Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చేష్టోక
ప్రయోగమనుకుంటావు
ప్రమోదమనుకుంటావు
ప్రమాదమని తెలుసుకో !
తెలిసిచేసినా
తెలియకచేసినా
తెల్లకాగితమ్మీద అడ్డపు గీత
జవాబు పత్రానికి పనికిరాదు
చేష్టలకు కష్టాలు దాపురిస్తాయి
నిర్మలమైన మనసు
కలతపడి కన్నీరవుతుంది
వెలుగును నిప్పునీడ కాల్చేస్తుంది
అనంతంగా సాగుతున్న దారి
గుంతల్లో పడి
వాహనం బోర్లపడ్డట్టు
ఫుల్ స్టాప్ లేని వాక్యంలో
కామా ఎదురైనట్టు
బింబాన్ని చూసి
ప్రతిబింబం పరిహసిస్తుంది
ప్రాణం ఎంత విలువైనది !
శిఖరమంత దేహానికి ప్రాణం
చిటికెడంత
గాలిలో దీపాన్ని కాపాడు కున్నట్టు
ప్రాణం కాపాడుకోవాలి !
ఇన్నాళ్ళూ ఎట్లా
ఏమీ అనని తను
ఇన్నాళ్ళూ ఎన్నడూ
ఏదీ ముట్టుకోని తను
ఇన్నాళ్ళూ ఎపుడూ ఎవరినీ
నిందించని తను
అనుకోని ప్రయోగం
అనుమానమైంది
పాలను నీరును
వేరు చేసే హంస గొంతుకకు ఉరైంది
కిందపడితే అద్దం
ముక్కలవుతుందని తెలిసికూడా
అద్దాన్ని గాలిలోకి ఎగిరేసి
వేలాడదీయాలనుకోవటమేమిటి?
చలనంలేని చెరువులో
రాయి విసిరితే
తరంగాలు తరంగాలై
త్రాచుపాములై లేస్తాయి!
అందాన్ని చిదిమె హక్కు
ఎవడికీవుండదు !
అందాన్ని
ఆరాధ్యదేవతనుకున్నావు
పూజించాలికదా !
అందాన్ని గౌరవంతో
మురిపిద్దామనుకున్నావు
పునీతం కావాలికదా !
కత్తిరించిన చిత్రమైనా అతుకదన్నప్పుడు
కాటుపడ్డ మనసూ అంతే!
- కందుకూరి శ్రీరాములు