Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1.
ఓ ఫాదర్
కాదు కాదు..గదర్
ఆమె ఏం చేసిందని
ఈ మరణ శిక్ష?
చర్చీ కాంపౌండ్ నంతా
పొద్దుమాపు
చీపురుపుల్లల మొనల మీద
నిలబెట్టిందనా
తన సమయాన్ని
మూడుపూటలుగా ముక్కలు చేసి
నీకు వండిపెట్టిందనా
రెక్కలకే అలుపు తెలవనీయకుండా
తన మనసుతో
తానే అబద్ధాలు చెప్పుకుందనా
కారణమేదైతేనేమి?
ఆమె జీవితానికి
అంటుకున్న
కొత్తరకం వైరస్ వై
భారీ మూల్యాన్నే చెల్లించావు కదరా!
నిండుప్రాణం తీసి
ఉత్తిబొమ్మను చేసి
చెత్తకుండీలో
విసిరావు కదరా!
ఛారు తాగినంత సులువుగా
పెదాలమీద అబద్దాన్ని సిప్ చేసే
నీ నోటివెంట
సువార్త ఎలా పలుకుతుంది
అరె!....
లచ్చలు లేకున్నా
లక్షణం ఉన్న
ఆమె పేదతనానికి
×ూ× మార్క్ ఉందిరా
2.
అన్నెం పున్నెం ఎరుగని
అబలను కొట్టిచంపిన
ఓ గలీజన్న
నిజాన్ని నువు
లాకప్ డెత్ చేసిన సంగతి
జైలు ఊచల
కళ్ళల్లో వెతికితే
ఆ కన్నీళ్ళే చెబుతాయి
అబద్దాన్ని ఆవకాయలా
నంజుకుతినే
కుతంత్రపు వెర్రితలల
మద్యానివి నీవు
నాలుగు రోడ్ల కూడలి మీద
ఆకలిని వెతుకుతూ
రోజును ఇటుకల్లోనో
సిమెంటు బస్తాల్లోనో కూరే
కూలీల మీదనో
పొద్దుగూకినాక
ఊర్లలో చివరాఖరు గుడిసెలలో
వెలుగుతునకలయి
వెన్నెలారబోసినట్టుండే
మచ్చలేని చంద్రులు
ఎల్లయ్యో,మల్లయ్యో,
మరియమ్మలాంటి వాళ్ళ మీదనో
నువు
కర్రముక్కవై విరుగుతావు
అక్కర్లేని తిట్టువై పేలుతావు
ప్రాణాలను యమపాశమంత
సులువుగా లాగేసే పనిలో పడ్డావు
దోస్తీ అంటే ఇదేనా
నీ పెళ్ళామో,పిల్లో
నీ తల్లో,చెల్లో అయితే
కలలో కూడా
చంపకపోదువు కదరా!
మళ్ళీ మళ్ళీ
ఆవేదనతో అడుగుతున్నా
నీ అయ్యో, అన్నో
నీ తమ్ముడో, బామ్మార్దో అయితే
మూడోకంటికి కూడా
తెల్వనీయక పోదువు కదా!
3.
ఇదిగో
ఆమె తరుపున
మిమ్మల్నో సూపు సూడమని
స్తోత్రం చెబుతున్నాను
ప్రభూ!
ఈ పాపులను మన్నించకండి
మరియమ్మ రక్తంతో తడిసిన
ఆ నేలంతా సిలువవేయబడ్డది
వాళ్ళను గొర్రెపిల్లలుగా ఎంచకండి
గోతికాడి గుంటనక్కలవి
ఆకులే కాదు
మూతులు నాకటంలోను
ముందంజలో ఉన్నవవి!
- తండ హరీష్ గౌడ్
8978439551