Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇరుకుదో చిన్నదో
ఉండేందుకు ఓ నీడ ఉన్నందుకు
అందరం కలిసి ఓ చోట
మనసు దుప్పట్లను పరిచి
తనివితీరా ఊసులాడేందుకు
ప్రేమగా అల్లుకున్న అందమైన మా
తులసీ నందనం గూడు ఉన్న
అభాగ్యనగరపు అమీరులం
బ్రతుకు పయనంలో
అలుపెరగని బాటసారులం !
మాపాలిటి మయుడైన సుతారి
మేస్త్రి నర్సింహులు మా అవసరాల
మేరకు సుతారంగా తీర్చికట్టిన
ఇంద్రభవనమే తులసీనందనం!
ఇపుడైతే రెక్కలొచ్చి పిల్లలు
ఎగిరిపోయి బోసిగా ఉన్నా
వారి జాడలు, అల్లర్లు ఎప్పుడూ
ప్రతిధ్వనిస్తూ మీతోనే ఉన్నామని
పలకరిస్తూ ఒంటరితనాన్ని
దూరంగా నెట్టి జంటతనాన్ని
ఇల్లంతా నింపేస్తుంటాయి !
అయినా ప్రేమగా అల్లుకున్న
పొదరిల్లులాంటి ఈ ఇంటి
ప్రతి ఇటుక,గోడ, తలుపు, కిటికీ
సదా మాతో మాటలు కలుపుతూతోడుగా
ఉంటున్నందుకు మురిసిపోతుంటాము !
అందుకే భూమ్మీది ప్రతి మనిషికి
అమ్మలా అక్కునచేర్చుకుని
కాపాడేందుకు ఇల్లొకటి కావాలి
భుక్తితోపాటుతలదాచుకునేందుకు
చిన్నదోచిరుగులదో ఓపూరిగుడిసె..
ఊరించి అందని ద్రాక్షగా మారిన
సర్కారు రెండు పడకల ఇల్లో...
ఏదీ కుదరకుంటే తలదాచుకునే
ఓ చెట్టు ఛాయనో దొరికే
మంచి రోజులు వచ్చేదెన్నడో ?
- డా. కె. దివాకరా చారి
సెల్: 9391018972