Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనిషి పల్లెల్ని
కొల్లగొడుతూ పోతున్నప్పుడు
చెరువుల్ని కాటకలిపి
భవంతుల్ని మొలిపిస్తున్నప్పుడు
తిండిగింజలనిచ్చి
తిరుగుబాటు పుట్టించే మట్టిని
కాంక్రిట్ తో సమాధి చేస్తున్నప్పుడు
ప్రశ్నించే గొంతుకలను
పచ్చనోట్లతో శాసిస్తున్నప్పుడు
నగరం నడివీపున పుట్టిన
రాచపుండు పేదరికం.
ఆకాశహర్మ్యాల వలయంలో
ఒదిగీఒదగని మురికివాడలుగా
ఎదుగుతుందది
ఆకలి బుసలతో
వలస గొలుసులతో
నగరమంతా వ్యాపిస్తుంది.
కాంభోజరాజు కొడుకులంతా కలసి
కొన్ని ఓదార్పు మాటలతో
మొసలి కన్నీళ్ళతో
పుండుకు మందు తయారు చేసి
నగరం నడివీపుకు పూస్తారు
దాంతో పేదరికం
తన అస్తిత్వం కోల్పోయి
యాచనవ్రణమై మిగులుతుంది.
- డాక్టర్. బి.బాలకష్ణ
సెల్: 9948997983