Authorization
Mon Jan 19, 2015 06:51 pm
"Poetry is ordinary language raised to the N th power"
_ Paul Engle
రెండు దశాబ్దాలకు పైగా తన కవిత్వం ద్వారా తెలంగాణ జీవద్భాష పరిమళాలను వెదజల్లుతున్న కవి అన్నవరం దేవేందర్. తొవ్వ, నడక, మంకమ్మ తోట, లేబర్ అడ్డా, బుడ్డ పర్కలు (నానీలు), బొడ్డుమల్లె చెట్టు, పొద్దు పొడుపు, పొక్కిలి వాకిళ్ళ పులకరింత, బువ్వకుండ (దీర్ఘకవిత), ఇంటిదీపం, వరి గొలుసులు, మరోకోణం (సామాజిక వ్యాసాలు), ఊరిదస్తూరి (తెలంగాణ సాంస్కతిక చిత్రణ), మొ||న పుస్తకాలతో తెలంగాణ నుడికారానికి వన్నెలద్దిన కవి ఇప్పుడు ''గవాయి'' కవిత్వంతో పలకరిస్తున్నడు.
'గవాయి' పదం 'గవాV్‌ా' అనే పార్శీ పదం నుండి వచ్చింది. దీని అర్థం సాక్ష్యం లేదా ప్రమాణం(రిఫరెన్స్ : నలిమెల భాస్కర్ సార్). కవి ఏయే సామాజికాంశాలను స్పశిస్తూ 'గవాయి'గా నిలబడుతున్నడో పరిశీలించినపుడు 'మనిషి' కేంద్రంగా వున్న కవిత్వం - రైతు, ఉద్యమకారుడు, కుటుంబ సభ్యుడు, సాధారణ పౌరుడు ఇట్లా బహురూపాల్లో కనిపించే మనిషి దర్శనమిస్తడు. ఉద్యోగ విరమణ చేసి ఆఫీసు వత్తిడుల నుండి ఉపశమనం పొంది ఇరాంగ వున్న కాలమిది. రికామిగా గడుపుతున్న గడియల్ని ఒక్కడే సుంచుకుతింటున్న సమయమిది.
''గోడగడియారం ఊపిరిమొసలోంచి/ ఉరుకులు పరుగులకు ఇక విరామం/ కదులుతున్న రెండు ముండ్ల మధ్యన/ కదలని సమయం నా సర్వ స్వంతం''
(పోస్ట్ రిటైర్మెంట్)
కదలని సమయాన్ని కొత్త పుస్తకాలతో, పాత దోస్తులతో, మనుమని లేత నవ్వుల ముచ్చట్లతో దోస్తీ కట్టి సద్వినియోగం చేసుకోవడంలో మునిగి తేలుతున్నడు.
''చంచలమై గిర గిర తిరిగిన మనస్సు/ సంసార నీడకే కదా! నిమ్మలం అయ్యేది''
(ఇల్లు)
కవి నిలువనీరులా బతకలేడు. నీటికున్న ప్రవాహగుణం తనది. ఊహలకు తోడు వాస్తవ ప్రపంచం పరిచయమ వ్వాల్సిందే! దేశ దేశాలు ఎన్ని తిరిగొచ్చినా 'ఇంటిపట్టున ఉంటేనే అసలుంటది/ ఇల్లంటేనే ఆమె అమ్మ పిల్లలు జల్లల సందోహం' అని తీర్మానిస్తడు.
''తెంపుకున్న పేగుమడత ఒక్కటే/ తాగిన చనుబాలధారా ఒక్కటే/ ఊగిన ఉయ్యాల అంబాడిన వాకిలి/ ప్రవాహమైన అంశ ఎన్నటికీ చెదిరిపోదు''
(ఒడిబియ్యం)
ఒక్కో కుటుంబం ఇలవర్శ ఒక్కోలా వుంటది. ఐదేండ్లకో పారి ఆడిబిడ్డలను పిల్సుకొని ఒడి నింపుడు, కొత్తబట్టలు వెట్టుడు పెద్దపండుగ లెక్క జరుపుకునే తంతును హద్యంగా మలిచిన తీరు ఆకట్టుకుంటది.
''కరోనా కాలాన్ని అవలీలగా ఈది/ వర్షఋతువులో తేలిన వానకోయిల/ పుట్టు పుట్టుకతోనే సముద్రమంత వర్షం/ ఎండిన మత్తల్లు నీళ్ళు దుంకిన కళ/ మనుమడు వాన తెచ్చిన సూర్యుడు''
(పసితనం)
కుటుంబంలోకి కొత్తగా శేరికయ్యే సభ్యులు -మనుమలు, మనుమరాండ్లు వత్త వత్తనే కోటి దీపకాంతుల్ని గుమ్మంలోకి తీసుకొత్తరు. మన మోముల్ని వికసింపజేత్తరు. మరి తాతగా కొత్త అవతారమెత్తిన కవి కావ్యాలు అల్లకుండా ఉండగలడా?
''చెప్పులు లేని కాళ్ళకు బట్ట పేల్కలు చుట్టి/ మోకాలు పిక్కలకు మోతుకు ఆకులు కట్టి/ అరిగిపోయేట్టుగ అడుగులు అడుగులు/ వందలు వందల కిలోమీటర్లపైనే గమ్యం''
(ఊరిదిక్కు)
కోవిడ్ గాడికి అలెగ్జాండర్ కన్నా ఆపచ్చన ఎక్కువు న్నట్టున్నది. దేశదేశాల్ని జయించుకుంట రావట్టిండు. పల్లేరు గాయల మొఖపోడు పానాలు దీయవట్టిండు. గోసబుచ్చు కోవట్టిండు. అందుకే వశపడక బతుకుదెరువు కోసం వలసొచ్చిన జనం ఊరిదిక్కే మర్రిపోవట్టిరి.
''తెలంగాణమంటే తెగించిన పోరాటమే కాదు/ వితరణ చేసే అన్నదాన శిబిరం'' (NH44)
మర్రిపోతున్న మనుషుల హదయ విదారకమైన సంఘటనల్ని, వారి దుక్కపెట్టే ఆకలిని చూసి చలించిన మనుషులు కొందరు NH44 పై దర్శనమివ్వడం చూస్తాం. అక్కడ బిడ్డల ఆకలిని పసిగట్టిన తల్లి మనసున్నోల్లు అవుపడుతరు. ఆపతి సంపతికి ఆదుకుంటున్న నిలువెత్తు మనుషులు తారసపడుతరు. నెత్తురోడే అరికాళ్ళను, బిక్కసచ్చిన పసిపోల్లల మొఖం సూడలేక గమ్యం చేరుస్తున్న మనుష్యుల తండ్లాట కనిపిస్తది. ఇది కదా.. అసలు సిసలు మనిషి తత్వం.
''దెబ్బలు లేవు బొబ్బలు లేవు/ పెయ్యంత కొట్టి పండవెట్టినట్టు''
(వ్యాక్సిన్ యుద్ధం)
''సచ్చిన పిల్లిని గోడ అవుతల పారేసినట్టే అయింది'' (కాలం బహురూపులది)
''తుంపిర్లు కావవి తుపాకి గుండ్లు/ అంటుడు అంటే అణువిస్పోటనం/ కౌగిలంతా ఆఖరు జ్ఞాపకమే కావచ్చు''
(కొత్తలోకం)
''నగరం ఒకానొక ఆగిపోయిన చిత్రం''
(నిశ్చల నగరం)
''దుడ్డె మూతికి బుట్టి లెక్క మనుషులకూ మాస్క్/ కరోనాకు దూరదూరమే కరవాలం'' (అసంత అసంత)
''తుమ్మముల్లుకుచ్చిన లబ్బరు బుగ్గ లెక్క/ ఊపిరితిత్తులు తుత్తునియం/ ../ కోవిడ్ వైరసుది వివక్షలేని స్వేఛ్చ/ కులమత వర్గాలన్నీ సరిసమానం''
(మరణ సంక్రమణం)
కరోనా కాలాన్ని వస్తువుగా స్వీకరించి, భిన్నకోణాల్లో ఆవిష్కరించడం గమనించవచ్చు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత శరీరంలో వచ్చే మార్పుల్ని అనుభుతిస్తాం. కోవిడ్ గాడు వోడిపోయే యుద్ధం మొదలైందనే ఆశావాద దక్పథాన్ని అవలోకిస్తాం. కరోనా విపత్కర పరిస్థితుల్లో మనిషికి పట్టిన గతి ఎసుంటిదో కవికున్న అనుభవసారంతో ఒకేఒక వాక్యంతో మన కండ్లు తేటగజేత్తడు. ఒకపక్క హెచ్చరిస్తూనే లాక్డౌన్ లేచినంక పచ్చ పచ్చగా చిగురిస్తామని, అప్పటిదంక ఏకాంత గుహలోకి వెళ్ళటమే శరణ్యమని హితబోధ చేస్తడు. ఇంటిగోడకే అతుక్కున్న దేహ గడియారానికి గహమే సుఖ కారాగార వాసమని తీర్పునిస్తాడు. స్తంభించిపోయిన జనజీవితాన్ని, కొత్తగా పురుడు పోసుకుంటున్న ప్రకతిని చూస్తున్నప్పుడు కోవిడ్ గాడు మిత్రుడో.. శత్రువో.. అర్థంగాని పరిస్థితి. కలిసి వుంటే కలదు దుఖం అనేది నేటి మాట. ఎన్కట ముసలోల్లకు పల్లెం, గిలాస, పక్కబట్టలు వేరుగా పక్కనబెట్టినట్టు, యిప్పుడు పునరావతమవుతున్న దశ్యాలే గవాయిలు. వైరస్ తీవ్రతను, దాని పరిణామాల్ని చెబుతూనే మరోపక్క ఇంకో వేయేండ్లు గడిచినా మారని మనిషి దష్టికోణాన్ని పట్టిచెప్తున్న తీరును మననం చేయిస్తడు.
''పొలం లోకానికే సద్దిగిన్నె''
(సౌందర్యం)
ప్రకతి సమతుల్యతను కాపాడేది రైతు ఒక్కడే. ఎవుసం అనాదిగా మన తాతలు, తండ్రుల నుంచి వస్తున్న వారసత్వం. అందుకే కవి పంట పండించడమే మన ఇలవర్శ అని, ప్రకతితో మమేకమైతేనే జీవన సౌందర్యమని చెబుతాడు.
''ఇక్కడి మేఘాలకూ రాజకీయాలు అబ్బినరు/ దోని సప్పుడే గానీ దొయ్య పారింది లేదు'' (వానొస్తలేదు)
ఎవుసం ఇగురెక్కాలంటే ఎదురెక్కే వాన కురువాలె. వానొస్తలేదంటే ఎవల తప్పు ఎంతున్నదో ఇసారియ్యలె. కవి వ్యంగంగా అన్న మాటల్లో ఎంత ఆవేదన వుందో వెలికి తియ్యాలె. కార్తెలెత్తిపోతానయని కాలాన్ని నిందిస్తంగని, కావలిచ్చుకుని కార్జాలు దొబ్బుకపోయే దొంగనా కొడుకుల్ని నిలదీయాలని అనిపించదు. గుట్ట మాయంజేసేటోడు..మొక్క నాటేటోడు.. ఒక్కడేననే పశనతు ఉండదు. కొండలు ఆంబుక్కవెట్టుడు బంజేత్తనే గదా.. కవి ఆశించినట్టు 'మబ్బులు మెత్తగై వూర్లల్ల వానశేర్లు దిగుతై'.
''వంచిన బాణం వలె వెన్నెముక వంక/ బురుదల దిగి కదులుతున్న మట్టికాళ్ళు/ మునుం ఎల్లేదాక తీపులే తీపులు/ ఒక్కో అడుగు వెనుకకు నడిస్తేనే/ పొద్దుగూట్లె పడుతది''
(వరినాట్లు)
నాట్లువేసేటప్పటి దశ్యం ఎంత రమణీయంగా వుంటదో, అంతటి కష్టం సుత వుంటది. ఎవుసం అంటేనే కష్టం. కష్టం మరుపుదెచ్చి ఊపునిచ్చేది పాట. పాటతో పెనవేసుకున్న బంధం జానపదులది. ఎన్ని తీపులు తీసినా అన్ని రాగాల పాటలు కైగట్టబడి అలుపు దీరుస్తయి. కవిజెప్పిన రాజవ్వ లాంటి వాళ్ళ అడుగు వెనుకకు పడితేనే మనదేశం ముందుకు పోతుందని యాదుంచుకోవాలె.
''ప్రతిరోజూ తినే రొట్టె మీదనన్నా/ వ్యవసాయుని బక్క మొఖం అగుపిస్తలేదా నీకు/ చట్టాలతో పొట్టలు ఎందుకు పొక్కచేస్తవ్''
(విత్తన చౌరస్తా)
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టాలనుకున్న నూతన వ్యవసాయ చట్టం పట్ల రైతులకున్న తీవ్ర వ్యతిరేకతంతా వాళ్ళు రోడ్ల మీద బైటాయించినపుడు, ప్రభుత్వం నీళ్ళతో నిలువరించాలని చూసినప్పుడు ఎవలు ఎవల దిక్కో తెల్లగోలు అయింది.
కేంద్రం ఆగడాలు ఇవొక్కటేనా.. ఎన్నికలప్పుడే దేశంలో సర్జికల్ స్త్రైక్స్ ఎందుకు జరుగుతాయో అమాయక జనాలకు ఎవలు జెప్పాలె? అన్యాయాలకు ఎదురు తిరిగితే, ఆదివాసీలకు అండగా నిలబడితే, హక్కుల కోసం ప్రశ్నిస్తే.. కొన్ని కలాలు నెత్తురు కక్కుకుంటాయి. కొన్ని కలాలు జైళ్లలోనే శ్వాస నొదులుతై. దాడులు జరుగుతై. సంఘ విద్రోహశక్తులని ముద్దేర్లు పడుతై. కల్బుర్గీ, గోవింద్ పన్సారే, గౌరిలంకేష్ నుండి నేటి స్తాన్ స్వామి వరకు మేధావుల్ని, రచయితల్ని, ఉద్యమకారుల్ని నిర్భందించడం, ప్రాణాలు పోయేవరకు నిర్లక్ష్యంగా వ్యవహరించడం గమనిస్తే ఈ దేశంలో స్వేచ్చకు విలువ లేదని, రాజ్యానికి ఎదురు తిరిగే గొంతులు తెగిపడతాయని అ(న)ధికార నియంతత్వ ధోరణి స్పష్టం చేస్తుంది.
''ఆయన ఎన్నడూ నేలతల్లి కడుపు చీల్చి ఖనిజ కార్జాలను అమ్ముకోలేదు/ దేహం మీద గాట్లుపెట్టి భూమిని వక్కలుచేసి తరాజుల పెట్టలేదు''
(రిలీజ్ ద పోయెట్)
విప్లవకవి వరవరరావు భీమాకోరేగావ్ కేసులో జైల్లో మగ్గుతున్నప్పుడు ఆయనకు సంఘిభావం తెలుపుతూ విడుదల చేయాలని నినదించిండు. కులమతాలకు అతీతంగా భిన్న భావజాలాల సమూహాలు ఎందుకు మద్దతు ప్రకటించాయి? పీడితుల పక్షం నిలబడి పోరాడుతున్నందుకేనా? మరి ప్రభుత్వం ఎందుకని కుట్రలు పన్నుతుందో వివేచించాలి.
''కలుపుకునుడా, ఎకేరే ఉంచుడా/ ఎనుకటి మాటలు సుతులాయిన్చుకోవాలెగని/ సంగ సంగ ఎగురుడు ఎందుకె అన్నయ/ సమ్మె అంటే సమ్మెట పట్టవడితివి/ సంగం గింగం సంగతి సూస్తనంటున్నవ్/ గిట్ల అయితే ఎట్లనే పెద్దనాయిన''
(ఎటమటం)
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపైన సుత చురకలు అంటిస్తూ కీలెరిగి వాతపెట్టే కవిత్వమైతడు. గద్దెనెక్కినంక మాటదప్పె పెద్దమనుషులకు షెక తాకేటట్టు అక్షరాల మంటవెడుతడు.
పచ్చి మట్టి కుండల పాలుపోసి పాశం వొండితే ఎట్లుంటది? టంగు టంగుమనే ఇసిరెను రూపం సక్కగలేదని చక్రం మీద తిప్పితే ఏం ఫాయిదా? బండి దొర్రగిలబడకుండా ఒకటికి పదిసార్లు సూసుకోవాలె. అందుకే ఎక్కడన్నా వాచ్యమై బాటబట్టే వాక్యాల్ని ఎన్కకు శెరిగొట్టిచ్చి, తెలంగాణ జీవద్భాష సౌందర్యంతో మును ముందుకు ఆయిచ్చుకునే ఏర్పాటుజెయాలె. వారసత్వంగా తెలంగాణ నుడికారాన్ని అందిపుచ్చుకొని సామాజిక సమస్యల పట్ల నిత్యం జాగరూకుడై స్పందిస్తూ ఇయ్యాల పీడితుల పక్కన ''గవాయి'' గా నిలబడి కవిత్వమవుతున్న కవి అన్నవరం దేవేందర్‌కు వినమ్రంగా సలాములు.
- బండారి రాజ్ కుమార్
సెల్: 8919556560