Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎప్పుడో ఒకానొకప్పుడు ఉప్పనైనా చప్పనైనా
ప్రపంచమంతా నీటితో నిండిపోతుంది.
మట్టి దానికింద యుగాల అలసట తీర్చుకుంటుంది
బహుశా కాలువలూ చెరువులూ నదులూ వుండకపోవచ్చు
ఉండేది ఒకే ఒక సముద్రం మాత్రమే
భాగాలుగా విభజించే భూభౌతిక శాస్త్రాలతో పనివుండదు
వరద కాటేసిన పంటపొలాల్లోకి ఎలా చేరిందీ నీరు
స్వార్ధపు మనిషి చేష్టలకు విసుగెత్తి ప్రకతి దాచుకున్న కన్నీరా
సముద్రం లేదనుకున్న విశ్వనగరం మహాజలనగరమైంది
నగరాన్ని నీటి అనకొండ చుట్టుముట్టింది
ఇళ్ళన్నీ వీధిలోకొచ్చాయి
అభివద్ధి ముగ్గులోకి దిగిన నగరం
ఆకాశసౌధాలూ అధునాతనత్వాలే
నాగరికతనే మత్తులో వున్నాము
ప్రజల కళ్ళలో ఉప్పని సముద్రం కెరటాల్లా అభాగ్యులు
పగలంతా చిమ్మచీకటిగా మారిన
ఊరిని చూసిన చెట్లు నోళ్ళు తెరిచాయి
పక్షులు షరామామూలుగా అనాథలయ్యాయి
ఇప్పుడు వర్షం జనన మరణాల మధ్య
కాలం గీసిన నీటిపొర.
జంటనగరాలు జలనగరాలై
భాగ్య నగరం నిండా సముద్రుడి బంధువుల
విలయతాండవంలో జనం కన్నీటి వరదలయ్యారు.
జలఖడ్గం స్వార్థపు రెక్కలను తెగనరికింది
పర్యాటకుల మధ్య నాలుగు తలలెత్తి
హుందాగా నిలబడ్డ చార్మినార్
నీటిపాము కోరల మధ్య దిక్కుతోచక నిల్చుంది.
ఆకాశం ఒంపే ప్రతి వానచుక్కకీ నగరం వణుకుతుంది
ప్రభుత్వాల కళ్ళకు కట్టిన ఆనకట్టలకు
చెరిగిపోయిన చెరువుల మధ్య కబ్జాల్లో ఇరుక్కున్న నాలాల మధ్య
కన్నీటి ప్రవాహాల ఉధతి కనిపించదేమో
పరిణామ క్రమాల సమాధి కింద నీటిలోని ఏకకణజీవి నుండి మొదలైన జీవం
ఎన్ని రూపాంతరాలు చెందినా మళ్ళీ
అక్కడికే చేరుతుందేమో..
- ర్యాలి ప్రసాద్