Authorization
Mon Jan 19, 2015 06:51 pm
1. పొద్దున దినపత్రికలో ఓ వార్త కళ్ళకద్దుకుంది
వార్తతో పాటు ముద్రించిన చిత్రం
గుండెల్లో చెరగకుండావుంది
రెండు భుజాలు
నాలుగుకాళ్ళ శకటం -
సంధానిస్తూ నిల్చిన కట్టెకు
చుట్టినచీరగుడ్డలో
కుక్కిన దేహం ఒకటి
కొండ విసిరిన అవరోహణబాణంలా
గుట్టలు,వాగులు మైళ్ళ దూరాలు దాటి
మెడనరాలు నెత్తురుకట్టి మోస్తున్న వాళ్ల
వొంట్లోసత్తువ నేలకంటుతున్నా
ఆ చీకటి ఖండం నుంచి ఆస్పత్రి దాకా
మరణం అంచులయాత్ర భుజం దిగదు
ఏ తీతువ ఎట్లాంటి సందేశాన్ని మూటగట్టుకొస్తుందోనని
ఆరాత్రంతా యాతనతో
మెలకువగా చలిమంటలను కాచుకుకూర్చుంటుంది
దిగులుచెందిన గూడెం
కొండకు పూసిన పుట్టమచ్చలు వాళ్ళు
చికిత్స వారికి గొంతు తడవనిఎండమావి
మౌళికమైనదేది అక్కడ అందని ద్రాక్షే
వాళ్ళబతుకుకొక జీవిత కాలపు శిక్ష
2. కొండ దిగువు,ఎగువులకు మధ్య
ప్రవహించే దుఃఖనది ...డోలి
నాగరిక అనాగరికల మధ్య
నులిమేయబడుతూ ఛిద్రమవుతున్న బతుకుల్ని
అంటుకట్టుకుంటున్న సాలీడు...గూడెం
అన్ని కాలాలు ఒకటే ఋతువైన కన్నీటి కథలా
గుండెలవసిన వాళ్ళవేదన ముక్కలు ముక్కలుగా
చెట్టు చెట్టుకి గుట్టగుట్టకి
రాయిరప్పకి ముడుపుకట్టిన వ్యధ
3. ఉమ్మనీటి తర్పణం కాబడిన వేలయోజనాల నడక
ఏం ప్రయోజనం ప్రకటిస్తుందోనని
పారేసుకున్న వస్తువులా రేపటిపత్రికలో
వెతకక మానదు మనసు
- రాఘవేంద్ర ఈడిగ
సెల్: 9494074022