Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మీరు నడిచొస్తూంటే సొబగైన ఆంగ్లవాక్యమొకటి
కదిలొస్తున్నట్లుగా వుండేది
పాఠాన్ని ఇష్టపూర్తిగా బోధిస్తున్నపుడు మీ గొంతు మైదానం నుంచి
వివిధాంగ్ల శబ్దాలు సీతాకోకల్లా లేచొచ్చి
నా దేహౌద్యానం మీద వాలేవి
పాఠాన్ని వింటున్నంత సేపూ మెత్తని వొంపుల సెలయేరొకటి
నన్ను తడుపుతూ సాగుతున్నట్లుండేది
మీ రాక కోసం ప్రతిరోజూ నా కనులు
రంగురంగుల తివాచీలను పరిచేవి
పల్లెటూరి తెలుగు దారిలో నడిచొచ్చిన నాకు
తెల్లవారి భాషను సులువుటద్దంలో చూపించారు
పాఠాల్ని హద్య దశ్యాలుగా మలిచి అందించారు కనుకనే
అవన్నీ నా హదయ పేటిక మీద ఇప్పటికీ నిలిచి వున్నాయి
ఓ హెన్రీ ఆఖరి ఆకు
ఇంకా అట్లాగే కొమ్మకుంది రాలిపోక!
రవీంద్రుని గోరా సుచరితా బినరు లలితలు
ఇవాళ్టికీ నాలోపల సంభాషిస్తున్నారు
కీట్స్ ' లా బెల్లీ డాం సాన్స్ మెర్సీ' సౌందర్యవతి
అట్లా దయారహితంగా ఎట్లా వుందా అని
ఇప్పటికీ ఒంటరి వేళల్లో యోచిస్తూ వుంటాను
మీరే కదా సోమర్ సెట్ మామ్ ను తొలిసారి
మాకు చూపారు కథాక్షేత్రానికి తీసుకెళ్ళి!
తన చూపులేనితనమ్మీద సానెట్ రాసుకున్న మిల్లెట్
ఎంత చూపు కలవాడో చూపిన మీ చూపు
నా చూపు నుంచి అస్తమించలేదు మీ పాఠాల్లాగానే
మీ ప్రశ్నలూ ప్రియమే నాకు!
భయపెట్టేవి కావు ఉత్సాహపు వెలుతురునిచ్చేవి
ఇరవయారక్షరాల వింత భాష విచిత్ర పరిమళాన్ని
నా దేహాంతరాళాల్లోకి ఎంత వాత్సల్యంతో ఒంపారు మీరు!
ఇవాళ నాలుగు ఆంగ్ల కవితామాలికల్ని నేను అభీష్ట చిత్తంతో
అల్లుతున్నానంటే ఆ దారాన్నిచ్చింది మీరే కదా!
మీ నడకా మాటా చూపూ బోధనా - అన్నీ నిదానం
నిదానమే మీ సొగసైన శైలి ! కానీ
ఇట్లా మీ గుండె ఇవాళ ఆగిపోయేంత నిదానమా ?
సొగసు మాయమైంది, వగపు మిగిలె!
మీ పాఠాలన్నీ నాకు సతత సరళాలే!
కానీ ఇవాళ మీ అస్తమయం మాత్రం
నాకు అత్యంత సంక్లిష్ట ఆంగ్ల పద్యంలా వుంది
ఇప్పటికిప్పుడు ఆఖరి ఆకు రాలిపోయిన చప్పుడు!
ఎట్లా జీర్ణించుకునేది
ఇపుడు మరల ఒకసారి రాగలరా సార్ నిదానంగానైనా!
ఒక సరళ పాఠంతో నన్ను నిమ్మళ పరచడానికి!
వొంపుల సెలయేరులో నిండారా మరోసారి తడపడానికి!
(ఇంటర్మీడియట్ లో మాకు ఆంగ్లం బోధించిన ఉపన్యాసకులు, ఆంగ్ల కథారచయిత సుధాకర రావు గారికి నివాళిగా)
-దర్భశయనం శ్రీనివాసాచార్య
సెల్: 94404 19039