Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పులితో కలబడి పులిని చంపి తాను మరణించిన ఒక సాహసీ. ఆ వీరమరణం మీద నల్ల పూసలు లేచి ఇతడే నా జీవిత సహచరుడు. ప్రమాణం చేసిన లేలేత గొప్ప ఒక ప్రేమికురాలి త్యాగరీతి, వందేళ్ళ పల్నాటి మట్టి పురుడుపోసిన్నప్పుడు ఇచ్చోటనే పద్యం దళితుడి పాదం మీద పుట్టుమచ్చ అయ్యింది.
పద్యం అంటే విగ్గు నెమురుకుంటూ, నిషాతో... పాడెది కాదు- కొండంత పొట్ట మీద నిమురుతూ ముని వేళ్ళతో రుద్దితే రాదురా పద్యం-
పడమట కూలిన మట్టి గోడల మధ్య, మట్టి కుండల బువ్వ పిసుకుతూ, రెండు కంటి బొట్లు తోడైతే వచ్చింది పద్యం-
మంగలి స్నేహితుడు తల కొరుగుతూ వెంట్రుకల కింద గుజ్జు కత్తితో ఎడమ చేతికి రుద్దుకుంటే చూడు అప్పుడు చచ్చినట్లు వచ్చేది పద్యం-
శ్రమ వానలోనే కదా..! పద్యం.. కవిత్వం... జీవితం... తడిచి మొలకలెత్తేది!
నేలకు నీడ కూడా తాకని చోట, నిలువెత్తు నడుస్తున్న విష వేయి పడగలు. మనిషిని కాటేస్తున్న చోట, అదిగో... 18వ శతాబ్ధం చివరి అంకం (1895)లో వినుకొండ వీధి కొండల మీద, వేగు చుక్క పొడిచింది. అతడు గుర్రం జాషువా! రెండు పీడిత కులాల ఒక రక్త నది జీవం అతడు!
అగ్రవర్ణ బాలపాము బుసకొట్టినపుడు, తల్లి ఎదకొంగు తెరచాటు దు:ఖ ఓదార్పు, కొత్తగా చలిత పడమట దిక్కు సూర్యకిరణాలను ప్రసాధించింది.- దేవుణ్ణి ప్రశ్నించే గొంతు అయింది.
కష్టాలు.. అవమానాలు.. గుండె కోతలు.. బాల్యం లోనే, నింగికి ఎగిరే దివ్య శక్తిని ఇచ్చింది.
పల్నాటి కొండ మీద జాతి నివ్వెరపోయే రీతిలో... విశ్వం గర్వించే తెలుగు వాడి పంచెకట్టు దళిత పద్యం జాతి జెండాగా ఎగరవేసిండు జాషువా!
ఎవరు చెప్పకపోవచ్చు. వ్యక్తి వికాస పాఠంలో అగ్రవర్ణ కాలం చెరక్క పోవచ్చు. కాని, కాలం ఒక్కటి వుంది చూడు. ముందు తరాలకు భవిష్యత్ దూతగా అతడే విశ్వజనుడు జాషువా!
అదిగో.., ఇప్పటికీ వినిపిస్తుంది గంభీర, కంచు కంఠం జాషువా గొంతులోని తడి ఆరని పద్యం!
స్వరాజ్యాన్ని ప్రేమించాడా.. వచ్చిన స్వరాజ్యంలో అవలక్షణాలను ద్వేషించాడు.
ఎక్కడ గెంటి వేయబడ్డాడో అక్కడే పాదం మీదపారాణి రాపించుకుండు. గండ పెండేరం తొడిగించుకుండు-
నిప్పుల వాన నడక అది, అందుకే మనలో జీవించి వున్నాడు.
డెభ్భై ఆరేళ్ళ బతుకు పిసికి, పిసికి జీవితం నూతన చరితకు వీలునామా రాసి ఇచ్చిండు-
అతడు కదా విశ్వమానవుడు..
అతడు కదా విశ్వమహాకవి
అతని జ్ఞాపకం నిత్య చైతన్యం
అతని కవిత్వం అమరం!
అతడు నింగికెగరిన ధృవతార!
- జనజ్వల
సెల్: 9949163770