Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాల్గునర దశాబ్ధాల కవిత్వంతో నా రొమాన్సు :
నా సాహిత్య జీవనం గురించి చెప్పాలంటే కుటుంబం నేపథ్యం చెప్పాలి. కుటుంబం గురించి వివరించాలంటే కులం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కులం చెప్పకుండా నేపథ్యం ఉల్లేఖేస్తే పస లేదు. ఎందుకంటే మా కులం నువ్వులతో నూనె తీసే గాండ్ల కులం. మా తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అదే పనిలో ఉండిరి. మేం గూడ అదే పనిల ఉంటిమి. నేను 1955లో పుట్టిన. ఆర్థిక పరిస్థితులు బాగ లేకుండే, మా అమ్మమ్మ ఊరికి వెళ్లిపోయిన. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో 7వ తరగతి చదువుకున్న. శనిగరంలొ టెన్త్ వరకు చదువుకున్న 1971-72 లో. తర్వాత నా చదువంత కూడ, కాలేజీ మెట్లెక్కని చదువే... అయితే అక్కడ శనిగరం ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టు క్రింద సంవత్సరానికి మూడు పంటలు పండుతుండేవి. కాబట్టి, హరికథ అయ్యగార్లు, పటం కథలు, పాండ కతోల్లు, ఇట్లాంటివి చిరుతల రామాయణం కోలాటం చెప్పేవాళ్ళు. మా మేనమామ వాళ్లు చదివిపియ్య అన్నరు. మా అమ్మ ఇంట్ల బాగ పేదరికం ఉండే. అయినప్పటికి కూడ నేను మా ఊరికి వచ్చేసిన. ఇక్కడ కైకిలి పనులకు, బాయిలు తవ్వుటానికి, వరి కోతలకు, కాలువలు తియ్యడానికి ఇట్లా రెండు మూడేండ్లు పోయిన. పోయిన తర్వాత, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్ల ఉన్నప్పుడే నాకు సాహిత్య అభిరుచి అనేది ఏర్పడ్డది. జానకి రామయ్య సార్ ఇంటికి అప్పుడు సిద్దిపేటకెళ్ళి ఆంధ్రప్రభ, బాల మిత్ర, చందమామ అట్లాంటి పత్రికలు వస్తుండే. అవి ఎక్కువ చదివేవాన్ని నేను. అట్లా నాలో నాకు తెలువ కుండానే సాహిత్యానికి సంబంధించినటువంటి బీజాలు పడినయి అని నేను అనుకుంటున్న. ఇక్కడ సిరిసిల్లల ఉన్న లైబ్రరీలు, నారాయణరెడ్డి అనుయాయులు, కనపర్తి సార్ లాంటి వాళ్ళ లైబ్రరీ, నాకు లైబ్రరీ కార్డు లేకుంటే ఒక సాహితీ పెద్ద నా కంటే చాలా సీనియర్ కథకుడు, కవి జక్కని వేంకటరాజం కార్డు నాకిచ్సిండు. ఆ 123 కార్డు నంబరు నాకు ఇప్పటికి కూడా జ్ఞాపకం ఉన్నది. ఆ కార్డు తోటి సిరిసిల్ల లైబ్రరీల ఉన్నటువంటి రెండు మూడు వేల పుస్తకాలు చదివిన. ఇక్కడ యువ సాహితీ సమితి అని స్థాపించి వాళ్ళు కార్యక్రమాలు నిర్వహిస్తుంటుండేవారు నేను పోయే వాణ్ని. వాళ్ళు జనరల్ గా రేడియోకు పరిమితమై లలిత గీతాలు రాసేవాళ్ళు. మాత్రా ఛందస్సు గూడ నేర్చుకొని గేయాలు చాలా రాసిన. రాసుకుంట రేడియోకు పంపుతుంటే, తిరిగి వస్తుండే మేం ప్రసారం చేయలేక పోయినందుకు చింతిస్తున్నాం అని వాళ్ళే తిరిగి పంపేవారు.
దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించబడ్డది. అత్యవసర పరిస్థితి నేపథ్యంలనే, భారతదేశంల ఉన్నటువంటి చాల మంది నాలాంటి వాళ్ళకు, ఒక కొత్త చూపు ఏర్పడ్డది. అప్పుడే నాకు మార్క్సిజం గూడ పరిచయం అయింది. కమ్యూనిస్టు మేనిఫెస్టో, శ్రీశ్రీ, దేవరకొండ బాలగంగాధర తిలక్, నూతలపాటి గంగాధరం, అప్పుడున్న పేరు మోసిన కవులందరిని కూడా నేను లైబ్రరీల. చదువుకున్న. కానీ, ఎమర్జెన్సీ పిదప ఏది రాయాలి ఏది రాయకూడదు అనేది తెలుసుకున్నాను. అప్పటివరకు నేను రాసిన పాటలన్నిటిని గూడ, మా ఇంట్ల అమ్మ ఒక్క కట్టెతోటి వంట జేస్తుండె. ఉన్క పొయ్యి మీద. ఉన్క మధ్యన రోకలి వెట్టి ఉన్క తొక్కి దానితోటి పొయ్యి అంటువెడ్తురు. అయితే, పొయ్యి మండనప్పుడల్లా ఈ కాయితాలు పెట్టుమని మా అమ్మకు ఇచ్చిన ఒక ఐదారువందల పేజీలలో రాసిన తెల్ల కాగితాలు. అరె ఇవన్ని రాసినై ఉన్నయి గదర ఎందుకు అన్నది. ఇవన్ని ఇప్పుడు అక్కరకు రావు అని చెప్పిన. అరె గింత తెల్లందాక చదువుకొని రాసుకున్నవు గదర అన్నది. ఏం గాదు తిరు అంటే అమ్మ బాధపడుకుంటనే పొయ్యిల పెట్టింది.
1977 లో జనత ప్రభుత్వం మారినప్పుడు ఆంధ్రజ్యోతి వీక్లీల కవిత వచ్చింది. ఇట్లా అప్పటి నుంచి మొదలైంది. ఎనబై ఐదు దాక అరుణతార, ప్రజాసాహితిలో చాల నా కవితలు వచ్చినరు. కానీ, ఆ కవితలన్నీ ఆర్థిక కారణాలవలన వెయ్యలేక పోయిన. ఎనబై ఆరు నుంచి నేను రాసిన వివిధ పత్రికల్లో వచ్చిన కవిత్వాన్నంతా కూడా తొంభై మూడులో నేను, నా ఆత్మీయ మిత్రుడు నలిమెల భాస్కర్ కూడా ఇక్కడ జూనియర్ లెక్చరర్‌గా పని చేస్తుండే. ఇద్దరం సాహిత్య మిత్రులం కాబట్టి ఎక్కువగా కలుసుకునేది. నేను, సహచరితో కలిసి సహకార అర్బన్ బ్యాంకులో ఒక్కొక్కరం ఐదు వేలు అప్పు తీసుకున్నాను, అట్లనే భాస్కర్ కూడా తీసుకొని ఇద్దరం 1993 లో ఆయన ఉత్తమ పది మలయాళ కథలు అనే అనువాదం వేసిండు. నేను పాతాళ గరిగె అనే కవిత్వ సంకలనాన్ని తీసుకువచ్చము. అప్పటికే కొన్ని నిర్దిష్ట మైనటువంటి అభిప్రాయాలు ఏర్పడ్డాయి. కాబట్టి ఏ కవి అయినా ఎందుకు వస్తడు? అసలు ఎందుకు కొనసాగుతడు ? అనేటటువంటి నేపథ్యం నుంచి ఆవిష్కరణ అని నేనే రాసుకున్నా.
విలువలు నశించిపోతున్నయి, పెట్టుబడి వల్ల, ఆ విలువలను తిరిగి పట్టుకోవడమే కవిత్వం యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. ప్రజా ఉద్యమాలు నన్ను మిక్కిలి ప్రభావితం చేసాయి. ఆ క్రమంలోనే నేనీ కవిత్వం రాసిన అని చెప్పిన. అంటే నాకు అప్పటికే ఒక స్పష్టత ఏర్పడ్డది.మనం ఏ సమాజం మధ్య ఉన్నమో,ఏ ప్రజల మధ్య ఉన్నమో, ఎవరి బాధల గురించి ఆలోచిస్తమో,ఆ సాహిత్యానికి తప్పనిసరి ఒక ప్రయోజనం ఉంటది. ఏ పాయ సాహిత్యనికైన శుద్ధ కళావాదానికైన దాని సజనలో నిర్దిష్ట ప్రయోజనం ఇమిడి ఉంటుంది. ఒక్కోసారి బాహటంగా అగుపిస్తే కొన్ని సార్లు అంతర్గతంగా కనిపిస్తుంది.
దేశములోకి ప్రపంచీకరణతో పాటు అప్పుడు ఐ.యం.ఎఫ్, ప్రపంచ బ్యాంక్, మేధోపర సంపద హక్కులు పదాల భావజాలం కొత్తగా వచ్చినయి.
అప్పుడు డి.నరసింహరెడ్డి ''వ్యవసాయంలో సంక్షోభం'' అనే చిన్న పుస్తకంరాసిండు. అది చదివిన తర్వాత నేను షాక్ అయిపోయిన. అప్పుడు పెద్ద Aఅ్వఅఅa గోడకి కొట్టి చాలా ఎత్తు లేపుతుండిరి. తెలుపు మరియు నలుపు టి.వి. లు వస్తున్నాయి. ఒక్కో వాడకు ఒక ఇంట్లో మాత్రమే టి.వి. ఉండేది.
అప్పుటి దశ్యాలు అన్నీ కూడా ప్రపంచీకరణకు సంబంధించి బాగా నన్ను కదిలించాయి. ప్రజల్లో వ్యవసాయంలో జరుగుతున్న టువంటి సంక్షోభంగాని, అప్పుడే ఏర్పడుతున్నటువంటి లేబర్ అడ్డాలు. అప్పటి నుంచి వ్యవసాయం నుంచి, గ్రామాల నుంచి పెట్టుబడులు క్రమక్రమంగా ఉపసంహరించ పడ్డాయి వ్యవసాయ కూలీలు మొట్టమొదలు పని కోసం వెతుక్కుంటూ పట్టణాలకు, నగరాలకు వెళ్ళి పోయిండ్రు. అదే క్రమంలో తర్వాత రైతులు కూడా సంక్షోభంలో పడిపోయారు. అప్పుడు రాసినటువంటి పుస్తకం ఇండియా ప్రైవేటు లిమిటెడ్. నేను అప్పుడు రాస్తే చాలా మంది అరె దేశం ఇట్లా అయిపోయిందా అని పెద్ద పెద్ద వాళ్ళు కూడా అన్నరు. పాతాళ గరిగె విలువలు కోల్పోయిన మనిషి, సంధి కాలంలో భార్య ఒక్క చెక్కు బుక్ ఎట్లా అయిపోయింది? పిల్లలు ఒక వ్యాపారపు పంట ఎట్లా అయిపోయిండ్రు. అనే సారాంశంగా పాతాళ గరిగె తీసుకొచ్చిన.
జీవితం పరిధి చాలా విస్తతమైనది కదా సమాజం పరిధి కూడా విస్తతమైంది కదా, జీవితం యొక్క అనేక పార్శ్వాలను కూడా మనం కవిత్వంలో రాయాల్సిన అవసరం ఉంది అనే స్పష్టతతోని తొంబై ఆరు నుంచి తొంబై ఎనిమిది మధ్య రాసిన కవిత్వాన్ని ''గంగ డోలు'' అనే పేరు మీద తొంబై ఎనిమిదిలో పుస్తకం తీసుకొచ్చిన. ఇట్లా క్రమక్రమంగా ''వాస్కోడి గామా డాట్ కామ్'' దీర్ఘ కవిత కూడా రాసిన.
అప్పుడే, ఇట్లా నా సాహిత్య యాత్ర కొనసాగుతూ ఉన్నప్పుడే మనిషికి, భూమికి తల్లికి ఒక శిశువుకు ఉన్నటువంటి సంబంధమే కవిత్వానికి కూడా ఉంటది. అభిప్రాయాల తోటి ఆ మధ్య రాసిన కవిత్వాన్ని ''బొడ్డు తాడు'' అనే పేరుతోటి తీసుకొచ్చిన. అప్పుడు ఒక నాలుగైదు నెలలు కవిత్వం రాయలేదు. అనేక కారణాల వల్లన రాయకుండా ఉన్న. దాంతోటి ఒక్కటే రోజు పది కవితలు రాసిన. ఒక ''రోజు పదిగాయాలు'' ఒక ప్రయోగాత్మకమైన కవిత్వం. ఆ తరువాత ''తల్లి కొంగు'', ''పిడికెడు కలలు - దోసెడు కన్నీళ్ళు'' తీసుకువచ్చాను.
తర్వాత నేను తెలంగాణా రచయితల వేదికకు అధ్యక్షుడిగా పనిచేసిన, నేను వచ్చిన క్రమంలో తెలంగాణా ఉద్యమం ఉధతంగా జరుగుతున్నప్పటికి గూడా ఏకకాలంలో ప్రపంచీకరణ కవిత్వం, మానవ సంబంధాల అస్తిత్వ కవిత్వాన్ని ఎరుకతో స్పష్టంగా రాసిన. నన్ను బాగా కలచివేసినటువంటి కవిత్వం కూడా ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా మట్టుకు నేను రాసిన కవిత్వం ఎక్కువ శాతం ప్రపంచీకరణ గాని, జనంలో జరుగుతున్న సంక్షోభా లను కానీ, ప్రజల కన్నీళ్లను గాని, బాధలను రాసిన అని నేను నమ్ముతున్నాను. అయితే రెండు వేల పదమూడులో సాహితీ మిత్రులంతా కలిసి పద కొండు సంకలనాలు వచ్చాయి కదా సమగ్ర సంక లనం వెయ్యాలని అంటే ఒక మూడు సంపుటాలతో తోటి సమగ్ర సంకలనాలు కూడా తీసుకొచ్చిన.
అటుపిమ్మట చెట్టుని దాటుకుంటూ, పస, ఊరు ఒక నారుమడి తీసుకొచ్చిన.
గత నాల్గున్నర దశాబ్ధాలుగా కవిత్వం ఆశ్వాసంగా ప్రజలే ఆశగా నా సాహిత్య ప్రయాణం కొనసాగిస్తూ జీవిస్తున్నాను.
నా కవిత్వ వ్యక్తిత్వ నిర్మాణాన్ని ప్రభావితం చేసింది. ముఖ్యంగా ఒక ఎత్తు పుస్తకాలు అయితే, మరింత మెరుగు పెట్టింది నిజాం వెంకటేశం మరో ఎత్తు అని సవినయముగా తెలియజేస్తున్నాను.
ఇక్కడ ఒక విషయం స్పష్టాతి స్పష్టంగా నొక్కి తప్పక చెప్పవలసిన ఆవశ్యకత ఉన్నది. నేను సమాజం చలనాచలానాలను ఒడిసిపట్టుకొని రాస్తున్నాను. అంటే ప్రజలకు కవిత్వ ప్రతినిధిగానే కవిత్వ పరిభాషలో మాట్లాడాను.
వేయి సంత్సరాలకు పైబడిన తెలుగు సాహిత్యం ఈ సందర్భములో ఇప్పుడు అన్ని ఆధిపత్య భావజాలాలను భాషనూ పూర్వ పక్షం చేస్తూ అన్ని వర్గాల నుంచి కులాల నుంచి అందివచ్చిన కవులు రచయితలు తమ రచనలతో అన్ని సజన ప్రక్రియలతో ముందు ఎప్పుడు లేనంత సుసంపన్నం చేశారు తేజోవంతగా విలసిల్లుతోంది. అదే వరుసలో నుంచే నేను సాహిత్యంలోకి ప్రవేశించి ఆతరువాత నిల దొక్కుకొని, విస్తారంగా స్పష్టమైన దక్పదంతో ఒకానొక లోచూపుతో కవిత్వాన్ని రాస్తున్నవాన్ని.
- జూకంటి జగన్నాథం,
సెల్: 94410 78095