Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''భూమి తనచుట్టు తాను తిరుగుతూ సూర్యుని చుట్టు తిరిగినట్టే, కవిత్వం తనచుట్టు తాను తిరుగుతూ జీవితం చుట్టు తిరుగుతది... జీవన సుగంధాలు వెదజల్లే తల్లిపాల వంటిది కవిత్వం... మనసు పొరల్లోంచి ఉబికే చెమ్మ కవిత్వం... జీవితంలోని ఆర్ద్రతను అందిపుచ్చు కోవటమే కవిత్వ రహస్యం.. జీవితంలో సకలా నుభవాలను అక్షరాల్లోకి వొంపే అపురూప దశ్యం కవిత్వం... మనిషిలోని మనిషితనాన్ని మేలు కొల్పేదే కవిత్వం.''
ఇవి వివిధ కవుల గ్రంథా లకు నందిని సిధారెడ్డి రాసిన ముందు మాటలలో కొన్ని మాటలు. సిధారెడ్డి పీఠికలు చదవా లంటే ఈ అందరు రచయితల పుస్తకాలు సేకరించనక్కరలేదు. ఆ శ్రమకోర్చి, సేకరించి, 'నూరు పూలు''గా కూర్చి, సంపాదకత్వం వహించి, డా|| బెల్లంకొండ సంపత్‌కుమార్ మనకందించి తెలుగు సాహిత్యానికి మేలుచేసిండు. మనం ఈ నూరుపూల పరిమళాలను ఆఘ్రాణిస్తే చాలు.
ఒక పుస్తకానికి ముందుమాట రాయాలంటే సిధారెడ్డి ఆ పుస్తకమంతా చదువుతడు. పుస్తకం అంతరంగాన్ని శోధిస్తడు. కవి హదయాన్ని ఆవిష్కరిస్తడు. ఈ నూరుపూలు చదివితే మనకు కవిత్వం పట్ల అవగాహన పెరుగుతది. కవి అంటే గౌరవం పెరుగుతది. కవిగా ఉండేవానికి బాధ్యత పెరుగుతది.
నందిని సిధారెడ్డి కవిత్వాన్ని ప్రేమిస్తడు. కవిత్వం ఇచ్చే తప్తే వేరంటడు. ఆయన మాటల్లో ''డబ్బు సంపాదించినప్పుడు మన చుట్టూ మిత్రులు ఉంటరు. వాళ్లు డబ్బునే ప్రేమిస్తరు. పదవిలో ఉన్నప్పుడు మన వెంట మనుషులుంటరు. వాళ్లు పదవినే ప్రేమిస్తరు. కానీ కవిత్వం రాసినప్పుడు మన చుట్టు మిత్రులుంటరు. వాళ్లు మనుషులను ప్రేమిస్తరు. విలువలను ప్రేమిస్తరు. కవిత్వాన్ని ప్రేమిస్తరు. మనలనూ ప్రేమిస్తరు. కవిత్వం ఇచ్చే సంస్కారం అదే. కన్నీళ్లను తుడిచే కనికరం కవిత్వం. ఆందోళనలను తుడిచే ఆత్మ విశ్వాసం కవిత్వం.''
సిధారెడ్డి కవిత్వం ఎలా పుడుతుందో చెప్తాడు. ''మనిషికి భావుకత వరం. ఆ భావుకతే కవిత్వ కళకు స్థావరం. స్థానికత, భావుకత సమన్వయం పొందిన చోట కవిత్వం ప్రాణశోభిత మవుతుంది.
ఊహసాగి అక్షర రూపం పొందినప్పుడు కవిత్వం అంకురిస్తుంది. అనుభవం పదాల్లోంచి ప్రవహించి హదయపు అంచులను తాకినపుడు కవిత్వం సంచలనం కలిగిస్తది.'' అంతేకాదు కవిత్వం ఎక్కడినుంచి వస్తుందో కూడ చెప్తాడు. ''స్వచ్ఛమైన కవిత్వం జీవితంలోంచి వస్తుంది. మనసు పుండుపుండోలె పండినప్పటి అసాధారణ నొప్పిలోంచి వస్తుంది. కాలుగర్ర వడ్డ నాగటెద్దు నాడిలోంచి వస్తుంది. రెండు చేతులా వరినారు బరువుతో వొరం మీద నడుస్తున్న జానపద స్త్రీ కంఠ స్వరంలోంచి వస్తుంది. పొయ్యి ముందు కూచుని వలపోస్తున్న తల్లి పొగకళ్ల నుంచి వస్తుంది.''
ఎవరూ అంతగా గమనించని దశ్యాల్ని అందుకోవటంలోనే 'కవితన'ముంటుందని, కవి అక్షరం సాదాసీదాగా కనిపించినా కొత్త కొత్త జీవన పరిమళాలు విరిజమ్ముతుంటుదని కవి ప్రత్యేకతను చాటుతడు. కవి ''వరిచేన్ల మీంచి వచ్చే కమ్మటి గాలి వలె కవన స్పర్శయి తాకుతుంటడు. తొలిగాయం మీద పొటమరిస్తున్న నెత్తుటి బొట్టయి బొటబొట కారుతుంటడు. తాజా జీవనానుభూతులతో అలయి బలయి తీసుకుంటడు'' అని కవి స్వభావాన్ని చెప్తడు. ''కవి తన జీవితంతో పాటు అందరి జీవితాల్ని జీవించాల్సి ఉంటది'' అని కవి బాధ్యతను తెలియజేస్తడు. సంక్షిప్తత, సమగ్రత సిధారెడ్డి వాక్యాల లక్షణం. ''ఎక్కడా తేలిపోకుండా, జారిపోకుండా, ఏ గాలికి కొట్టుకుపోకుండా, రాత్రికి రాత్రి దిక్కులు మార్చకుండా దేబిరించకుండా, ఎప్పుడూ వెలితి పడకుండా, లేకి పడకుండా నిత్యం తడితడిగా ప్రాణవీచికలో కవిత్వయాత్ర చెయ్యడం శివారెడ్డికే సాధ్యమయింది'' అని ఒక్క వాక్యంలోనే కె. శివారెడ్డి మూర్తిమత్వాన్ని ఆవిష్కరిస్తడు.
'ఎరుపెక్కిన పత్తిపూలు' గురించి ''శివప్రసాద్ ఇంటిపేరు పత్తి. రైతును ముంచిన పంట పేరు పత్తి. అక్షరాలు రాసే పాళి పేరు పత్తి'' అని, 'గాయాలెన్నైనా' కవిత్వాన్ని రాసిన పొద్దుటూరి మాధవీలత గురించి ''కుటుంబం బతకడానికి బట్టలు కుడుతుంది. వ్యక్తిత్వం బతకడానికి అక్షరాలు కుడుతుంది. బట్టలు కుడితే భద్రత. అక్షరాలు కుడితే ఆర్ద్రత... భావాలు కత్తిరించి, భావనలు జోడించి, అలంకారాలు చేర్చి, అందమైన ఆకతి రూపొందించే పనితనం ఆమెది. ఒక రకంగా కవిత్వం హదయాలను కలిపి కుట్టే కళ'' అని వత్తినీ, ప్రవత్తినీ, కవిత్వాన్నీ, వ్యక్తిత్వాన్ని ఏకకాలంలో ఆకట్టుకునేలా చెప్పడం సిధారెడ్డికే సాధ్యం. 'దండెడ' ను విశ్లేషిస్తూ ''దండెడ పాతాళంలోంచి నీళ్లెట్లా తోడేదాకా వదులదో బాలయ్య జీవితం అడుగు నుంచి కవిత్వం తోడే దాకా నిద్రపోడు'' అని, 'ఉద్యమం దిద్దిన అక్షరం' గురించి రాస్తూ - తెలంగాణలో కవి ఒక భుజం మీద కవిత్వం మోస్తూ మరొక భుజం మీద ఉద్యమాన్ని మోస్తుంటడు. ఆర్ద్రత ఎంతో తీవ్రత అంత. సాహిత్యం ఎంతో సమాజం అంత. పద్యం ఎంతో ఉద్యమం అంత'' అని చెప్తడు.
కవిత్వం ''దేన్నో మరిపిస్తది. దేన్నీ మరువనియ్యది. ఏదో విడిపిస్తది. ఏదో విడువనియ్యది. ఎక్కడో నిలుపుతది. ఎక్కడా నిలువనియ్యది'' అని గులాబీల మల్లారెడ్డి కవిత్వాన్ని అంచనా కడడు. 'మట్టిపాట' పల్లె జీవన శతకంలోని ''కవిత్వం జీవంతో తొణికిస లాడుతున్నది. చదివినకొద్దీ చదవాలనిపిస్తున్నది. విన్న కొద్దీ వినాలనిపిస్తున్నది. ఎటు వెళ్లినా వెంటాడుతున్నది. మంచి కవిత్వానికి ఇంతకన్నా ఏం కావాలి?'' అని ఏనుగు నరసింహారెడ్డి కవిత్వ లక్షణాన్ని చెప్తడు. 'తెలంగాణ పల్లెపాట'కు రాసిన ముందుమాటలో ''పల్లె పాటల సోయగాలు పంటచేన్ల మీద తేలియాడుతుంటాయి. పని పనికీ పాట. మనిషి అలిస్తే కలిస్తే చలిస్తే మహత్తర పాట. పల్లెలు పాటల ముల్లెలు'' అని పల్లెకూ పాటకూ ఉన్న అనుబంధాన్ని విశదీకరిస్తడు. సిధారెడ్డి రాసే ప్రతి వాక్యంలో కవిత్వముంటది. ముందుమాటలకు పెట్టిన కవిత్వమే తోడు, మనిషి పూచిన కవిత్వం, మనిషి జాడల కవిత్వం, ఆశలు పూసే కవిత్వం, బతుకు వాసన గుబాళించే కవిత్వం, జీవితం దిద్దిన అక్షరం, కవిత్వమై వెలగాలని మొదలగు శీర్షికల్లో కూడ కవిత్వం గొప్పతనముంటుంది.
ఆయా కవుల కవిత్వాన్ని మదింపు చేయడానికి సిధారెడ్డి ఉదాహరణగా పేర్కొన్న పంక్తుల్లో ''గుట్టల మీంచి దూకే జలపాతం తిరిగి తిరిగి అడవికి వడ్డాణమైంది''. ''ఉదయించిన సూర్యున్ని బొట్టుగా పెట్టుకొని తన ముఖాన్ని చూసుకొని మురిసిపోయింది ఊరు'' వంటి - నిండా కవిత్వం నిండినవి ''కడివెడు నీళ్లకు కరువుగాని, కన్నీళ్లకేం కొదువ? అవిసిపోతున్న గుండెలకు ఆదరణ కరువు గాని, ఆగిపోయిన గుండెలకేం కొదువ?'' వంటి హదయాన్ని ద్రవింపజేసేవి, ''ప్రపంచం మన గుప్పిట్లో ఒదిగినా, ఆ ప్రపంచంలో మనిషి కనిపించడం లేదు'' అని మనిషి మాయమౌతున్న తీరును తెలియజేసేవి, ''కాలుష్యం కాసారమై నిండుకుంటే మొక్కలు కన్నీరు పెడతాయి-పూవులు అగ్నిప్రవేశం చేస్తాయి.'' నేటి పర్యావరణ స్థితిని తెలియజెప్పేవి, ''భూమి అంటే బుక్కెడన్నం కలిపి పెట్టే అమ్మరా'' వంటి చైతన్యాన్ని నింపేవి-ఎన్నో కవితలు, వాటికి సిధారెడ్డి చెప్పిన వ్యాఖ్యానాలు మనిషిని మేల్కొల్పుతాయి.
ఈ 'నూరు పూలు' - కవిత్వం ఎలా ఉండాలో చెప్పే విజ్ఞాన సర్వస్వము, కవిత్వం ఏమిస్తుందో చెప్పే వికాస వేదిక.
ఈ 'నూరు పూలు' కవితా సౌందర్యాన్ని అలముకున్నరు. మానవతా గంధాన్ని పులుముకున్నరు. పరిశోధనాస్థాయి నందుకున్నరు. తెలుగు సాహిత్య నందనవనంలో ఈ 'నూరు పూలు' ఎప్పటికీ పరిమళిస్తూనే ఉంటరు.
- ఎ. గజేందర్ రెడ్డి,
సెల్: 9848894086