Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ జర్నలిస్టు, రచయిత, కవి తెలకపల్లి రవిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుకు ఎంపిక చేసింది. పాత్రికేయులుగా వారు చేసిన కృషికి గాను ఈ అవార్డును ఇవ్వనున్నారు. రాజకీయ విశ్లేషణ, సమగ్ర చర్చ, సంపాదకత్వం, అనువాదం, నిఖార్సయిన జర్నలిజం, వ్యాఖ్యానంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధులుగా పేరుపొందిన రవిగారు వామపక్ష సైద్ధాంతిక నిబద్ధతతో అంకితభావంతో క్రమశిక్షణతో పని చేస్తూ పాఠకుల అభిమానాన్ని చూరగొన్నారు.
ఎలక్ట్రానిక్ మీడియాలో, జాతీయ చానళ్ళలో చర్చలలో పాల్గొంటూ, సద్విమర్శలను తనదైన శైలిలో ఎక్కుపెడుతూ శాస్త్రీయ విశ్లేషణ చేస్తారు. రాతల్లో మాటల్లో బలహీన వర్గాల పక్షాన వారి గాథల్ని, బాధల్ని వినిపించే అక్షర స్వరం తెలకపల్లి.
పాత్రికేయ రంగంలోనేకాక సాహితీవేత్తగా, విమర్శకుడిగా, కథకుడుగా, కవిగా సుపరిచితులయిన రవి ఉమ్మడి రాష్ట్రంలో సాహితీ స్రవంతి అధ్యక్షులుగా, ప్రజాశక్తి పత్రికకు సంపాదకులుగా, సాహితీ ప్రస్థానం మాసపత్రికకు సంపాదకులుగా పని చేశారు. ప్రముఖ కమ్యూనిస్టు టి.నర్సింహయ్య, లక్ష్మమ్మలకు 1956లో కర్నూలులో జన్మించిన రవి పత్రికా రంగంలో, సాహిత్య రంగంలో విశేష కృషి సల్పారు. వీరితో పాటు ప్రసిద్ధ రచయితలు 1) శ్రీకాకుళానికి చెందిన స్వర్గీయ కాళీపట్నం రామారావు (కారా మాస్టర్), 2) గుంటూరుకు చెందిన కత్తి పద్మారావు (అభ్యుదయ సాహిత్యం) 3) వైయస్సార్ జిల్లాకు చెందిన రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి (సాహిత్యం), 4) అనంతపురం జిల్లావాసి బండి నారాయణస్వామి (సాహిత్యం), 5) వైయస్సార్ జిల్లా వాసి కేతు విశ్వనాథరెడ్డి (సాహిత్యం), 6) గుంటూరుకు చెందిన కొనకలూరి ఇనాక్ (సాహిత్యం), 7) గుంటూరుకు చెందిన లలితకుమారి (ఓల్గా) (సాహిత్యం), పాత్రికేయులు 1) చెన్నైకు చెందిన పాలగుమ్మి సాయినాథ్, 2) కృష్ణా జిల్లాకు చెందిన ఏబికే ప్రసాద్, 3) గుంటూరుకు చెందిన స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు, 4) గుంటూరు వాసి స్వర్గీయ షేక్ ఖాజా హుస్సేన్ (దేవీప్రియ), 5) పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన స్వర్గీయ కె.అమర్నాథ్, 6) కడపకు చెందిన కార్టూనిస్టు సురేంద్ర, 7) కర్నూలుకు చెందిన తెలకపల్లి రవి, 8) అనంతపురం వాసి ఇమామ్ లతో పాటు వివిధ రంగాలకు చెందిన 63 మందికి ఈ అవార్డులను అందిచనున్నారు.