజు) నాన్న అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోతే వారి తల్లి తండ్రి పాత్ర కూడా పోషించి తన కలలను నిజం చేసే క్రమంలో తండ్రి ఆశయాలను నెరవేర్చి వారి బతుకుల్లో తండ్రిని అస్తమించని సూర్యుడిగా కొలుస్తున్నారు.
విద్యా నిచ్చెనలెక్కకున్నా/ అంతస్థుల మూలాలకు/ తాపీ తో ఊపిరి పోసే/ శ్రామిక ఇంజనీరు (కలల సందుగ-మండలస్వామి) తన తండ్రిని జీవన గుండు దారం అంటారు.
రెక్కలే సాధనాలు గా సేద్యమే పెట్టుబడిగా /నా ఆశాసౌధాలు నిర్మించిన /నిత్య కార్మికుడివు నీవు (వెన్నెముక- సాగర్ల సత్తయ్య) తన భవిష్యత్తును తలపోసిన స్వాప్నికుడు అంటారు.
నాయన తోడు కరువైతే/ బతుకంతా దుర్భరం/ చూపును పోగొట్టుకున్న కన్ను/వెన్ను విరిగిన శరీరం /ఊహించలేని సమాధానం (నాయన- శ్రీ దాస్యం లక్ష్మయ్య)
.../ నువ్విచ్చిన /చిటికెన వేలు భరోసా/ నాతో/ చూపుడువేలెత్తించ్చింది (నా ఇంటి పేరు మార్చుకోను-డా.షాజహానా) అమ్మీ అబ్బా పిలుపుల లోతులను కొలవడానికి జీవితకాలం సరిపోదంటారు వీరు.
....../ ఇప్పటికీ /మా నాన్న పక్షి జ్ఞాపకాల రెక్కల కిందే/ కోడి పిల్లల్లా తలదాచుకుని/ మాజీవన మూలాల్ని / తలపోసుకుంటూ వుంటాం (నాన్న పక్షి- చిత్తలూరి)
...../నాన్న !/పేరు విన్న క్షణం/ నా మనసు గర్వంతో కొత్త జీవమౌతుంది/ నీ జ్ఞాపకాల దొంతర్లోంచి రాలుతున్న/ఒక్కొక్క సిరాచుక్క/ నా భవితవ్యం (జ్ఞాపకాల దొంతర్లు-డా.బండారు సుజాత శేఖర్) తల్లిదండ్రులే ప్రాణప్రదంగా పెరుగుతున్న ఆడపిల్ల జీవితంలో అకస్మాత్తుగా నాన్న అనే పదం జ్ఞాపకంగా మిగిలితే ఆ అమ్మాయి భవిష్యత్తు ఎంత వేదన పూరితమైన ఉంటుందో ..!
....../కుదుటపడని మనసుకు/ ఖురాన్ వాక్యం లా/ సకల మతాల సారమై/నాలో మేల్కొన్నాడు నాన్న (పవిత్ర గ్రంథం-నల్లు రమేష్)
....../ అవును/ నేనిప్పుడు నాన్న లేని ఒంటరి బతుకును/ అండదండలు లేని అనాధ జీవుడు (రెక్కలు తెగితే- డా.భీంపల్లి శ్రీకాంత్) మనం ఎంత ఎత్తుకు ఎదిగినా నాన్న అనే శిఖరం ముందు పక్షుల మే కదా! హఠాత్తుగా నాన్న కనుమరుగైతే జ్ఞాపకాలు గా మిగిలి పోతే రెక్కలు తెగిన పక్షులుగా అయిపోతాం.
...../నేను ఒంటికాలి నక్షత్రాన్నై ఉన్నప్పుడు/ నాన్న/ నా పళ్లెంలో అన్నమైండు (నా బలం- డా. కందుల శ్రీను) తన తండ్రితో ఉన్న రుణానుబంధాన్ని తడిమి చూసుకుని ఒకరికొకరు తోడైన క్షణాలను గుర్తుచేసుకున్నారు.
నా కలం కున్న శక్తి/ ''నాన్న'' పాద గోటికి కూడా సరితూగదు (చెరగని ముద్ర-తిప్పన హరిరెడ్డి)
...... / అబ్బా!/ నీవో నిండైన ప్రేమరూపం/ ఓటమెరుగని బాటసారి/రాజీలేని పోరాటానికి ప్రతిరూపం... (నీ ఊహల వెంట-నస్రీన్ ఖాన్) నాన్నను స్మతుల నిలయంగా కొలిచారు.
..../అమ్మ కంటతడే అందరికీ కనబడేది గానీ/ నాన్న గుండెతడి ఎవ్వరికీ కనబడనిచ్చేవాడు కాదు (చుక్కాని-సరితా నరేష్) నాన్న ఎద నా తొలి అడుగుల ప్రస్థానం అంటారు.
.... /బువ్వ కళ్ళ ముందుంటే /..... /పళ్లెంలో పడ్డ మెతుకులన్నీ/ నా కళ్ళకు ఆయన చెమట చుక్కలు (చెరగని సంతకం- గంభీరావుపేట యాదగిరి) ఇంధనం అడగని యంత్రం అంటారు వీరు.
.../అయ్యంటే/ ఇప్పుడు నేను రాయలేని/ బతుకు గీతం నేను పాడలేని బతుకుపాట/..... /కనీసం చూడడానికి/ ఏ ఫోటో లేని కఠిన సత్యం (నవనొక్క ఇరిసెల పనితట్ట-తప్పెట ఓదయ్య) కనీసం తన తండ్రి తనను హత్తుకున్న జ్ఞాపకాలు లేకున్నా కనీసం చూసుకోవడానికి ఒక ఫోటోకూడా లేని తన పేదరికంగా హదయవిదారకంగా చిత్రించాడు.
బంటోలిగా పనిచేసి దొరలిగా బతకాలే /ఇది మా నాన్న రాసుకున్న కార్మిక చట్టం (నీయ్యతైన మాట- బండారు శంకర్) ఆధునిక సత్యవాది మా నాన్న అంటారు.
మా అమ్మలో కూడా/ తన అమ్మను చూడగల్గిన నాన్న / నాకిప్పుడు కొడుకయ్యాడు (వజ్రముఖుడు-భానుశ్రీ కొత్వాల్) నేడు తండ్రిని కొడుకుగా చూసే అదష్టం ఎంతమందికి వస్తుంది. అవకాశం ఉన్నా ఆదరణకు నోచుకోని ఎన్నో జీవిత గాథలు మనకళ్ళముందే జరుగుతున్నాయి.
క్రమశిక్షణతో ప్రేమైక భావనతో పెంచి పెద్ద చేసిన తన నాన్న తన ఇంటినే కాదు కలత చెందిన కొన్ని గుండెలలోని బరువును కూడా తేలిక పరిచాడు తన తండ్రి ప్రేమ సంజీవని అంటున్నారు భానుశ్రీ. ఇప్పుడు ఆయన కలలకు తను వంతెన నిర్మించి తండ్రి బాటలోనే తానూ నడుస్తానని తండ్రి పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసి ఎన్నో కార్యక్రమాలను రూపకల్పన చేసి భవిష్యత్త్ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.
పెదాలను దూరం చేసి పలికే ''నాన్న'' అనే రెండక్షరాల పదం తరాలుగా చరిత్రలో నిలిచిపోయే విధంగా గొప్పకవులతోపాటు వర్థమాన కవుల కవితలనూ అద్భుతమైన కైతలమాలగా కూర్చి అందరికీ అందుబాటులోకి తెచ్చిన భానుశ్రీ కొత్వాల్ అభినంద నీయురాలు. చదివితే గాని ఆ ఆత్మీయత అర్థంకాదు. ప్రతి ఒక్కరూ దాచుకుని తప్పకుండా చదవాల్సిన గ్రంథం.
- జయంతి వాసరచెట్ల
సెల్: 99855 25355