Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇక్కడ పుట్టిన ప్రతి కవి పూర్వ కవుల మార్గాన్ని అనుసరిస్తూ తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. ఆ కోవలోనే ఉత్తరాంధ్ర మాండలికాన్ని పూర్తిగా ఒడిసిపట్టుకుని విభిన్న కథా సాహిత్యాన్ని రాస్తున్న మరో రచయిత చింతకింది శ్రీనివాసరావు. కథ, నవల, నాటకం, వ్యాసం, నానీలు ఏదైనప్పటికీ తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకొని సాహితీ లోకంలో ధవతారగా వెలుగొందుతున్నారు. చింతకింది కలము నుండి అనేక రచనలు జాలువారాయి. ఏ రచన చూసినా, అందులో ఉత్తరాంధ్ర పలుకుబడులకు పెద్ద పీట వేస్తారు. కళింగాంధ్ర ప్రజల వ్యవహారశైలి, సాంప్రదాయాలు, ఆచారాలతో రచనలు నడుస్తాయి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, పీడనలు, వేధింపులు ప్రస్తావిస్తూ తనదైన శైలిలో పరిష్కార మార్గాలను సూచిస్తూ ఆయా రచనలు కొనసాగడం విశేషం. అగ్రవర్ణ ఆధిపత్య భావజాలం, చాతుర్వర్ణ వ్యవస్థ, భూస్వామ్యుల అమానుషత్వాలు, అస్పశ్యత మొదలగు అంశాలను స్పశిస్తూ చింతకింది రచనలు ముందుకు పోతాయి. ఆయా కథల్లో పాత్రల ఎంపిక, శైలీ నిర్మాణము, హాస్యం, చమత్కారం, క్లుప్తత, సంభాషణ సౌందర్యం, పాత్రల నిడివి పాఠకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అంతేకాదు ఉత్తరాంధ్ర ప్రజల అమాయకత్వం, మొరటుతనం మేళవిస్తూ కథలు కొనసాగించడం చింతకిందికి కొట్టిన పిండి. నైతికత, మానవీయతకు కట్టుబడే జనం ఉత్తరాంధ్ర జనం. వారి బలహీనతలను అక్కసుగా తీసుకుని మోసగించే మోసగాళ్ల వ్యవహారశైలిని ఈ కథలు అద్దం పడతాయి.
ఇటీవల చింతకింది 'ఉడుకు బెల్లం' అనే కథా సంపుటిని రాశారు. అందులో నాలుగైదు కథలను ముచ్చటిద్దాం.
ఈ కథా సంపుటిలో ఒక విలక్షణమైన కథ 'ధారపాలెం మెజార్టీ'. ఇది ఒక ఫాంటసీ కథ. ఈ వస్తువు ఊహే కవి చమత్కతికి ప్రతీకగా నిలుస్తుంది. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ ప్రజలు ఏం చెప్తే అది అమలు చేయడం. ఆ విధంగానే ధారపాలెం ఊరి మునసబు, కరణము, ప్రెసిడెంట్ తీర్పులు చెబుతారు. పోలిపల్లి రవణమ్మ మొగుడు పారన్నాయుడుకి ఉన్నట్టుండి రెండు చేతులకు అదనంగా మరో రెండు చేతులు మొలుస్తాయి. దాంతో రవణమ్మ గాబరా గాబరాగా పూజారి దగ్గరికి వెళ్లి విషయాన్ని చెబుతుంది. పూజారి గ్రామసభ పెట్టిస్తాడు. గ్రామ పెద్దలందరూ పుట్టిన రెండు చేతుల్ని నరికి వేయమని తీర్పు చెబుతారు. ఈ నిర్ణయం మెజారిటీ ప్రజలు నిర్ణయంగా అభివర్ణించుకుంటారు. ఆ మరుసటిరోజు ఉదయాన లేచి చూసేసరికి ఊర్లో ఉన్న మగాళ్ళందరికీ రెండేసి చేతులు అదనంగా పుడతాయి. మరలా గ్రామసభ పెడతారు. మాతో సహా అందరికీ నాలుగు చేతులు ఉన్నాయి కాబట్టి, పారన్నాయుడు రెండు చేతులు మళ్లీ అతికించమని తీర్పు చెబుతారు గ్రామ పెద్దలు. బంకతెచ్చి నరీకీసిన పాత చేతులను అతుకుతారు. వీళ్ళ తీర్పులకి కోపగించిన రవణమ్మ పగ తీర్చుకోవాలనుకుంటుంది. ఆ క్రమములో అందరికీ భోజనాలు ఏర్పాటు చేసి, ఆ భోజనాల్లో మత్తుమందు కలుపుతుంది. అందరూ మత్తులో ఉండగా రవణమ్మ గొడ్డలి పట్టుకొని అదనంగా ఉన్న అందరి రెండు చేతులను నరికేస్తుంది. అప్పుడు రక్తపు మడుగులో ఉన్న అందరూ లబోదిబోమని అంటారు. రమణమ్మ అంతు చూస్తామని ప్రగల్భాలు పలుకుతారు. పూజారి మాత్రం ఒకడికో న్యాయం, ఒకడికో న్యాయం చెప్పే ఊర్లో బతకలేనని తట్టాబుట్టా సర్దుకుని ఎక్కడికో వెళ్ళి పోతాడు. మహంకాళిలా అందరికీ అగుపిస్తుంది రవణమ్మ. 'ఏట్రా మీ మెజాల్టీ, పదిమంది ఎదవులు ఏటి పేల్తే అదే మెజాల్టీయా. బుర్ర తక్కవ దగుల్బాజీలందరూ కలిసెస్తే అది మెజాల్టీయా. అలగయితే నంచాలు తీనీవోళ్ళు నంజేసాలు ఏసీవోళ్ళు, ఈ దేశాన మెజాల్టీ మీదున్నారు. అలాగని ఆ నంచాల్నీ ఆ ఏసకాలన్నీ సట్టం సేసీగల్దువా'. అని అగ్గిమీద గుగ్గిలమై ఆ ఊరి మెజారిటీ తీర్పు ఇచ్చే పెద్దల గోచీలూడగొడుతుంది రవణమ్మ.
'సంగతి చెప్పిన సత్యవతక్క' కథ విభిన్నంగా నడుస్తుంది. రోజూ పాసింజర్ రైల్లో అప్ అండ్ డౌన్ చేసినవారి భావోద్వేగాలను దగ్గరగా చూసిన వ్యక్తిగా కవి కనబడతాడు. ఓ మహానుభావుడు తన ఊరిని ఉద్ధరించాలని ఆ వూరిలో ఖాళీగా తిరుగుతున్న కుర్రాళ్లకు బిఎస్ఎన్ఎల్ సంస్థలో లైన్ మెన్ ఉద్యోగాలు ఇప్పిస్తాడు. కానీ ఠికాణా లేని కుర్రకారు జేబుల్లో జీతం డబ్బులు పడేసరికి వ్యసనపరులుగా మారతారు. దాంతో రోజూ తాగేసి వచ్చి వాళ్ల పెళ్ళాలను చితకబాదుతారు. 'డబ్బు ఉంటే ధైర్యం వస్తుంది. డబ్బు ఉంటే సాహసం హెచ్చుతుంది. డబ్బుంటే పోతరం పెరుగుతుంది' అన్న సత్యవతక్క మాటల్లో వాస్తవం ఉంది. ఒకరోజు సిగటా వెంకన్న తాగి తాగి కన్నుమూస్తాడు. మరో వారానికి కుప్పాల అప్పలరాజు కిడ్నీ జబ్బుతో కాలం చేస్తాడు. పోతే పోయారు గానీ వీళ్ళిద్దరూ అయిన వాళ్ళకి గొప్ప మేలు చేసేసి పోయారు. పిఎఫ్, గ్రాట్యూటీ రూపంలో బోలెడు సొమ్ము. ఎల్ఐసి పాలసీలు సరే సరే. కారుణ్య నియామకాల్లో వాళ్ల పెళ్లాలకి ఉద్యోగాలు. ఇక్కడ వారి పరిస్థితిని కవి బాగా వర్ణిస్తాడు. 'సముద్రంలో దేవుళ్ళాడే ఇలస, గోదావరి నీళ్లకు ఎదురేగి పులస అయిపోయినట్టుగా' ఉంది వీళ్ళ భాగోతం అని అంటాడు. వీరిని చూసి మిగతా ఆడవాళ్లందరూ వెధవ ముండలుగా మారతారు. వీళ్ల భర్తల చావుకు కారణం ఏమిటి? అన్నదానికి సత్యవతక్క నర్మగర్భంగా సమాధానం చెబుతుంది కవికి. సత్యవతక్క చాలా మంచిది కదా! 'ఇంతకీని ఈ సచ్చవతక్క ఎలాగ బోడిముండ అయినాదనే అనుమానం నీకూ వచ్చేసింది కదూ తమ్ముడూ' అంటూ, 'సలపరించి సంపేస్తన్న కేన్సరు కురుపుని కోసీపోతే ఎలా నాయనా! దాన్ని తీసీసి పేనం నిలబెట్టుకోడంలో తప్పేటీ నేదు కదా! అని సత్యవతి అక్క ఎదురు ప్రశ్న వేస్తుంది కవి తమ్ముడికి. అంటే సుదీర్ఘ కాలంగా ఎన్నో బాధలు పడుతున్న పెళ్లాలే తమ మొగుళ్లను కడతేర్చినట్లు కథలో పరోక్షంగా చెబుతాడు. ఇదొక తిరుగుబాటుగా సత్యవతక్క మాటలు సుస్పష్టం చేస్తాయి.
'ఒకటో రకం నిచ్చెన' కథలో ఆనాడు మునసబు, కరణం గిరీల గూర్చి ప్రస్తావన ఉంటుంది. వారి దౌర్జన్యాలు ఆనాటి ప్రజాబాహుళ్యంలో ఎలా ఉండేవో విశదీకరిస్తాడు కవి. 'మరి మనసబు గిరీ అంటే మజాకానా! మునసబు అంటే ఏ ఊరి మునసబు ఆ ఊరి కలెక్టర్ కింద లెక్క. అధికారాలన్నీ ఆయనవే'. లాంటి వాక్యాలు కాష్టాలు నాయుడు పాత్రలో కనపడతాయి. మునసబు కాష్టాల నాయుడు సువేగా మోపెడ్ మీద వెళ్తుంటే, అతగాడి కంటే ముందు తలారిగాడు పరుగులు తీయాల్సిందే. ఈ నాయుడుకి గైడ్, ఫిలాసఫర్ అన్నీను కంచుపల్లి కరణం. వారి పేరు మెలి పంతులు. దేన్నైనా మెలి పెట్టగల సమర్ధులు. పాత్రలు, పాత్ర పేర్లు ఈ కథలో బహుచిత్రంగా ఉంటాయి. వారి మధ్య సంభాషణలు పాఠకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. నాయుడు కూతురు జయ, మొగుడుకే మొగుడు లాంటిది. ఇలా పాత్రల స్వభావాన్ని కవి అద్భుతంగా వర్ణిస్తాడు. ఒకరోజు కాష్టాల నాయుడు తలారి లచ్చయ్య కలిసి చోడవరంలో ఉన్న నాయుడు కూతురు ఇంటికి వెళ్తారు. నాయుడు పొడుండబ్బా మర్చిపోతాడు. దాంతో లచ్చయ్యను మైళ్ల దూరంలో ఉన్న ఇంటికెళ్ళి తీసుకురమ్మని బెత్తాయిస్తోంది జయ. అలాగేనమ్మా అని యమ అర్జంటుగా పరుగు లంకించుకుని వెళ్ళి పొడుం డబ్బా తీసుకొస్తాడు తిరిగి. ఈ విషయం తెలుసుకున్న లచ్చయ్య పెళ్ళాం మొగుడిని తిడుతుంది. 'ఇచ్చీది ఈకన్నర దొబ్బీది జావున్నర' వంటి మాటలు గంగియమ్మ నోట వెంబడి వస్తాయి. పైగా 'ఎవడిదిరా గొప్ప కులం మీ నాయుడుదా! ఆయనేటి బాపనోడా, రాసోడా, కోవటోడా' అని విరుచుకు పడుతుంది. అంటే గంగియమ్మ దష్టిలో ఈ మూడు కులాలే పెద్ద కులాలన్నమాట. అప్పుడు లచ్చయ్య పెళ్ళాంతో ఇలా అంటాడు. 'నాయుడు పెద్దకులపోడేనే గంగీ, వుప్పుడు బాపనోరు అందరికంటేను పైనుంతారు. ఆరి కింద ఎవరుంతారు? రాసోలుంతారు. ఆరి కింద కోవటోళ్ళు. ఆళ్ల కిందని సూద్రపజాతి. ఆ కిందన మనము ఎక్కడో ఉంతాం. అని గంగియమ్మకు సర్ది చెబుతాడు లచ్చయ్య. ఈ కథలో చాతుర్వర్ణ వ్యవస్థ గూర్చి, ఆధిపత్య భావజాలం గురించి, అణగారిన వర్గాలపై వారు జరుపుతున్న పీడనలు, వేధింపులు గూర్చి చక్కగా విశదీకరిస్తాడు.
ఈ కథలతో పాటు మరికొన్ని కథలు కూడా పాఠకుల్ని అలరిస్తాయి. 'గంతలు' కథలో తెలకల సూరి కుటుంబం ఉంటుంది. 'తైలం ఎదురు రాకూడదట, తెలకలి శకునం పనికిరాదట. నూనె బిందె ఎదురైతే తెగ కోప్పడిపోతారు మిగతా జనం'. దీన్ని సూరి పెళ్ళాం భరించలేక మొగుణ్ణి ఎప్పుడూ సతాయిస్తుంది. దాంతో ఒక రోజు తెలకల సూరి తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తాడు. ఊరి పండగలో ఆడ వేషాలు వేసి మొక్కులు తీర్చుకుంటారు. ఆ ఆడవేషాలకు సూరి ఎద్దుల గంతలు అవసరం. అవసరమైనప్పుడు 'నేనెందుకు ఇవ్వాల్రా ఎద్దుల గంతలు? అని ప్రజలను ప్రశ్నిస్తాడు. సమాజంలో పేరుకుపోయిన మూఢనమ్మకాలను ఈ కథలో తీవ్రంగా ఎండబెడతాడు కవి.
ఒకటేమిటి రెండేమిటి సకల రసాల సమాహార బిగింపును దట్టించగల సమర్ధులైన కథకులు చింతకింది. కథా సాహిత్యంలో మరింత మెరుపులు మెరిపించగల దిట్ట. తన కలం నుండి దాలప్ప తీర్థం, కాన్పుల దిబ్బ, కప్ప స్తంభం మొదలగు కథా సంపుటాలుబీ వికర్ణ, అదిగో ద్వారక, ఔటర్ హార్బర్, బుగతల నాటి చుక్కపల్లి, పూల గుండు వనం వంటి నవలలుబీ కళింగ నానీలు అనే నానీల సంపుటిబీ అలివేణి ఆణిముత్యమా లాంటి మహిళలపై కథనాలుబీ పతంజలి మోనోగ్రాఫీ, ఆచార్య ఎన్.గోపి ఆధ్వర్యంలో నానీలపై సమగ్ర పరిశోధన గ్రంథం మొ: పాఠకులను ఎంతగానో అలరించాయి. కొలకలూరి ఇనాక్ పురస్కారం, కె.ఎన్.వై.పతంజలి పురస్కారం, మాడభూషి రంగాచారి స్మారక పురస్కారం, శాంతి రజినీకాంత్ స్మారక పురస్కారం, రావిశాస్త్రి పురస్కారం, చాసో పురస్కారం, ఎం.డి.వై రామ్మూర్తి స్మారక పురస్కారం మొ:నవి చింతకింది తన సాహితీ ఖాతాలో వేసుకున్నారు. 'ఉడుకు బెల్లం' కథా సంపుటిని ఆవిష్కరించబోతున్న చింతకిందికి అభినందనలు.
- పిల్లా తిరుపతిరావు,
సెల్ 7095184846