Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఒక కొడుకు డాక్టర్‌గా కరోనా రోగులకు సేవలందిస్తుంటే, ఇంకో కొడుకు కరోనాకు గురై క్వారెంటైన్లో కోలుకుంటుంటే ఒక తండ్రి మనసు ఎలాంటి అలజడికి గురయ్యుంటుంది? కవిగా ఆ తండ్రి హదయం ఎలా స్పందిస్తుంది? అట్లాంటి కవిత్వ స్పందనే కోవిడోపాఖ్యానం. ఆ తండ్రి, కవి హర్షవర్ధన్. కరోనా లాక్డౌన్ అనే కొత్త జీవితాన్ని మానవాళికి పరిచయం చేసింది. అట్లాంటి విపత్కర పరిస్థితుల్లో సమాజాన్ని చూసి స్పందించిన కవి హదయమే 'కోవిడ్ నానీలు' సంపుటి.
ఆదిమమానవుడిగా అడవుల్లో మొదలైన మనిషి ప్రస్థానం వైజ్ఞానికంగా, శాస్త్రీయంగా ఎంతో వికాసం, పరిణామం చెందుతూ నేడున్న దశకు చేరుకుంది. ఈ పరిణామక్రమంలో మనిషి ఎంతో ఎత్తుకు ఎదిగినా తన జీవనానికి, జీవితానికి మూలభూతమైన ప్రకతిని నిర్లక్ష్యం చేయసాగాడు. ప్రకతి వికతరూపం దాల్చడం మొదలుపెట్టింది. మనిషి విపత్కర పరిస్థితులకు ఎదురొడ్డాల్సొచ్చింది. గడచిన దశాబ్దంలోనే ఎన్నో ప్రకతి ఉత్పాతాలను చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు సరికొత్తగా ఈ కరోనా మహమ్మారి. ఒక సూక్ష్మక్రిమి మానవాళిని ఎంతగా వణికించిందంటే, ఇన్నాళ్ళుగా సష్టిలో తానే తెలివిమంతుడనుకున్న మనిషిని మూతి మూసుకుని మాస్క్ తొడుక్కోమంది. వేసే ప్రతి అడుగుని శానిటైజ్ చేసుకుని శుభ్రపరుచుకోమంది. బహుశా మానవాళి మొత్తం భగవంతుని తర్వాత ఎక్కువగా జపించిన నామం 'కరోనా'నే అయ్యుంటుంది. ఈ మహమ్మారి జన జీవితాన్ని భయోత్పాతాలకు గురిజేసింది. స్తంభింపజేసింది. అతలాకుతలం చేసింది. ఎక్కడ చూసిన దయనీయ స్థితే. శ్మశానవైరాగ్యమే.
''ఒకప్పుడు
ప్రసూతిశ్మశాన వైరాగ్యాలు
ఇప్పుడంతటా
కరోనా వైరాగ్యమే''
ఆ దయనీయ స్థితిని, శ్మశాన వైరాగ్యపు కాలాన్ని చూసిన కవి హదయస్పందనే ఈ 108 నానీల సంపుటి. లాక్డౌన్ ఆపత్కాలంలో రోజువారీ జీవిక కోసం దినసరి కూలీ పడే వేదన, అల్పాదాయ వర్గాలు పడ్డ యాతన కనిపిస్తాయి. ఇక వలసకూలీల దీనస్థితి చెప్పనలవి కాని విషయం.
''ఊరి నుండి
ఆకలి తరిమితే
చావు భయం
ఉన్న వూరికి చేర్చింది'' పొట్ట చేతబట్టుకుని జీవిక కోసం ఎక్కడెక్కడికో వలస వెళ్ళిన మనిషి ఈ మహమ్మారి భయానికి కన్న ఊరు పయనమయ్యాడు. అలా వేలమంది కార్మికులు కాలిబాట పట్టారు. వేలమైళ్ళు నడిచారు. ఆధునిక నాగరిక సమాజం భయంతో, బాధతో, సిగ్గుతో గుర్తుంచుకోవాల్సిన చారిత్రిక సంఘటన ఇది.
''వలసజీవుల
స్వేదాశ్రువులో
రాదారులన్నీ
ఉప్పుసముద్రాలే''
లాక్ డౌన్ సమయంలో రాదారులన్నీ వలస కార్మికుల కాలిప్రయాణాలతోనే కనిపించాయి. వాళ్ళ చెమటకన్నీళ్ళతో రాదారులన్నీ ఉప్పు సముద్రాలయ్యా యనడం కవి గాఢ అభివ్యక్తిని, ఆర్ద హదయాన్ని పట్టిచూపుతుంది. ఇలాంటి నానీలెన్నో కనిపిస్తా యిందులో. అంతే కాదు దిగులుగా ఉన్న మనసులకు కాసింత ఊరట కలిగించటానికి వ్యంగ్య, విషాద హాస్యాన్ని అందించాడు.
''పెళ్ళికి పిలిస్తే ఒక దండం
పిలవకుంటే/ వంద దండాలు''
''ఆన్ లైన్ పాఠాలు/ పిల్లలకైతే
విషమ పరీక్షలు/ మేష్టార్లకు''
ఈ నానీలను చదవగానే కరోనా సమాజపు జీవనసరళిలో తెచ్చిన మార్పు, ఆ మార్పు తాలూకు సున్నితపు విషాదాన్ని కవి ఎంత వ్యంగ్యాత్మకంగా చెప్పాడో అర్థమవుతుంది. ఇందులో ప్రధానంగా విషాద హాస్యమే ఉన్నా కవి తుదకు ఆశావాహ సందేశాన్నే అందించాడు.
రోగం సగమే
మిగతాది భయం
ధైర్యమే
జీవికి అభయం
ఈ సంపుటి మొత్తం కవి కవిత్వంతో నిండినా, అతని ఇద్దరు కొడుకులు తమ స్వానుభవాల్ని ఇందులో పొందుపరచడం ఈ పుస్తకానికి మరింత బలాన్ని చ్చింది. పెద్దకొడుకు అమెరికాలో డాక్టర్. కోవిడ్ ప్రబలిన తొలిదశలో తను పనిచేస్తున్న ఆస్పత్రిలో కళ్ళముందే రోజుకు పదుల మంది మత్యువాతకు బలవడం చూశాడు. విద్యుక్తధర్మం పాటిస్తూ ఎలాంటి చికిత్స చేయాలో కూడా తెలియని దయనీయ పరిస్థితుల్లో సేవలందించాడు. రోగం దష్టిలో అందరూ సమానమే అయినా చికిత్స విషయంలో మాత్రం ఆర్థిక అసమానతలుంటాయన్న చేదు నిజాన్ని తాత్వికంగా చెబుతాడు. చిన్న కొడుకు హైదారాబాద్ లో కోవిడ్ లక్షణాలతో చిన్నగదిలోకి సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్ళిపోయాడు. కోవిడ్ బారిన పడి మత్యువాతకు లోనయిన వారి కుటుంబాల దయనీయ స్థితి గురించి మాట్లాడతాడు. కడసారి చూపుకైనా నోచుకోలేని దుర్భర పరిస్థితిని కరోనా కలిగించిందని వేదన చెందుతాడు. మన ముందు తరాలవాళ్లు ప్రపంచ యుద్ధాలు, మరెన్నో ప్రాకతిక ఉత్పాతాలను చూసి ఉన్నారు. కానీ ఇప్పుడున్న తరం ఎదుర్కొన్న అతిపెద్ద ఉత్పాతం కరోనా అని ఐనా మానవాళి సమర్థంగా ఎదుర్కొని నిలబడుతుందని ఆశావాహ దక్పథంతో సాంత్వన వచనాలు పలుకుతాడు.
కరోనా మీద కవిత్వం పుంఖానుపుంఖాలుగా వచ్చినా సమాజంలోని, జీవితంలోని భిన్న పార్శ్వా లని కవిత్వమయం చేసిన 'కోవిడ్ నానీలు' గుర్తుంచుకోదగ్గ సంపుటి. డా. ఎస్. రఘు తన ముందుమాటలో చెప్పినట్టు ఈ సంపుటి నిజంగా నానీల వాక్సినేషనే.
- రాపోలు సీతారామరాజు (ద.ఆఫ్రికా)