Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిన్నారి పొన్నారి చిరుత కూకటి నాడే ఆయన కలం పట్టలేదు. నూనూగు మీసాల నూత్న యవ్వనంలో నవలలూ, కథలూ, కథానికలూ రాయలేదు. డెబ్బయ్యవ ఏట తన ఆత్మకథతో ఆయన దంగలకు దిగారు. ఒక్క పుస్తకంతోనే బస్తీమే సవాల్ అన్నారు. ఆయన సవాల్‌ను ఎదుర్కొనే కలం పహిల్వాన్ ఎవరూ కనుచూపు మేరలో కనిపించడం లేదు. బాగానే ఉన్నది గని గింతకు గాయిన పేరేంది? గాయిన రాసిన వయ్యి ఏందని అడ్గుతున్నరులే. ఆయనే దేవులపల్లి కృష్ణమూర్తి. 'ఊరువాడ బతుకు' ఆయన ఆత్మకథ.
శ్రీశ్రీ 'అనంతం', తిరుమల రామచంద్ర 'హంపీ నుంచి హరప్ప దాకా', రావూరి భరద్వాజ 'జీవన సమరం', దాశరథి కృష్ణమాచార్య 'యాత్రాస్మృతి', దాశరథి రంగాచార్య 'జీవన యానం', రాంభట్ల కృష్ణమూర్తి 'సొంత కథ', గజ్జల మల్లారెడ్డి 'మనస్సాక్షి' వంటి ఆత్మకథలు న్నాయి. దేవులపల్లి ఆత్మకథ 'ఊరువాడ - బతుకు' విలక్షణమైనది. వాన చినుకులు పడితే మట్టి నుంచి వచ్చే పరిమళం వంటిది. కృష్ణమూర్తి సాదాసీదా మనిషి. చిరునవ్వుతో చిన్నగా మాట్లాడు తారు. వాదోపవాదాలకు ఆయన చోటివ్వరు. శ్రీశ్రీ, రావి శాస్త్రిలకు ఆయన వీరాభిమాని. నకిరేకల్‌లో తను నివసించే వీధికి శ్రీశ్రీ మార్గమని పేరు పెట్టారు. తన ఆత్మకథలోని నాల్గవ భాగాన్ని శ్రీశ్రీ 'అవతలి గట్టు' గేయంతో ప్రారంభించారు. అంతేకాదు, ఈ గేయంలోని ఒక్కో పాదాన్ని ఒక్కో కథగా ఈ మధ్యనే రాశారు.
- ఇదేమిటీ వింత భయాలు
- ఇంట్లో చీకటి
- ఇవేమిటీ అపస్వరాలు
- తెగింది తీగ
- అదేమిటా రంగుల నీడలు?
- చావూ, బ్రతుకూ
- ఎచటికి పోతావీ రాత్రి?
- అవతలి గట్టుకు
ఈ పాదాలే కథా శీర్షికలుగా ఉంటాయి. ఈ శీర్షికలతో ఆయన రాసిన కథా సంకలనం త్వరలో వెలువడనుంది. ఇప్పటి వరకూ 1. ఊరువాడ బతుకు (ఆత్మకథ), 2. మా యాత్ర (యాత్రా కథనం), 3. కథల గూడు (కథా సంకలనం), 4. బయటి గుడిసెలు (నవల), 5. తారుమారు (కథానికా సంకలనం), 6.యక్షగానం (కథా సంకలనం), 7. మూడు ముక్కలాట (నల) అనే ఆయన పుస్తకాలు వెలువడ్డాయి.
'స్టార్ బుక్ హౌస్' అనే కథలో తన రచనారంభం గూర్చి కృష్ణమూర్తి చెప్పారు.
'రిటైరÊ అయిపోయిన తరువాత ఎటూ పొద్దుపోక స్టార్ బుక్ హౌస్‌లో కొన్న సోవియట్ 'రాదుగ' పుస్తకాలను మరల చదువుతూ పోయిన. చదివినప్పుడల్లా నాకు కొత్త అందాలు కన్పించేయి. రాసిన వాళ్ళలో చాలా మంది తమ అనుభవాలనే నవలలుగా చిత్రీకరించారు. అట్లే నేనెందుకు నా అనుభవాలను రాతలో పెట్టకూడదని భావించి రాయడం మొదలు పెట్టిన. ఎంత రాసినా 10, 12 పేజీలకు మించడం లేదు. మరలా ఓ మారు 'రాదుగ' ప్రచురణలను తిరగేస్తుంటే బాట దొరికింది. అలా నా మొదటి పుస్తకం 'ఊరు వాడ బతుకు' వెలువడింది. ఇది నా డెభ్భైవ ఏట రాసియుంటి' తన పన్నెండో ఏట కృష్ణమూర్తి సూర్యాపేటలో ఐదో తరగతిలో చేరారు. గాంధీ పార్కు ముందు నుంచే స్కూలుకు వెళ్లేవారు. ఆ పార్కు ముందు పెద్ద పెద్ద వేపచెట్లుండేవి. వాటి కింద జనగామ, హైద్రాబాద్ వెళ్లే గవర్నమెంటు బస్సులూ, జగ్గయ్య పేట, మిర్యాలగూడకు పోయే బొగ్గు బస్సులూ ఉండేవి. చెట్ల కింద నీడలో ప్రయాణికులు నిలుచుండే వాళ్లు. అక్కడే బస్తా చింపులు పరచి 'స్టార్ బుక్స్'అని రాసి ఉన్న అట్ట బోర్డు పెట్టి యన్.జి.రెడ్డి అనే అతను బుర్ర కథలు, యక్షగానాలు, పంచాంగాలు వంటి పుస్తకాలతో పాటు సోవియట్ ల్యాండ్‌కు చెందిన పుస్తకాలమ్మేవాడు. దేవుల పల్లి ఏడో తరగతి ప్యాస్ కావడంతో హైస్కూల్లో చేరారు. అదే దారి గుండా హైస్కూల్‌కు వెళ్లేవారు.
'అణాలు పోయి నయాపైసలొచ్చాయి' 'కుక్క పిల్లను వెంటబెట్టుకున్న మహిళ' (చెహౌవ్ కథ) అనే చిన్న పుస్తకాన్ని ఇరవై పైసలకు 'స్టార్ బుక్స్'లో కృష్ణమూర్తి కొన్నారు. కొన్నాళ్ళకు 'జమీల్యా' అనే పుస్తకాన్ని పావలాకు కొన్నారు. హెచ్చెస్సీ ప్యాసైన తరువాత ఏడాదికి తహశీలు ఆఫీసులో ఆయనకు ఉద్యోగం దొరికింది. యన్.జి.రెడ్డి బుక్‌షాపు పోస్టాఫీసు వెనుక డబ్బా కొట్టుకు మారింది. దానికి 'స్టార్ బుక్ హౌస్' అని పేరు పెట్టాడు. 'రాళ్ళ వంకీ', నలభై ఒకటవ నాడు, అన్నా కెరీనా, మనకాలం వీరుడు వంటి పుస్తకాలను ఆ షాపులోనే కృష్ణమూర్తి కొన్నారు. హైద్రాబాద్ వెళ్ళినప్పుడు విశాలాంధ్ర బుక్ హౌస్‌కు వెళ్లి పసివాడి పగ, పెద్ద ప్రపంచంలో చిన్న పిల్లవాడు, నొప్పి డాక్టరు, మిత్రుని హృదయం, ఉక్రేనియన్ జానపద గాథలు వంటి ఎన్నో 'రాదుడ' ప్రచురణలను కొన్నారు. విజయవాడ వెళ్లినా, అనంతపురం వెళ్లినా విశాలాంధ్ర బుకహేౌస్కు వెళ్లి ఎన్నో పుస్తకాలను కొన్నారు. అలా కొన్న పుస్తకాలతో తనింట్లో ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
'రాదుగ' ప్రచురణలను ఒకటికి రెండుసార్లు చదువుతుంటే మక్సీమ్ గోర్కీ 'నా బాల్యం' అనే పుస్తకం మూలంగా కృష్ణమూర్తికి తన అనుభవాలను రాయడానికి మార్గం దొరికింది. గోర్కీ ఆత్మకథ 'నా బాల్యం' 'నా బాల్య సేవ' 'నా విశ్వ విద్యాలయాలు' అని మూడు భాగాలుగా వెలువడింది. అందులోని మొదటి భాగం 'నా బాల్యం'. దీని మూలంగానే కృష్ణమూర్తి ప్రేరణ పొందారు. రచనా పథకం విషయంలో కూడా గోర్కీనే అనుసరించారు. తన ఆత్మకథ 'ఊరువాడ బతుకు'ను కూడా నాలుగు భాగాలుగా విభజించారు. 'నా బాల్యం' పుస్తకంలో అక్కడక్కడా సోవియట్ చిత్రకారులు యల్.గ్రీత్చిన్, యల్. కజాయెవ్ గీసిన చిత్రాలున్నాయి. 'ఊరువాడ బతుకు'లో ఏలే.లక్ష్మణ్ గీసిన చిత్రాలున్నాయి. 'నా బాల్యం'లో అక్కడక్కడా పాటలున్నట్లే 'ఊరువాడ బతుకు'లో కూడా సందర్భానికి తగ్గట్లుగా జానపద గేయాలూ, రామదాసు కీర్తనలూ, తత్వాలూ కలుపు తీసేటప్పుడు కూలోళ్లు పాడిన పాటలూ, మగ్గాలు నేస్తూ శ్రమ మరచిపోవడానికి పాడే పాటలూ, తత్వాలూ ఉన్నాయి.
'ఇరుకుగా ఉన్న చీకటి గదిలో కిటికీకి దగ్గరగా నేల మీద మా నాన్న పడుకున్నాడు. తెల్లని దుస్తులు తొడుక్కుని అలాగు పడుకుని వుంటే యెంతో పొడగరిలాగ కనబడ్డాడాయన. కాలివేళ్లు అదొక మోస్తరుగా ఒకదానికొకటి యెడమ యెడమగా వున్నాయి. ప్రశాంతంగా గుండె మీద పెట్టుకునున్న మృదువైన చేతివేళ్లు కూడా కొంకర్లు పోతున్నాయి. కళ్ళ మీద ఉంచిన నల్లని రాగి నాణేలు ఆయన ఉల్లాసపు కళ్ళను కప్పుతున్నాయి. దయతో ఉట్టిపడే ఆయన ముఖం నల్లబారి పోయింది. బిర్ర బిగుసుకు పోయన ఆయన పళ్లు మెరుస్తుండడం చూచి నాకు భయమేసింది.'
ఇలా తన తండ్రి శవం గూర్చి తెలుపడంతో గోర్కీ నా బాల్యం మొదలవుతుంది.
ఇందుకు విరుద్ధంగా
'మోట గొట్టే మొనగాడా
మోటపేరు చెప్పవేమీ?
మోట పేరు మోహనాంగీ - వింటావా జానా
బిల్ల పేరు భీమా రాగం'
నెమ్మదిగా దూరాన మోటగొట్టే దాసరి రాములు పాట- ఊరు పిచ్చుకల కిచకిచలు, కోయిల కుహుకుహూ రవాలు, తొర్రల నుండి బయలుదేరే చిలుక కిలకిలలూ, వీటికి తోడుగా కోడిపుంజుల కూతలు మగత నిద్ర - దుప్పటి కప్పుకొని నిద్ర పోతున్నా అన్నీ వినిపిస్తూ వుండేవి. పొద్దు పొడుస్తుంది లేదా అని అమ్మ దుప్పటి గుంజింది.
'మా అమ్మ ఉత్తర క్రియలు జరిగిపోయిన కొద్ది రోజులకు తాత నాతో అన్నాడు'
''సరే అలెక్సేరు! నా మెడలో నిన్ను వేలగట్టుకు తిరగడానికి నువ్వేమీ అంత అమాయకమైన బంగారు పతకం కాదురా అబ్బారు! నీకు మరి ఇక్కడ ఆశ్రయం సున్న. ఇక నీ బతుకు దెరువు నువ్వు చూసుకోవలసిందే..''
అప్పటి నుండి నా బతుకుతెరువు నేను చూసుకోవడం మొదలుపెట్టాను.
'నా బాల్యం' ముగింపు ఇది.
'1958 ఏప్రిల్ 9న చివరి పరీక్ష మధ్యాహ్నం వరకు అయిపోయింది. అదే రోజు రాత్రి పెండ్లి. అప్పుడు బస్సు లేదు. సైకిల్ కిరాయికి తీసుకున్న. నాకు సైకిల్ తొక్కుడు రాదు. అప్పుడప్పుడు స్నేహితులు సైకిల్ కిరాయికి తీసుకొంటే ఒకటి రెండు చక్కర్లు కొట్టెటోణ్ని. అంతంత మాత్రం తొక్కెటోన్ని. సైకిల్‌ను ఊరి బయటి దాక నడిపించి రాయి చూసుకుని రాయి మీద కాలుబెట్టి సైకిల్ తొక్కడం మొదలు పెట్టిన. చిన్నగా తొక్కుకుంటూ పోయిన. ఏదైనా బస్సు లారీ ఎదురొస్తే దిగి మరల ఎక్కెటోణ్ణి. ఎట్లయితేంది. ఇంటికి చేరుకున్న. ఇంక రాలేదమని ఎదరు చూస్తుండ్రు. వచ్చినందుకు సంతోషించిండ్రు. బయలుదేరి బండ్ల మీద నకిరేకల్ చేరుకున్నం. పెండ్లి అయ్యే వరకు కలికి గాంధారి వేళ అయ్యింది. నా భార్య కమల.
ఇలా 'ఊరు వాడ బతుకు' ముగుస్తుంది.
గోర్కీ 'నా బాల్యం' విషాదారంభమై, విషాదాంతమవుతుంది. అందుకు భిన్నంగా కృష్ణమూర్తి 'ఊరు వాడ బతుకు' సుఖారంభమై సుఖాంతమవుతుంది. గోర్కీ; కృష్ణమూర్తి ఆత్మకథల ముగింపు భిన్నంగా ఉన్నా ఒక విషయంలో ఈ రెండింటికీ పోలిక ఉంది. తాత మూలంగా గోర్కీకి, పెండ్లి కావడంతో కృష్ణమూర్తికి తమ బతుకు తెరువు చూసుకోవలసిన అగత్యమేర్పడుతుంది. గోర్కీ ఆత్మకథలో కల్పనలు లేనట్లే దేవులపల్లి ఆత్మకథలోనూ కల్పనలు లేవు. ఈ రెండింటిలో వాతావరణ చిత్రణ ఉంది కానీ వర్ణనలు లేవు. 'పేరు పెరుమాళ్లది ఆరగింపు అయ్యవార్లది' 'గుడ్డి కొంగకు కొర్రమట్ట దొరికినట్లు' 'ఉత్తుత్తి పుట్నాలు మూడు కుప్పలు పెట్టినట్లు' 'ఎన్నేషాలేసినా కూటికే- ఎన్నేండ్లు బతికినా కాటికే' 'వండని కూడు వడకని బట్ట' వంటి సామెతలు 'ఊరు వాడ బతుకు' లో సందర్భానికి తగ్గట్లున్నాయి.
ౖ'జయమిత్ర' సాహిత్య సంస్థ మూలంగా మొదట మిత్రుడై తరువాత ఏకంగా చుట్టరికం కల్పి అన్నా అని పిలిచిన శ్రీశైలం సలహా మేరకు హౌలీ పండుగ సందర్భంగా పాడుకొనే-
'ఓ సావుకాని ఓ సావుకారి
దొవ్వానిసై దోడు దోడు
పావులిస్తె పాడు పాడు' అంటూ చివర్లో
పది ఇస్తే పక్కకొస్తా
ఇరువాయిస్తే ఇంటికొస్తా
ముప్పాయిస్తే ముండమోస్తరో.... ఓ సావుకారి
అనే పాటను 'ఊరు వాడ బతుకు' లో దేవులపల్లి చేర్చారు. భోన్గిరికి చెందిన డొంకెన శ్రీశైలం సరదా అయిన మనిషి, నటుడు; రచయిత. ఒకవైపు ఆబార్కి పనులు చూసుకొంటూనే నాటకాల్లో వేషం కట్టేవాడు. పులిమామిడి బాల కృష్ణారెడ్డి సారధ్యంలోని 'భారతీయ సాంస్కృతిక సమితి' అనే నాటక సమాజంలో శ్రీశైలం అరవింద శర్మ, బాలయ్య యాదవ్, యాదగిరి, కరెంటు లక్ష్మినారాయణ, కట్టా ముత్యంరెడ్డి వంటి వారు ఉండేవారు. వీరు నాటక ప్రదర్శనలిచ్చేవారు. అదే కాలంలో అంటే తొలి దశ తెలంగాణ ఉద్యమం కన్నా ముందు కాలంలో రచయితలైన పి.లక్ష్మినారాయణ, మూర్తి గారి జనార్థన్, ఎన్.గోపి, మాగంటి రవి, శ్యామాపంత్ రాజగోపాల్, భాను ఒక జట్టుగా తిరిగేవారు. శ్రీశైలం వీళ్లందరి సన్నిహితుడు. లక్ష్మి నారాయణ ప్రోత్సాహం మూలంగా శ్రీశైలం కవితలు రాశాడు. 'అమ్మా' అనే పేరుతో ఆయన కవితా సంకలనం వెలువడింది. కాలం చేసిన ఆయనపై 'యక్షగానం' కథా సంకలనంలో 'తమ్ముడు శ్రీశైలం' అనే శీర్షికతో దేవులపల్లి కథ రాశారు.
ఒక ప్రసిద్ధ రచయిత రచనలచే మరో రచయిత ప్రభావితుడవటం ఎప్పటి నుంచో ఉంది. 'కేయూర బాహు చరిత్రం' రాసిన మంచన పద్యం 'బాల రసాల పుష్ప నవ పల్లవ కోమల కావ్య కన్యకన్'తో పోతన, 'ఎవ్వరి దానవీవు హరిణేక్షణ' పద్యంతో అల్లసాని పెద్దన ప్రభావితులయ్యారు. మార్కండేయ పురాణంలో మారన రాసిన 'ఎచ్చట శోత్రీయుడు ధనమిచ్చునతడు, పారునట్టి ఏరును వెజ్జున్, అనే పద్యం వల్ల స్ఫూర్తి పొంది తన సుమతీ శతకంలో బద్దెన 'అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారు ఏరున్ అనే పద్యం రాశాడు. ఉత్తర హరి వంశం - నరకాసుర వధ ఘట్టంలో 'అరి జూచున్ హరి జూచు చూచుకము లందందు మందారకే' అనే నాచన సోమనాధుని పద్యం చే ప్రభావితుడై భాగవతంలో అదే ఘట్టంలో పోతన 'ఏరుచూచున్ వరు జూచు ఒంపనొలరింపన్ రొషరాగోదయా' అనే పద్యం రాశాడు.
Jonathan Swift-Gulliver’s Travels తో కందుకూరి వీరేశలింగం పంతులు Spectaterతో పానుగంటి Hemingway రాసిన The Old man and the sea చే కేశవరెడ్డి ప్రభావితులైనట్లే గోర్కీ 'నా బాల్యం'తో దేవులపల్లి కృష్ణమూర్తి స్ఫూర్తి పొందారు. తన అనుభవాలనే సన్నటి పోగులతో గిజిగానిలా 'ఊరు వాడ బతుకు' నల్లారు.
- తెలిదేవర భానుమూర్తి, 9959150491