Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు భాషలో గొప్ప గొప్ప రచనలు చేసిన వారిలో జాషువ ఒకరు. తాను ఎదుర్కొన్న వివక్షతను కవిత్వంగా మలచడంతో జాషువ అణగారిన వర్గాలకి దగ్గరయ్యారు. శ్రీశ్రీ కవిత్వం జనులకు ఉత్తేజం కల్గిస్తుంది. ఉద్యమాల వైపు వారిని పరుగెత్తిస్తుంది. జాషువ కవిత్వం సమస్యలని విశ్లేషిస్తుంది. ప్రజలని ఆలోచింపజేస్తుంది.
గుఱ్ఱం జాషువ 1895 సెప్టెంబర్ 28న వినుకొండ సమీపంలో చాట్రగడ్డపాడులో జన్మించారు. ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభించారు. 1956 నుంచి 1960 వరకు ఆకాశవాణి మద్రాస్ కేంద్రంలో తెలుగు ప్రొడ్యూసర్గా ఉద్యోగం నిర్వహించారు. ఆయన రచించిన 'క్రీస్తు చరిత్ర' కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. కవి కోకిల, నవయుగ కవి చక్రవర్తి, కవితా విశారదగా పేరు పొందారు.
జాషువ ప్రజల భాషలో కవిత్వం రాశారు. భరతమాతని నిత్య బాలింతతో పోల్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. మన దేశంలో ప్రతి రోజు వేల సంఖ్యలో జనాభా పుడుతున్నారు. అయినా భరత మాత ఓపిగ్గా అందరిని పెంచుతుందని కవి భావం. ఫిరదౌసి లో ఆయన ప్రకతిని అద్భుతంగా వర్ణించారు. గిజిగాడు అనే ఖండ కావ్యంలో మానవులకు కూడా సాధ్యంకాని విధంగా గిజిగాడు పక్షి గడ్డిపోచలతో గూడుని కట్టుకోవడాన్ని జాషువ చక్కగా వర్ణించారు. ఆయన రచనలలో గబ్బిలం విశిష్టమైనది. అందులో ఆయన శ్రమజీవుల గురించి ఇలా అంటారు,
వాని రెక్కల కష్టంబు లేనినాడు
సశ్య రమ పండి
పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకి
భోజనము బెట్టు వానికి భుక్తి లేదు.
శ్రమజీవులు కష్టపడి పంటలు పండించి ప్రపంచానికి అన్నం పెడతారు. తీరా వారు తిందాం అంటే వారికి అన్నం ఉండదు అని కవి ఆవేదన వ్యక్తం చేశారు. జాషువ తన కవిత్వం ద్వారా మన దేశంలో అంటువ్యాధిలా వ్యాపిస్తున్న అంటరాని తనాన్ని ప్రశ్నించారు. కుల వ్యవస్థకి వ్యతిరేకంగా గళమెత్తారు. కవి తన ఆవేదనని గబ్బిలం ద్వారా ఈ విధంగా తెలియజేస్తారు.
పక్షి సుందరి! నీ చిన్ని కుక్షి నిండ
నిన్ని నీరంబు బలహారమున్న జాలు
నెన్ని దేశాలు తిరిగిన నేమి నీకు
నీవు నా వలె బుట్టు బానిసవు కావు.
ఓ గబ్బిలమా! నీది చిన్ని కడుపు, నీవు కడుపు నిండా తిని,దేశమంతటా తిరగగలవు. నీకున్న స్వేచ్ఛ కూడా మాకు లేదు అని అంటారు. నిమ్నవర్గాల వారు ఎదుర్కొనే వివక్షతను కవి చక్కగా వివరించారు. వారికి ఆలయాల్లోకి ప్రవేశం ఉండేది కాదు. వారు అడుగడునా నేటికీ ఏదో ఒక రూపంలో వివక్షకు గురౌతున్నారు. రాజు కంటే కవి గొప్పవారంటారు జాషువ. ఆయన గాంధీ, నేతాజీల గురించి రాశారు. 30 కి పైగా రచనలు ఆయన 1971 జులై 24న తుదిశ్వాస విడిచారు.
(జులై 24 జాషువ జయంతి సందర్భంగా)
- యమ్.రాం ప్రదీప్
సెల్: 9492712836