Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒకప్పుడు కాలం మూడు కాలాల్లోనూ
ఆరు రుచులను పంచుతుండేది
ఇప్పుడు అన్ని కాలాల్లోనూ
విషపూరిత రుచిని పంచుతూ
మనుషులను విగతజీవులను చేస్తున్నది
ఇప్పటికీ అంతుపట్టని రహస్యంలా
మర్రిచెట్టు ఊడలా నేల నలుచెరుగులా పాకి
విహ్వలంగా విలయతాండవం చేస్తున్నది
చెవులకు ఎప్పుడూ వినని
దుర్వార్తలను పంపుతూ ఒణుకుపుట్టిస్తున్నది
ఎవరికివారం ఏకాంత గుహల్లోకి
నిర్ణిద్రలా సుషుప్తిలోకి జారుకున్నాక
ఒంటరిదేహాలతో
కాలాన్ని జుర్రుకుంటున్నాము
అర్రులుచాస్తూ కొనఊపిరితో
ఆగామివసంతానికై కలలుగంటున్నాము
కాలనాళిక పడగల మీద
కొవ్వొత్తిలా కరిగే దీపాలమవుతున్నాము
అంతుచిక్కని విషపరమాణువు
విషపుకోరలతో వికతంగా పంజావిసురుతూ
నిశ్శబ్దంగా మానవదేహాల్లోకి జొర్రబడుతున్నది
ఎడారుల మరీచికలను తలపిస్తూ
బతుకుమీది ఆశలకు మరణశాసనం లిఖిస్తున్నది
గతం కళ్ళముందు కలలా నాట్యమాడినట్లే
ప్రస్తుత పాడుకాలం పీడకలలా వెంబడిస్తున్నది
భవిష్యత్తును అంధకారబంధురంగా మార్చేస్తూ
చెప్పలేని భయమేదో మనముంగిట్లోకి తెస్తున్నది
ఒకప్పుడు కాలం మన చేతుల్లో ...!
ఇప్పుడు దాని విషకౌగిలి బందిట్లో ...!!
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్
సెల్: 9032844017