Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బంగారు ఆచార్యులు గారు పేదవర్గాల మనిషి. నిరుపేదల సమస్యల పట్లా, వారు నిత్యజీవితంలో నిజంగా ఎదుర్కొనే సమస్యలపట్లానే కాకుండా మధ్య తరగతి మందహాసాల వెనుక తారట్లాడే నిజమైన దైన్యానికి గల కారణాల్ని అన్వేషించి పరిష్కార దిశగా ఆలోచింపజేసే దార్శనికత కలిగినవారు. యూనివర్సిటీ డిగ్రీ కొలమానాలు చెప్పుకోదగ్గవి ఏమీ లేనివారు, అయితేనేం ప్రజా పాఠశాలలో మార్క్సిజాన్ని అధ్యయనం చేయడమే కాదు, అనేకమందికి రాజకీయ పాఠాలు నేర్పిన సార్ధక నామధేయులు. ఆచరణ లేని అధ్యయనం గానీ, అధ్యయనం లేని ఆచరణ గానీ రాణించలేవు. మార్క్సిజాన్ని ఓ వైపు అధ్యయనం చేస్తూ, మరోవైపు బోధిస్తూ, ఆచరణ శీలిగా నిరంతరం ప్రజా ఉద్యమాలలో మునిగి తేలుతూ ప్రజా సమస్యలపై తనదైన శైలిలో తనలోని రచయితని మేల్కొల్పి 'పెన్ కౌంటర్' ని సంధించారు.
'పెన్ కౌంటర్' నిజానికి ఒక జ్వలనం, ఆవేశంగా విసిరేసిన అశ్వత్థామ అస్త్రంలా చప్పున చల్లారి పోయేది కాదిది. ఒక ఆలోచనని నిరంతరం రగిలించే ప్రయత్నం. అలాని విస్తతంగా అధ్యయనం చేస్తూ, అప్రతిభులౌతూ, సమస్య మూలాల్లోకి చొచ్చుకుంటూ వెళ్ళిపోయి, ఇంక దారీ తెన్నూ దొరక్క, ఎక్కడ మొదలు పెట్టాలో తెలియక, తెలిసినా కూడా సంతప్తికరంగా సమస్యని ఉపరితలాంశంగా తీసుకురాలేక పోయిన కొన్ని గొప్ప గ్రంథాలతో పోల్చినప్పుడుబీ భేషజాలకు పోకుండా, తనకు ప్రజా వేదికగా దొరికిన సమస్యల నాడి పట్టి, సూటిగా, నిర్భయంగా, నిర్మొహ మాటంగా చెప్పిన 'పెన్ కౌంటర్' ప్రయత్నం ఒక మంచి ముందడుగు. వరదలా వెల్లువెత్తే మీడియా, ఉప్పెనై ముంచెత్తే సమాచార సునామీల వెల్లువలో ఈ రోజు అధ్యయనానికి కేటాయించుకునే సమయం కుదించుకుపోయి, కశించి పోవడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలోకూడా, పీడీఎఫ్ భాండా గారంలో జీబీల కొద్దీ పుస్తకాలు పేరుకు పోతున్నప్పటికీ కూడా, ఇప్పటికీ పుస్తకం హస్త భూషణమై అలరారు తుండటం ఒక గొప్ప సొలేస్!
పెన్ కౌంటర్ ఇరవైమూడు వ్యాసాల సంకలనం. నిడివి రీత్యా చూసినా, విషయ ప్రాముఖ్యత దష్ట్యా చూసినా శైలీ పరంగా చూసినా యీ వ్యాస సంపుటి చదవరుల్ని ఇట్టే ఆకర్షిస్తుంది. ముఖచిత్రమ్ లో బాణం ఎక్కుపెట్టి ఉన్న విలుకాడు ఎటువైపు సంధించాడో చెప్పేలా లేదు గానీ బాణం ములుకులో ఉన్న పదునైన పాళీ ఆ విషయం చెబుతోంది. సామాజిక రుగ్మతల పట్లా, ప్రభువర్గాల అలసత్వం పట్లా, అంతులేని శ్రమ దోపిడీ పట్లా, అక్రమార్కుల అనైతిక సంపదల పోగువేత పట్లా, సమాజాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టిస్తున్న అవినీతి పట్లా, లంచమే లాంఛనమై సగటుమానవుడి మూలుగుల్ని పీల్చి పడగలెత్తి కోరలు చాస్తున్న అసంబద్ధ దుష్ట దోపిడీ సంస్కతి పట్లా ప్రతిఘటించి నిలబడాల్సిన అవసరాన్ని ''పెన్ కౌంటర్'' నొక్కి వక్కాణించింది.
ఇందులో రైతుల ఈతిబాధలున్నారు, మట్టి మనుషులను అయిపుట్టినవాడూ ఎలా కాల్చుకుతింటున్నాడో, ఆరుగాలం శ్రమిస్తూ డాక్టర్నీ, ఇంజనీర్నీ, శాస్త్రవేత్తనీ, పారిశ్రామికవేత్తనీ, ప్రభుత్వాన్నీ తీర్చిదిద్దిన ఆ మట్టి మనిషి చివరికి వారి చేతిలోనే ఎలా దగా పడుతున్నాడో చెప్పారు ఆచార్యులు గారు. అన్నం పెట్టిన వాడికి గిట్టుబాటు ధర ఇవ్వలేని, నాణ్యమైన విత్తనం ఇవ్వలేని, నాణ్యమైన ఎరువులుగానీ పురుగుమందు గానీ ఇవ్వలేని వీరు నాణ్యమైన ఉరితాడుని ఎలా యిస్తున్నారో చెప్పే ప్రయత్నం చేశారు ఈ వ్యాసాల్లో.
భూ సమస్యల పట్లా, రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారం దిశగా, ఎల్.ఆర్.ఎస్ ప్రక్రియ లో ఉన్న అవకతవకలపై సాధికారికంగా విశ్లేషించారు. ఆరోగ్యం విషయమై, భ్రూణ హత్యలపై, మద్యపానం పై, మిడిల్ క్లాస్ పై రాసిన వ్యాసాలు ఆలోచన రేకెత్తిస్తాయి. పిల్ల జమీందారు, మీది తెనాలి మాది తెనాలి, అమ్మా నాన్నలకు లేఖ, ఏది న్యాయం లాంటి ఇతర రచనల్లో రచయితలో దాగున్న కథకుడు తొంగి చూస్తాడు! ఇవి చదవరుల్ని ఇట్టే కట్టి పడేస్తాయి. యింకా ఇతర రచనలు సైతం తన సామాజిక దక్కోణంతో తరచి చూసి ఏం చేస్తే ఈ సమస్యలు పరిష్కరించబడతాయో చెప్పే ప్రయత్నం చేశారు రచయిత.
జాతీయ స్ఫూర్తి సంపాదకులు వర్మ గారే కాకుండా అరసం ప్రముఖులు కూడా ఈ వ్యాస సంపుటి గురించి చక్కని అభిప్రాయాలను తెలియజేశారు. ఈ పుస్తకం త్వరలో ఆంగ్లంలోనూ, హిందీలోనూ కూడా అనువాదాలు చేసుకోబోతోంది.
- వి.విజయకుమార్
సెల్: 8555802596